మంత్రి కేటీఆర్‌తో మెప్మా ఉద్యోగుల భేటీ
సాక్షి, హైదరాబాద్: పట్టణాల అభివృద్ధిలో మహిళల పాత్రను మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు తెలియజేశారు. బుధవారం ఆయన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులతో సమావేశమయ్యారు. సంస్థలో పని చేస్తున్న రిసోర్స్ పర్సన్లు, కమ్యూనిటీ ఆఫీసర్ల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున మెప్మా ఉద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రిసోర్స్ పర్సన్లు, ముఖ్యంగా మహిళల సహకారంతో తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను పట్టణాల్లో పకడ్బందీగా అమలు చేస్తోందని మంత్రి తెలిపారు.
ప్రభుత్వం అమలుచేస్తున్న కేసీఆర్ కిట్లు, హరితహారం, బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా పట్టణాలను ప్రకటించే కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న తీరు పైన రిసోర్స్ పర్సన్ లనుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ప్రభుత్వం మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వ వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ నేపథ్యంలో వాక్సినేషన్, షౌష్టికాహార కార్యక్రమాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలపై పట్టణ ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని కోరారు. మెప్మా ఉద్యోగులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరలోనే సమావేశం అవుతారని తెలిపారు. ఈసందర్భంగా మెప్మా ఉద్యోగులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దాదాపు దశాబ్దకాలం పాటు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల అమలులో క్షేత్ర స్థాయిలో కీలకంగా పనిచేస్తున్నా, తమకు అతి తక్కువ వేతనాలు ఉన్నాయని, వీటిని పెంచాలని రిసోర్స్ పర్సన్లు మంత్రికి విన్నవించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటారని, మంత్రి మెప్మా ఉద్యోగులకు హామీ ఇచ్చారు.