సీఎం సారూ... మొర వినేదెవరు?
ఈ చిత్రంలోని అభాగ్యురాలిని చూశారా? నడవలేని దీన స్థితిలో ఎంతో కష్టపడి తెలంగాణ సెక్రెటేరియట్‌కు వచ్చిన ఆమె గాధ వింటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. కానీ మన అధికారులకు మాత్రం ఆమె బాధ అర్థం చేసుకునే ఓపిక.. తీరిక లేవు. ఆమె పేరు రమాదేవి. నల్గొండ పట్టణానికి చెందిన ఆమెకు పుట్టుకతోనే పోలియో సోకడంతో నడవలేకపోతోంది. ఆమె భర్త పేరు శ్రావణ్‌కుమార్. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో భర్త శ్రావణ్ కుమార్‌కు కాలు విరిగిపోయింది.
అతను మంచాన పడ్డాడు. ఇల్లు గడవడం కష్టమైంది. ఏం చేయాలో తోచని ఆమె సీఎం కేసీఆర్‌కు తన దుస్థితిని వివరించి, ఆదుకోవాల్సిందిగా కోరాలని భావించింది. వినతిపత్రంతో సోమవారం తెలంగాణ సచివాలయానికి చేరుకుంది. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు తన పరిస్థితిని వివరించి...సీఎంను కలిసేందుకు అవకాశం ఇప్పించాలని వేడుకుంది. అయినా ఫలితం కనిపించలేదు. ఆమెను లోపలికి పంపించేందుకు వారు నిరాకరించారు. ఎవరిని కదిపించినా ఉపయోగం లేకుండాపోయింది.
చాలా సేపు అదే ఆవరణలో నిరీక్షించిన ఆమె చివరకు అటుగా వస్తున్న ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి తన దుస్థితిని వివరించే ప్రయత్నం చేసింది. ఆయనకు వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించగా...‘నాకెందుకు ఇస్తావ్’ అని ప్రశిస్తూ వెళ్లిపోయారు. ‘నా ఇద్దరు పిల్లలు కడుపు నిండా తినగలిగితే అదే చాలు’ అంటున్న ఆమె మాటలు ప్రభుత్వ పెద్దలకు చెప్పే వారే లేకపోయారు. అప్పటికే తిరిగి తిరిగి అలసిపోయిన ఆ అభాగ్యురాలు నిరాశతో... కన్నీరు పెట్టుకుంటూ వెనుదిరిగింది.
- ఫొటోలు:రఫీ