సాక్షి, సిద్దిపేట/ మర్కూక్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం పరిశీలించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్ నుంచి మధ్యాహ్నం బయలుదేరిన ఆయన, తన వాహనంపై 15 కిలోమీటర్ల పొడవున ఉన్న కట్ట చుట్టూ తిరుగుతూ.. కట్ట నిర్మాణం, నీటి నిల్వ, కాల్వల ద్వారా నీటి విడుదల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ హరిరామ్‌తో సీఎం మాట్లాడారు. రిజర్వాయర్ హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్నందున పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కట్టపై ఇరువైపులా పచ్చని చెట్లు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పాలని ఆదేశించారు. ప్రస్తుతం రెండు పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తేనే జలపాతాన్ని మించిన శోభ కనిపిస్తోందని, ఇక రిజర్వాయర్‌కు ఉన్న ఆరు పంపుల ద్వారా నీరు విడుదల చేస్తే ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే రిజర్వాయర్‌ను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నారని, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తే సందర్శకుల తాకిడి అధికం అవుతుందని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా భద్రతను కూడా పెంచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
కాగా, పర్యాటకులు కట్టపైన ఇష్టానుసారంగా తిరగకుండా చూడాలని, అవసరమైన చోట్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రిజర్వాయర్‌పై వెళ్తూ ఉంటే ఆనందంగా ఉందని అన్నారు. రిజర్వాయర్ ను పూర్తిస్థాయిలో నింపితే ఈ ప్రాంతంలోని ఇంచు భూమి కూడా వృథా పోకుండా సాగులోకి వస్తుందన్నారు. అప్పుడు చుట్టూరా పచ్చటి పొలాలు, మధ్య లో అందమైన రిజర్వాయర్ పర్యాటకులకు మరింత కనువిందు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రితోపాటు ఆయన చిన్ననాటి స్నేహితుడు జహంగీర్ ఈ పర్యటనలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment