మంత్రులూ... శెభాష్‌ | cm kcr prices ministers on baktha ramadasu project | Sakshi
Sakshi News home page

మంత్రులూ... శెభాష్‌

Published Fri, Jan 27 2017 2:02 AM | Last Updated on Wed, Jul 25 2018 2:52 PM

మంత్రులూ... శెభాష్‌ - Sakshi

మంత్రులూ... శెభాష్‌

రికార్డు సమయంలో ‘భక్త రామదాస’ పూర్తిపై సీఎం కేసీఆర్‌ హర్షం
రాష్ట్ర ప్రత్యేకత చాటారని మంత్రులు హరీశ్, తుమ్మల,  అధికారులకు అభినందన
మిగతా ప్రాజెక్టులనూ వేగంగా పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని ప్రకటన


సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాలో చేపట్టిన భక్త రామదాస ప్రాజెక్టును గడువుకన్నా ముందే పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. వేగంగా ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను చాటారని మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లను అభినందించారు. పాలేరు ఉప ఎన్నికలో అఖండ మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించిన ప్రజలకు భక్త రామదాస ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసి కృతజ్ఞతలు తెలపడం ఆనందంగా ఉందని సీఎం పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌కు ఓటేసి గెలిపించిన రాష్ట్ర ప్రజలందరికీ అన్ని ప్రాజెక్టులనూ వేగంగా పూర్తి చేసి రుణం తీర్చుకుంటామని, ప్రజల నమ్మకం నిలబెట్టుకునేలా పనిచేస్తామని సీఎం ప్రకటించారు. చిత్తశుద్ధి, అంకితభావం ఉంటే ప్రాజెక్టులు అనుకున్న సమయంకంటే ముందే నిర్మించవచ్చని నిరూపించగలిగామన్నారు. ఈ ప్రాజెక్టును భక్త రామదాసు జయంతి రోజైన ఈ నెల 31న సీఎం ప్రారంభించనున్నారు.

రెండున్నరేళ్లలో 19 లక్షల ఎకరాలకు నీరు
రాష్ట్రం ఏర్పడ్డాక రెండున్నరేళ్లలో కొత్తగా 19 లక్షల ఎకరాల మేర నీరందించామని నీటిపారుదల శాఖ ప్రకటించింది. మేజర్, మీడియం ప్రాజెక్టుల కింద కొత్తగా 11 లక్షల ఎకరాల మేర నీరివ్వగా చెరువులు పునరుద్ధరణతో మరో ఏడున్నర లక్షలకుపైగా ఆయకట్టుకు నీరిచ్చామని తెలిపింది. మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్, భీమా ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేసి ఇప్పటికే నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరందించామని, మరో మూడున్నర లక్షల ఎకరాలకు వచ్చే ఏడాది నీరందిస్తామని పేర్కొంది. వచ్చే రెండు, మూడేళ్లలో అన్ని ప్రాజెక్టులనూ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, భక్త రామదాస ప్రాజెక్టు పూర్తి ఇచ్చిన విజయం... పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణానికి కొత్త ఉత్సాహం ఇస్తుందని నీటిపారుదల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎస్‌కే జోషీ పేర్కొన్నారు.

మా సంస్థకు గొప్ప పేరు: మెగా డైరెక్టర్‌ కృష్ణారెడ్డి
భక్త రామదాస ప్రాజెక్టును గడువుకంటే రెండు నెలల ముందే పూర్తి చేయడం తమ సంస్థకు గొప్ప పేరును తెచ్చిపెట్టిందని మెగా ఇంజనీరింగ్‌ వర్క్స్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ సహకారం వల్లే ప్రాజెక్టు పనుల పూర్తి సాధ్యమైందన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో 12 నెలల్లో పట్టిసీమ నిర్మించి రికార్డు సృష్టించామని, ఇప్పుడు రాష్ట్రంలో కేవలం 11 నెలల్లో భక్త రామదాసను నిర్మించి కొత్త రికార్డు నమోదు చేయగలిగామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement