బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు | cm kcr warns chandrababu | Sakshi
Sakshi News home page

బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు

Published Tue, Jun 9 2015 3:04 AM | Last Updated on Tue, Oct 16 2018 8:46 PM

సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగసభకు హాజరైన జనం. సభనుద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్ - Sakshi

సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగసభకు హాజరైన జనం. సభనుద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్

- ఇంకా ఎక్కువ మాట్లాడితే తగిన శాస్తి జరుగుతది  
- ఏపీ సీఎం చంద్రబాబుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్
 
సాక్షి ప్రతినిధి, నల్లగొండ:
‘‘చంద్రబాబూ..! లఫంగితనంతో ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చి, రాజకీయాలను చెడగొట్టి, ఆ ఎమ్మెల్యేలను భ్రష్టు పట్టించే పని చేసినవ్. తెలంగాణ బిడ్డ స్టీఫెన్‌సన్ నీ దుర్మార్గాన్ని బయటపెట్టి నిన్ను పట్టించిండు. ఇప్పుడు నీ ఎమ్మెల్యే జైల్లో ఉన్నడు. నీ చరిత్ర బయటకొస్తున్నది. నువ్వు ఫోన్లలో మాట్లాడింది బయటపడింది. పట్టపగలు దొరికినా నీ అరుపులతో ఏదో చేయాలనుకుంటున్నవ్. నిన్ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. నిన్ను ఎవ్వడు కాపాడలేడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీకే శాస్తి జరగాల్నో అదే జరుగుతది’’ అంటూ ఆంధ్రప్రదేశ్ సీఎంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు.

‘ఓటుకు నోటు’ వ్యవహారంపై స్పందిస్తూ సోమవారం గుంటూరు మహాసంకల్ప సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో అడ్డగోలు రాజకీయాలు చేసిన వాళ్లు... అవినీతి రాజకీయాలు చేసిన వాళ్లు తెలంగాణలో కూడా ఏవో రాజకీయాలు చేయాలనుకుంటున్నరు. నన్ను అన్యాయంగా ఇరికించిండ్రని చంద్రబాబు అంటున్నడు. ఇరికిస్తే ఇరికే మనిషివా నువ్వు చంద్రబాబూ? కొంపలు కూల్చెటోడివి కానీ... నీ కొంప కూల్చుకుంటవా!

నీ మీద అన్యాయంగా కేసు పెడ్తరా... పక్క రాష్ట్రం వాళ్లు వచ్చి మా రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కుంటుంటే చేతులు ముడుచుకు కూర్చోవాలా? నోరప్పగించి చూడాలా? పట్టపగలే దొంగతనం చేస్తూ దొరికినోడిని దొంగ అనొద్దంట.. పట్టుకోవద్దంట. పట్టపగటీల దొరికిన దొంగ నువ్వు. నిన్ను ఇరికించే ఖర్మ మాకెందుకు, మాకేమన్న కాళ్లు చేతులు గులగుల పెడుతున్నయా..’’ అని చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు.

సోమవారం నల్లగొండ జిల్లాలో వాటర్‌గ్రిడ్ పైలాన్ ఆవిష్కరణ, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.

‘‘రోజుకు 18, 20 గంటలు కష్టపడుతున్నా మాకు సమయం సరిపోవడం లేదు. మీ బాధ మాకెందుకు? రామేశ్వరం పోయినా శనేశ్వరం వదల్లేదన్నట్టు. ఈ దిక్కుమాలిన దందా మాకొద్దన్నా. ఆనాడు కాంగ్రెస్ సన్నాసులు ఒప్పుకోవడం వల్ల హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధాని చేసిండ్రు. కేసీఆర్‌కు ఎంత హక్కు ఉందో హైదరాబాద్‌పై నాకూ అంతే హక్కుంటదని బాబు అంటున్నడు. నీకు హైదరాబాద్‌పై హక్కుందా? హైదరాబాద్ నీ అబ్బజాగీరా.. హైదరాబాద్ నీ తాతదా.. హైదరాబాద్‌కు నువ్వు కాదు ముఖ్యమంత్రివి.. తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి. హైదరాబాద్‌లో నీ ఏసీబీ ఉండదు. నగ్నంగా, పచ్చిగ దొరికినవ్. అట్ల దొరికి కూడా అరిసి, పెడబొబ్బలు పెట్టి, గాయి చేసి భయపెట్టాలనుకుంటున్నవా? గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెల్సు నీ బతుకేందో, నీ రాజకీయాలేందో? నీ లుచ్ఛా, లత్కోరి పనేందో దేశానికి తెలిసిపోయింది. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు.

తెలంగాణ ప్రజానీకమే నీకు శాస్తి చేస్తుంది. నాకు కూడా ఏసీబీ ఉంది అంటున్నవు. కానీ కేసీఆర్ నీ లెక్క దొంగ కాదు కదా. నీలెక్క దొంగ రాజకీయాలు రావు కదా! నీలెక్క లత్కోరి పని చేయడు. నువ్వు నీతిమంతుడివే కదా? సత్యహరిశ్చంద్రుడి ఇంటి వెనుకనే ఉంటవ్ కదా! అసలు గెలిచే మెజారిటీ లేకపోయినా ఎన్నికల గోదాలోకి దిగింది నీ పార్టీ కాదా? ఎమ్మెల్సీ గెలిచే ఓట్లు నీకున్నయా? ఎందుకు దిగినవ్? ఇది తెలంగాణ. ఉద్యమ బెబ్బులి. స్వయం పాలన, ఆత్మగౌరవంతో కాలర్ ఎగరేసుకుని ‘నేనురా తెలంగాణ’ అని చె బుతున్నది. ఈ గడ్డ మీద నీకిరికిరి చెల్లదు. తస్మాత్ జాగ్రత్త’ అని టీడీపీ అధినేతను సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
 
కాంగ్రెసోళ్లకు శంకరగిరి మాన్యాలే
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉత్తర కుమారుడిగా కేసీఆర్ అభివర్ణించారు. వాటర్‌గ్రిడ్ పథకానికి టెండర్లు పిలవకముందే అవినీతి జరిగిందంటున్నారని మండిపడ్డారు. వాళ్లు అలానే బతికారని, పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు కాంగ్రెస్ వాళ్లకు ఎక్కడయినా అవినీతే కనపడుతుందని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెసోళ్లకు శంకరగిరి మాన్యాలే గతి. వారి కాళ్ల కింద భూమి కదులుతోంది. అభివృద్ధి చేసే తెలివి లేక, చేసినన్నాళ్లు ఆంధ్రనేతలకు సంచులు మోసిన కాంగ్రెస్ నేతలు ఎంత మంది వచ్చినా, ఉత్తరకుమారులు ఎందరు వచ్చినా వాటర్‌గ్రిడ్ పథకం ఆగదు’ అని సీఎం అన్నారు.

‘నేనెంత మొండినో మీకు తెలుసు. టీఆర్‌ఎస్ ఒక జగమొండి సంస్థ.. పట్టుబడితే దాని అంతేందో తేల్చే సంస్థ.. అందుకే అసాధ్యమైనా పట్టుబట్టి వాటర్‌గ్రిడ్ పథకాన్ని ముందుకు తీసుకువచ్చాం’ అని కేసీఆర్ చెప్పారు. కాగా, రాష్ర్టంలో గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి రూ.5 లక్షల బీమా వర్తించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విజ్ఞప్తి మేరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ సభకు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా, రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్, బాల్క సుమన్, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్‌కుమార్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, పూల రవీందర్, కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్, మదర్‌డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
 
నల్లగొండ దుఃఖం నాకే తెలుసు
తెలంగాణ ఉద్యమ సమయంలో తాను నల్లగొండ జిల్లాలోని గ్రామగ్రామం తిరిగానని, మునుగోడు నియోజకవర్గానికి వెళ్లినప్పుడు కన్నీళ్లు వచ్చాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నల్లగొండ దుఃఖం తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు. ఇంటింటికీ నల్లా నీళ్లు, ఇంటింటికీ కరెంటు ఇచ్చే రెండు కార్యక్రమాలు ఈ జిల్లా నుంచే ప్రారంభిస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. 2019 నాటికి దేశంలోనే అత్యంత విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందన్నారు.

దేశంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును 4వేల మెగావాట్ల సామర్థ్యంతో జిల్లాలోని దామరచర్ల మండలంలో చేపట్టినట్లు వివరించారు. రానున్న నాలుగేళ్లలో ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా ఇంటింటికీ నీళ్లిచ్చి తీరుతామని చెప్పారు. ‘ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తనన్న మొగోడు ఎవడైన ఉన్నడా? అలా ఇవ్వకపోతే నాలుగేళ్ల తర్వాత ఓట్లు అడగనని చెప్పిన నాయకుడు ఈ భూమ్మీద ఉన్నడా?’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement