- బయటకు పంపిన భద్రతా సిబ్బంది
- సమాచార కమిషనర్ ఆదేశాలతోనే..
- నిరసన తెలిపిన జర్నలిస్టులు
- ఎవరూ ఆదేశాలు జారీ చేయలేదన్న సీఎంవో వర్గాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలోని సమతా బ్లాక్‌లో ఉన్న ముఖ్యమంత్రి ప్రధాన పౌరసంబంధాల అధికారి కార్యాలయం(సీపీఆర్వో) నుంచి మీడియా ప్రతినిధులను భద్రతా సిబ్బంది సోమవారం బయటకు పంపడం వివాదాస్పదమైంది.
ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తంచేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సీఎం కేసీఆర్ సచివాలయంలోని ఆయన కార్యాలయానికి చేరుకున్న సమయంలో అక్కడే ఉన్న సమాచారశాఖ కమిషనర్ చంద్రవదన్.. సీపీఆర్వో కార్యాలయంలో ఉన్న విలేకరులను బయటకు పంపించాలని భద్రతా సిబ్బం దిని ఆదేశించారు. దీంతో వారు 4 చానళ్ల ప్రతి నిధులను బయటకు వెళ్లాల్సిందిగా సూచించారు. తామెందుకు వెళ్లాలని విలేకరులు ప్రశ్నించగా.. సమాచార కమిషనర్ ఆదేశాలనే తాము పాటిస్తున్నామని భద్రతా సిబ్బంది చెప్పారు.
ఆ వెంటనే విలేకరులు బయటకు వెళ్లి సీపీఆర్వో కార్యాలయంలోకి మీడియా ప్రతినిధులను అనుమతిం చడం లేదని సహచరులకు చెప్పారు. దీనిని నిరసిస్తూ జర్నలిస్టులు కొద్దిసేపు నిరసన తెలిపారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం సమాచార కమిషనర్ జర్నలిస్టులనే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. సిబ్లాక్‌లో సీఎంను కలసి బయటకు వచ్చి జర్నలిస్టుల సంక్షేమనిధి వివరాలు వెల్లడించేందుకు సిద్ధమైన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఎదుట కూడా నిరసన తెలిపారు. దీనిపై నారాయణ స్పందిస్తూ ‘సమాచార కమిషనర్ ఎందుకు చెప్పారో నాకు తెలియదు. కానీ సచివాలయంలో మీడియాపై ఆంక్షలు లేవు’ అని ఆయన పేర్కొన్నారు. అయితే జర్నలిస్టులను బయటకు పంపాలన్న ఆదేశాలు ఎవరూ జారీ చేయలేదని సీఎం కార్యాలయం వర్గాలు వివరణ ఇచ్చాయి. ఒక వర్గం మీడియా కావాలనే జర్నలిస్టులను రెచ్చగొడుతోందన్నారు.
దోచుకోవడానికే మీడియా కట్టడి: కాంగ్రెస్
కాంట్రాక్టర్లకు, పైరవీకారులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండటానికే టీఆర్‌ఎస్ సర్కార్ సచివాలయంలో మీడియాను కట్టడి చేయాలని చూస్తున్నదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొనగల మహేశ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. మీడియాను కట్టడి చేయాలనే ఆలోచనే అప్రజాస్వామికమన్నారు. గతంలో ఏ సీఎంకూ లేని ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి మీడియా అడ్డువస్తున్నదనే కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చారని మహేశ్ ఆరోపించారు.
జర్నలిస్టులకు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్
- తొలి విడతగా రూ.10 కోట్లు విడుదల చేస్తూ సీఎం సంతకం
- వచ్చే బడ్జెట్‌లో మరో రూ. పది కోట్లు
- ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. ఇందులో భాగంగా 2014-15 బడ్జెట్‌లో కేటాయించిన రూ.10 కోట్లు విడుదల చేస్తూ సీఎం ఫైలుపై సంతకం చేశారని తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2015-16 బడ్జెట్‌లోనూ మరో రూ.10 కోట్లు కేటాయించాలని నిర్ణయించారని, ఈ మొత్తాన్ని ప్రెస్‌అకాడమీ ఖాతాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమానికి వినియోగించనున్నట్లు తెలిపారు.
మొదటి సంవత్సరమే వడ్డీ ద్వారా రూ.7.50 లక్షలు అకాడమీకి అందుతాయన్నారు. ఇలా ఏటా రూ.10 కోట్లు జమచేస్తూ రూ.100 కోట్లతో కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ వారంలో నివేదిక ఇస్తుందన్నారు. పత్రికలు, చానళ్లకు ప్రకటనలపై వచ్చే ఆదాయంలో 0.5 శాతం గానీ, ఒక శాతం గానీ జర్నలిస్టుల సంక్షేమనిధికి జమచేసే అవకాశం ఉందన్నారు.
సీఎంవోలో సహేతుక క్రమబద్ధీకరణ
సచివాలయంలో జర్నలిస్టులకు ఆంక్షల గురించి ఇప్పటి వరకు ఎలాంటి జీవో రాలేదని అల్లం పేర్కొన్నారు. అయితే సీఎం బ్లాక్ వరకు సహేతుక క్రమబద్ధీకరణలు ఉంటాయని స్పష్టం చేశారు. అంతేగానీ సచివాలయంలోకి మీడియాను అనుమతించకపోవడం వంటివేవీ ఉండవన్నారు. సీఎం కార్యాలయం దగ్గర మీడియాను ఉంచి బ్రేకింగ్ న్యూస్ పేరుతో ఇచ్చే వార్తల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని భావించడం వల్లే రెగ్యులేషన్స్ పెట్టాలని భావిస్తున్నట్టు చెప్పా రు. కాగా, అల్లం వ్యాఖ్యలపై జర్నలిస్టులు ఆందోళన వ్యక్తంచేశారు.
‘సీఎంవో’ నుంచి మీడియా ఔట్!
Published Tue, Feb 24 2015 4:00 AM | Last Updated on Tue, Oct 9 2018 6:36 PM
Advertisement
Advertisement