
'కేసీఆర్ రోజుకో సినిమా చూపిస్తున్నడు'
పరిగి: సీఎం కేసీఆర్ చేసే పనులతో రాష్ట్ర ప్రజలకు రోజుకో సినిమా చూపిస్తున్నారని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. రాజధానిలో ఆయన కన్నుపడిన ఏ భూమిని కేసీఆర్ వదలకుండా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా పరిగిలో ఆదివారం జరిగిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా పట్టభద్రుల స్థానం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రవికుమార్ గుప్తాను గెలిపించాలని ఆమె కోరారు.
టీఆర్‌ఎస్, బీజేపీలు స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ఎమ్మెల్సీ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గెలుస్తామన్న అహంకారంతోనే ఇలా చేశారని, వారి అహంకారాన్ని అణచాలని కోరారు. ఎన్నికల ముందు ఆంధ్రావాళ్లను కించపరిచి ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికల కోసం మాటమార్చారని ఆమె మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని, కనీసం వారి కుటుంబాలను పరామర్శించట్లేదని ఆమె దుయ్యబట్టారు. మరోవైపు తనను గెలిపిస్తే ఎల్లవేళలా అండగా ఉండి సేవ చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి రవికుమార్ పేర్కొన్నారు.