సీఎన్‌జీ దూకుడు | CNG Gas Price Hikes in Hyderabad | Sakshi
Sakshi News home page

సీఎన్‌జీ దూకుడు

Published Fri, May 10 2019 7:45 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

CNG Gas Price Hikes in Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: వాహనాల్లో నింపే కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) ధర దూకుడుమీదుంది. కాలుష్య రహితంతో పాటు మైలేజీ అధికంగా వస్తుందన్న కారణంగా నేచురల్, లిక్విడ్‌ గ్యాస్‌లకు డిమాండ్‌ పెరిగింది. పెట్రోల్, డీజిల్‌ ధరల దరిదాపుల్లోకి ఇదీ చేరుతోంది. ప్రస్తుతం సీఎన్‌జీ కిలో ధర రూ.64.92కు చేరగా, ఆటో గ్యాస్‌ రూ.44.64కు చేరింది. వాస్తవంగా రోజువారీ సవరణలతో పెట్రోల్, డీజిల్‌ ధరలుమండుతున్నాయి. దీంతో గ్యాస్‌ వినియోగంపై కార్లు, ఆటోలవాహనదారుల ఆసక్తి పెరిగింది. ఇప్పటికే కొందరు అధికారికంగా అనుమతి తీసుకొని వాహనాల  ఇంధన ట్యాంకులు గ్యాస్‌కు అనుగుణంగా మార్చుకోగా, మరి కొందరు అనధికారికంగానే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్‌ బంకులతో పాటు ఆటో గ్యాస్, సీఎన్‌జీ, లిక్విడ్‌ గ్యాస్‌ కేంద్రాలు వేర్వేరుగా ఉన్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 460 పైగా పెట్రోల్‌ బంకులు ఉండగా, అందులో 95 స్టేషన్లలో గ్యాస్‌ పంపులు అందుబాటులో ఉన్నాయి. మరో 25 కేంద్రాలో నేచురల్‌ గ్యాస్‌ కేంద్రాలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద మూడు ప్రధాన ఆయిల్‌ కంపెనీలకు చెందిన బంకులతో పాటు టోటల్, రిలయన్స్‌ బంకులు సైతం ఉన్నాయి. 

వాహనాలు 60 లక్షలపై మాటే
మహా నగరంలో వాహనాల సంఖ్య అక్షరాలా 60 లక్షలు దాటిపోయింది. అందులో 10.35 లక్షల వరకు కార్లు ఉండగా, 1.46 లక్షల ఆటోరిక్షాలు, 80 వేల క్యాబ్‌లు ఉన్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంమీద సుమారు మూడు నాలుగు లక్షల వాహనాలు సీఎన్‌జీ, ఆటో గ్యాస్, లిక్విడ్, ఎల్పీజీ గ్యాస్‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆటో గ్యాస్, లిక్విడ్‌ గ్యాస్‌కు కొరత లేనప్పటకీ సీఎన్‌జీ పూర్తిస్థాయిలో సరఫరా లేదు. సాధారణంగా గ్యాస్‌ స్టేషన్లకు ప్రతిరోజు 5000 ఆటోలు, 1000 వరకు కార్ల తాకిడి ఉంటుంది. ఆటోల సీఎన్‌జీ కిట్స్‌ సామర్థ్యం నాలుగున్నర కిలోలు, కాగా నాలుగు కిలలో వరకు, కార్ల సామర్థ్యం పది కిలోలకుగాను ఎనిమిది కిలోల వరకు గ్యాస్‌ నింపుతారు. ఒక్కో స్టేషన్‌కు ప్రతిరోజు 6 వేల కిలో వరకు గ్యాస్‌ డిమాండ్‌ ఉంటుంది. 

అధిక మైలేజీ వల్లే డిమాండ్‌
పెట్రోల్, డీజిల్‌ కంటే సీఎన్‌జీ, ఆటో గ్యాస్‌తో నడిచే వాహనాలు మైలేజీ అధికంగా ఇస్తాయి. పెట్రోల్, డీజిల్‌ లీటర్‌కు 15 నుంచి 20 కిలో మీటర్ల వరకు మైలేజీ ఇస్తే సీఎన్‌జీ, ఆటో గ్యాస్, ఎల్పీజీ కిలో ఒక్కంటికి 22 నుంచి 28 కిలో మీటర్ల వరకు మైలేజీ వస్తుందని అంచనా. దీంతో వీటి ధర పెరిగినా డిమాండ్‌ ఏమాత్రం తగ్గడంలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement