cng gas
-
సీఎన్జీ కార్ వినియోగిస్తున్నారా..? డబ్బు ఇలా ఆదా చేయండి
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా సిఎన్జి, ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తున్నారు. సీఎన్జీ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ మైలేజ్ పొందవచ్చు. సీఎన్జీ కార్ వినియోగదారుడు ఖర్చుని తగ్గించి డబ్బుని ఆదా చేయడానికి ఈ కింది చిట్కాలను పాటించాలి. నీడలో పార్క్ చేయడం: ఎండలు రోజురోజుకి అధికమవుతున్నాయి, ఇలాంటి సమయంలో మీ కారుని తప్పకుండా నీడలో పార్క్ చేయాలి. సీఎన్జీ కారుని ఎండలో పార్క్ చేసినప్పుడు వేడి తీవ్రతకు కొంత సీఎన్జీ గ్యాస్ ఆవిరయ్యే అవకాశం ఉంటుంది. సీఎన్జీ ఆదా చేయడానికి తప్పకుండా ఈ నియమం పాటించాలి. ఓవర్‌ఫిల్ చేయడం మానుకోవాలి: కేవలం పెట్రోల్ కార్లలో మాత్రమే కాకుండా సిఎన్జి కార్లలో కూడా ఓవర్‌ఫిల్ చేయడం మంచిది కాదు. సీఎన్జీ కారుని ఉపయోగించేటప్పుడు ట్యాంక్‌లో అదనపు సీఎన్జీ విడుదలవుతుంది. ఆ సమయంలో ఓవర్‌ఫిల్ కారణంగా కొంత నష్టం జరుగుతుంది. ఎయిర్ ఫిల్టర్ మార్చుకోవాలి: కారులో ఎయిర్ ఫిల్టర్ ప్రాధాన్యత ఎలా ఉంటుందో వినియోగదారులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కావున ఎప్పటికప్పుడు ఎయిర్ ఫిల్టర్స్ తనిఖీ చేస్తూ క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలి. ఇది ఇంజిన్ జీవిత కాలాన్ని పెంచుతుంది. (ఇదీ చదవండి: Apple watch: బ్లడ్ గ్లూకోజ్ ట్రాకింగ్ ఇప్పుడు చాలా సింపుల్.. ఎలా?) టైర్ ప్రెజర్ చెక్ చేస్తూ ఉండండి: కారులో టైర్ ప్రెజర్ ఉండవల్సిన దాని కంటే తక్కువ వుంటే ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. కనీసం వారంలో ఒక సారైనా తప్పకుండా టైర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి. సరైన టైర్ ప్రెజర్ ఇంధనం ఆదా చేయడమే కాదు, టైర్ జీవిత కాలాన్ని కూడా పెంచుతుంది. సీఎన్జీ లీకేజీ లేకుండా చూసుకోవాలి: కారులో సీఎన్జీ లీకేజి కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సీఎన్జీ కారు ధరలు భారీగా ఉండటం వల్ల వినియోగదారుడు లీకేజీల గురించి తప్పకుండా తనిఖీ చేయాలి. అలాంటి సీఎన్జీ లీకేజి ఉన్నప్పుడు సమీపంలో ఉన్న మెకానిక్‌లకు వద్ద కాకుండా.. ప్రొఫెషనల్స్ ద్వారా టెస్ట్ చేసుకోవాలి. -
ఏపీలో ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు ఊపు...
సింగపూర్ కు చెందిన ప్రముఖ ఇంథన సరఫరా సంస్థ ఏజీ అండ్ పీ ప్రథాన్ కేంద్ర పెట్రోలియం బోర్డ్, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు పొంది ఆంధ్ర ప్రదేశ్‌లో కొన్ని నెలల క్రితం ఇంధన సరఫరా ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏజీ అండ్ పీ ప్రధామ్ రీజనల్ హెడ్ సాక్షితో ముచ్చటించారు. నేచురల్ పైప్‌లైన్ గ్యాస్ సరఫరా ప్రగతి తదితర విశేషాలు ఆయన మాటల్లోనే... ఏపీలో విస్తారంగా... ఇండియాలో 30 ఏళ్లుగా సీఎన్జీ గ్యాస్ అనేది జీవితంలో ఒక భాగమైపోయింది. సౌత్‌తో పోల్చితే నార్త్‌లో ఎక్కువగా ఢిల్లీ, ముంబైలో ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, హైదరాబాద్‌లలోనూ సీఎన్జీ యాక్టివిటీ ఎక్కువ. కాకినాడలోనే 50 వేల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దాదాపుగా 3 లక్షల మందికిపైగా ఆంధ్రప్రదేశ్‌లో సీఎన్జీని వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 120 సీఎన్జీ స్టేషన్లు ఉన్నాయి. అయితే, వీటిలో ఎక్కువ శాతం కమర్షియల్ వినియోగానికే ఉన్నాయి. ఈ నేపధ్యంలో గృహావసరాలకు సంబంధించిన వినియోగాన్ని కూడా విస్తృతం చేయాల్సి ఉంది. బహుళ ప్రయోజనాలు... పైప్‌లైన్ గ్యాస్ ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుత సిలిండర్‌కి సరిపడా గ్యాస్ దీని ద్వారా రూ.750 నుంచి రూ 800 వరకూ ధరలో లభిస్తుంది అంటే ప్రస్తుతం అవుతున్న ఖర్చులో 10 నుంచి 15శాతం ఆదా అవుతుంది. ఈ నేచురల్ గ్యాస్ సంప్రదాయ సిలిండర్ గ్యాస్‌తో పోలిస్తే చవక మాత్రమే కాదు అత్యంత సురక్షితం, పర్యావరణ హితం కూడా. సరఫరా మొత్తం పైప్‌లైన్ సిస్టమ్‌లోనే సాగుతుంది. కాబట్టి ప్రత్యేకించి స్టోరేజ్ అవసరం లేదు. ఇక నివాస గృహాలతో పోలిస్తే రెస్టారెంట్స్ లాంటి వ్యాపార సంస్థలకు పైప్‌లైన్ గ్యాస్ ద్వారా ఆదా అయ్యే 10శాతం అంటే చాలా పెద్ద మొత్తం అనే చెప్పాలి. వేగంగా ఇన్స్టలేషన్... గూడూరు టౌన్లోనే కాకుండా నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలో 9 సిఎన్జీ స్టేషన్స్ ఏర్పాటు చేశాం. నేషనల్ హైవే కావలితో పాటు నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి.. మొదలైన చోట్ల పైప్‌లైన్ యాక్టివిటీ జరుగుతుంటే హౌజ్‌హోల్డ్ ఇన్స్టాలేషన్ నాయుడుపేట, గూడురులలో జరుగుతోంది. సిఎన్జీ గ్యాస్ కనెక్షన్‌తో పాటే పంబ్లింగ్, స్టౌ వంటివన్నీ ఇందులో కలిపే ఉంటాయి. మొదటి నెలలో ఇన్స్టాలేషన్ చార్జ్ ఉంటుంది. తర్వాత నెల నుంచి ఉండదు. కాకపోతే ముందు 6 వేల రూపాయలసెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఉంది. ప్రతీ నెల గ్యాస్ వాడుకున్నదాన్ని బట్టి ఆ తర్వాత బిల్‌పే చేసే అవకాశం ఉంది. ప్రాంతాల వారీగా ఈ ఛార్జెస్ ఉంటాయి. గూడూరు టౌన్లో ఇన్స్టాలేషన్ ఛార్జెస్ రూ. 800 ఉంటే నాయుడుపేట టౌన్లో రూ.2700 ఉంది. కమర్షియల్ రిజిస్ట్రేషన్స్ కు అంటే స్కూల్, బిజినెస్ ఇతరవాటికి ఒక విధంగా, రెసిడెన్సియల్‌కు ఒక విధంగా రేటు ఉంటుంది. పైప్‌లైన్ ప్రొవిజన్ బట్టి చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 10000ల రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. ఒక్కో ఇంటికీ మ్యాగ్జిమమ్ రెండు కనెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. వంటకు కావల్సిన గ్యాస్‌తో పాటు వాటర్ గీజర్‌కు కూడా కనెక్షన్ ఇస్తాం. స్పందన బాగుంది... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సహిస్తోంది. అదే విధంగా ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ప్రభుత్వ అధికారులు కూడా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. వారి గైడ్‌లైన్స్ ప్రకారం మేం పనులు నిర్వహిస్తున్నాం. -
సీఎన్జీపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలి
న్యూఢిల్లీ: పర్యావరణానికి అనుకూలమైన సీఎన్జీని జీఎస్టీలో చేర్చే వరకు దీనిపై ప్రస్తుతమున్న ఎక్సైజ్ డ్యూటీని మోస్తరు స్థాయికి తగ్గించాలని కిరీట్ పారిఖ్ కమిటీ సూచించింది. గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉండడం తెలిసిందే. ప్రస్తుతం సీఎన్జీపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల స్థాయిలో వ్యాట్, సేల్స్ ట్యాక్స్ అమల్లో ఉన్నాయి. సహజ వాయువును గ్యాసియస్ రూపంలో విక్రయిస్తే దానిపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ విధించడం లేదు. సీఎన్జీగా మార్చి విక్రయిస్తే 14.5 శాతం ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తోంది. దీనిపై రాష్ట్రాల స్థాయిలో 24.5 శాతం వరకు వ్యాట్ అమలవుతోంది. వినియోగదారుడికి ప్రయోజనం కలిగించే, మార్కెట్ ఆధారిత, పారదర్శక ధరల విధానం సిఫారసు చేసేందుకు ఏర్పాటైనదే కిరీట్ పారిఖ్ కమిటీ. పూర్తి అధ్యయనం, సంప్రదింపుల తర్వాత ఇటీవలే ఈ కమిటీ కేంద్రానికి తన సిఫారసులు అందజేయడం గమనార్హం. జీఎస్టీ కిందకు తేవాలి.. : సహజ వాయువు, సీఎన్జీని జీఎస్టీ కిందకు తీసుకురావాలని ఈ కమిటీ ముఖ్యమైన సూచన చేయడం గమనించాలి. ఇందుకు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని అభిప్రాయపడింది. ‘‘ఏకాభిప్రాయం సాధించేందుకు అవసరమైతే రాష్ట్రాలకు ఐదేళ్లపాటు ఆదాయంలో అంతరాన్ని సర్దుబాటు చేయాలి. అవసరమైన ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రక్రియను ఇప్పుడే ఆరంభించాలి’’అని కిరీట్ పారిఖ్ కమిటీ సిఫారసు చేసింది. గ్యాస్‌ను జీఎస్టీ కిందకు తెస్తే పెద్ద ఎత్తున ఆదాయం నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళనతో, గ్యాస్‌ను అధికంగా ఉత్పత్తి చేసే గుజరాత్ తదితర రాష్ట్రాలు ఉన్న విషయం గమనార్హం. రాష్ట్రాల అంగీకారంతో సీఎన్జీని జీఎస్టీ కిందకు తెచ్చే వరకు.. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం ద్వారా తుది వినియోగదారుడిపై పడే భారాన్ని తగ్గించాలని కమిటీ సూచించింది. భాగస్వాముల ప్రయోజనాలను పరిరక్షించేందుకు దీన్ని దీర్ఘకాలిక పరిష్కారంగా పేర్కొంది. జీఎస్టీ కిందకు గ్యాస్‌ను తీసుకురావడం అన్నది.. గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పడుతుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశ ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటా 6.2 శాతంగా ఉంటే, 2030 నాటికి 15 శాతానికి పెంచాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యంగా కావడం గమనించాలి. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు సంబంధించిన దేశీ లెగసీ క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే సహజ వాయువు ధరలపై పరిమితులను పారిఖ్ కమిటీ సిఫారసు చేయడం తెలిసిందే. -
మారుతి స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే!
సాక్షి,ముంబై: మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ స్విఫ్ట్‌లో S-CNG వెర్షన్‌ను దేశంలో విడుదల చేసింది. హ్యాచ్‌బ్యాక్ కారు రెండు (VXi , ZXi) వేరియంట్లలో అందుబాటులో ఉంది. అంతేకాదు కిలోకి 30.90 కిలోమీటర్లతో మోస్ట్పవర్ఫుల్, అద్భుతమైన ఇంధన సామర్థ్యమున్న హ్యాచ్‌బ్యాక్ కార్ అని కంపెనీ చెబుతోంది. మారుతి కొత్త స్విఫ్ట్ వెర్షన్ ధరలు రూ. 7.77 లక్షల (ఎక్స్-షోరూమ్)నుండి ప్రారంభం. అలాగే నెలవారీ సబ్స్క్రిప్షన్ రుసుముతో రూ. 16,499తో (అన్ని కలుపుకొని) ఈ కారును సొంతం చేసుకోవచ్చని మారుతి వెల్లడించింది. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ 1.2L K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్‌తో 6,000rpm వద్ద 76bhp, 4,300rpm వద్ద 98Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో మాత్రమే వచ్చింది. 2022 మారుతి సుజుకి స్విఫ్ట్ S-CNGలో డ్యూయల్ ఇంటర్ డిపెండెంట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్, (ECU) ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను జోడించింది. తుప్పు ఎలాంటి లీకేజీ లేకుండాస్టెయిన్లెస్ స్టీల్ పైపులు, జాయింట్లతో ఈ మోడల్ మరింత సేఫ్టీగా ఉంటుందని కంపెనీ మారుతీ సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
వినియోగదారులకు శుభవార్త, అదుపులోకి రానున్న సీఎన్జీ, పైప్డ్ గ్యాస్ ధరలు!
న్యూఢిల్లీ: పరిశ్రమలకు సరఫరా చేస్తున్న సహజవాయువును పట్టణ గ్యాస్, పైప్డ్ గ్యాస్ కోసం మళ్లించాలంటూ పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఆదేశించింది. సీఎన్జీ, పట్టణ పంపిణీ గ్యాస్ ధరలు 70% మేర పెరిగిపోవడంతో, వాటిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గృహాల్లో వినియోగించే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు వినియోగించే సీఎన్జీ డిమాండ్ తీర్చేందుకు వీలుగా, ఖరీదైన ఎల్ఎన్జీ దిగుమతితో లోటును అధిగమించాలని మూడు నెలల క్రితం పెట్రోలియం శాఖ ఆదేశించింది. ఇది ధరలు పెరిగేందుకు దారితీసింది. దీంతో దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్‌ను పట్టణాల్లో సరఫరాకే వినియోగించాలన్న పూర్వపు విధానానికి అనుకూలంగా పెట్రోలియం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో గ్యాస్‌ను పంపిణీ చేసే ఇంద్రప్రస్థ గ్యాస్‌కు, ముంబైలో గ్యాస్ పంపిణీలోని మహానగర్ గ్యాస్‌కు రోజువారీగా 17.5 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంఎస్‌సీఎండీ) నుంచి 20.78 ఎంఎంఎస్‌సీఎండీకి గ్యాస్ సరఫరా పెరగనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో సీఎన్జీ, పీఎన్జీ అవసరాలను 94% మేర తీర్చడానికి వీలవుతుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం 84% వరకు దేశీయ సరఫరా కాగా, మిగిలిన మొత్తానికి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. చదవండి👉భారత్‌కు ఎల్ఎన్జీ సరఫరాలో రష్యా డిఫాల్ట్! -
పెట్రోలు బాధల నుంచి ఉపశమనం.. మారుతి నుంచి సీఎన్జీ వేరియంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ సెలెరియో సీఎన్జీ వేరియంట్‌ను పరిచయం చేసింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.6.58 లక్షలు. ఎస్–సీఎన్జీ టెక్నాలజీతో కె–సిరీస్ 1.0 లీటర్ ఇంజన్ పొందుపరిచారు. మైలేజీ కేజీకి 35.6 కిలోమీటర్లు. ట్యాంక్ సామర్థ్యం 60 లీటర్లు. అంత క్రితం విడుదలైన సెలెరియో కార్లలో ఎస్–సీఎన్జీ వేరియంట్ యూనిట్ల వాటా 30 శాతముంది. మారుతి సుజుకీ ఖాతాలో 8 మోడళ్లకుగాను 9,50,000 యూనిట్ల ఎస్–సీఎన్జీ వాహనాలు ఇప్పటి వరకు అమ్ముడయ్యాయి. అయిదేళ్లలో సీఎన్జీ విక్రయాల్లో ఏటా 22 శాతం వృద్ధి సాధిస్తున్నట్టు మారుతి సుజుకీ సోమవారం తెలిపింది. -
మేఘా చేతికి 15 సిటీ గ్యాస్ ప్రాజెక్టులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (పీఎన్జీఆర్బీ) నిర్వహించిన 11వ రౌండ్ బిడ్డింగ్‌లో అత్యధిక సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్‌లను మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) దక్కించుకుంది. పీఎన్జీఆర్బీ 19 రాష్ట్రాల్లోని 215 జిల్లాల్లో విస్తరించిన 65 జియోగ్రాఫికల్ ఏరియాలకు బిడ్స్ నిర్వహించింది. 61 ఏరియాలకు బిడ్స్ దాఖలు అయ్యాయి. ఇందులో మేఘా గ్యాస్ 15, అదానీ టోటల్ గ్యాస్ 14, ఐఓసీఎల్ 9, బీపీసీఎల్ 6 పొందగా మిగిలిన వాటిని ఇతర సంస్థలు చేజిక్కించుకున్నాయి. మొత్తం జియోగ్రాఫికల్ ఏరియాల్లో 24.6 శాతం వాటాతో ఎంఈఐఎల్ అగ్రభాగాన ఉంది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది. 61 జియోగ్రాఫికల్ ఏరియాలకు సుమారు రూ.80,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని పీఎన్జీఆర్బీ భావిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో మేఘా..: కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణలో సీజీడీ ప్రాజెక్టులను మేఘా గ్యాస్ దక్కించుకుంది. తెలంగాణలో జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జియోగ్రాఫికల్ ఏరియాలు ఉన్నాయి. ఇప్పటికే నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పైప్‌లైన్ నిర్మాణంతోపాటు 32 సీఎన్జీ స్టేషన్లను మేఘా గ్యాస్ ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, కర్నాటకలోని తూముకూరు, బెల్గావి జిల్లాల్లో గృహ, పారిశ్రామిక అవసరాలు తీర్చడంతోపాటు వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌ను మేఘా అందిస్తోంది. -
పర్యావరణం కలుషితం కాకుండా...
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ రంగంలో ప్రపంచంలోని తనదైన ముద్రవేసుకున్న మేఘా ఇంజనీరింగ్ ఇప్పుడు తాజాగా గ్యాస్ సరఫరా, పంపిణీకి విస్తృతం చేయనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని మూడు జిల్లాలో ఆటోమొబైల్ గ్యాస్ సరఫరా చేస్తున్న మేఘా తాజాగా మరో శకాన్ని ప్రారంభించబోతోంది. మేఘా గ్యాస్ బ్రాండ్ పేరుతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుకు పైపుల ద్వారా నేచురల్ గ్యాస్‌ను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం పర్యావరణం కలుషితం కాకుండా... కేంద్రం కలను సాకారం చేసేలా మేఘా హైడ్రోకార్బన్స్ డివిజన్ సమగ్ర ప్రణాళికను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 16 జిల్లాల్లో గ్యాస్ పంపిణీ కోసం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇప్పటికే పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతులను పొందింది. అలాగే ఆటోమోబైల్ రంగానికి గ్యాస్ సరఫరా కోసం ఇప్పటికే 9 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించిన మేఘా ఇంజనీరింగ్ మరో అయిదు స్టేషన్లను వచ్చే మూడు నెలల్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, కర్ణాటకలోని తూంకూరు, బెల్గాం జిల్లాల్లో గ్యాస్ పంపిణీని ప్రారంభించగా.. త్వరలో తెలంగాణ లో పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నాగాయలంక, వెస్ట్ పెనుగొండ క్షేత్రాలు కీలకం కృష్ణా జిల్లా నాగాయలంక, వెస్ట్ పెనుగొండ ఆన్‌షోర్ గ్యాస్ క్షేత్రాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్యాస్ గ్రిడ్‌ను అభివృద్ధి పరిచేందుకు ఓఎన్జీసీ నుంచి వ్యూహాత్మకంగా పొందింది. ఈ గ్యాస్ క్షేత్రాల నుంచి రోజుకి లక్షా 30 వేల ఎస్సీఎం గ్యాస్‌ను తరలించనుంది. ఇందుకోసం అమెరికా నుంచి రప్పించిన మెకానికల్ రిఫ్రిజేషన్ యూనిట్లు, కంప్రెసర్లు వంటి అత్యధునిక యంత్రాలను ఉపయోగిస్తోంది. నాగాయలంక క్రేత్రం నుంచి నేచురల్ గ్యాస్‌ను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్టాజిల్లాలోని వినియోగదారులకు పంపిణీ చేస్తున్నది. ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలో ఇప్పటికే 1200 కిలోమీటర్ల పైప్‌లైన్ వేసింది. భవిష్యత్తు అవసరాల కోసం మరో 5000 కిలోమీటర్ల పైప్‌లైన్ వేయనుంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)ను, ఆటో మోబైల్ రంగానికి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)ని సరఫరా చేయనుంది. తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి త్వరలో గ్యాస్ పంపిణీకి సన్నహాలను చేస్తున్నది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్ జిల్లాల్లో 12 కిలోమీటర్ల మేర పైపులైను వేయగా వచ్చే మూడు నెలల్లో మిగతా జిల్లాల్లో పైప్‌లైను పనులను విస్తరించి సేవలను ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నది. మేఘా సీఎన్జీ స్టేషన్లు... కృష్ణా జిల్లాలో ఆటోమోబైల్ రంగానికి ఇప్పటికే 9 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించిన మేఘా గ్యాస్ మూడు నెలల్లో మరో ఐదు సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న 9 సీఎన్జీ స్టేషన్ల ద్వారా ప్రతి నెలా నాలుగున్నర లక్షల ఎస్సీఎం గ్యాస్‌ను విక్రయిస్తున్నది. కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ఐదు సీఎన్జీ స్టేషన్ల ద్వారా మరో మూడు లక్షల ఎస్సీఎం గ్యాస్ ను సరఫరా చేసే అవకాశం వుంది. అంచనాలకు మించి కర్ణాటకలోని బెల్గాం, తూంకూరు జిల్లా గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. తూంకూరు జిల్లాలోనే మొత్తం 12,500 మంది వినియోగదారులకు ప్రస్తుతం పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తుండగా, ఈ నెలాఖారుకు మరో నాలుగు వేల గ్యాస్ కనెక్షన్లను ఇవ్వనుంది. వాణిజ్య వినియోగదారుల నుంచి ప్రతి నెలా లక్షా 40 వేల ఎస్సీఎం గ్యాస్ పంపిణీ చేస్తుండగా, త్వరలోనే ఈ డిమాండ్ రెట్టంపు కానుంది. -
సీఎన్జీ దూకుడు
సాక్షి,సిటీబ్యూరో: వాహనాల్లో నింపే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర దూకుడుమీదుంది. కాలుష్య రహితంతో పాటు మైలేజీ అధికంగా వస్తుందన్న కారణంగా నేచురల్, లిక్విడ్ గ్యాస్‌లకు డిమాండ్ పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరల దరిదాపుల్లోకి ఇదీ చేరుతోంది. ప్రస్తుతం సీఎన్జీ కిలో ధర రూ.64.92కు చేరగా, ఆటో గ్యాస్ రూ.44.64కు చేరింది. వాస్తవంగా రోజువారీ సవరణలతో పెట్రోల్, డీజిల్ ధరలుమండుతున్నాయి. దీంతో గ్యాస్ వినియోగంపై కార్లు, ఆటోలవాహనదారుల ఆసక్తి పెరిగింది. ఇప్పటికే కొందరు అధికారికంగా అనుమతి తీసుకొని వాహనాల ఇంధన ట్యాంకులు గ్యాస్‌కు అనుగుణంగా మార్చుకోగా, మరి కొందరు అనధికారికంగానే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్, డీజిల్ బంకులతో పాటు ఆటో గ్యాస్, సీఎన్జీ, లిక్విడ్ గ్యాస్ కేంద్రాలు వేర్వేరుగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 460 పైగా పెట్రోల్ బంకులు ఉండగా, అందులో 95 స్టేషన్లలో గ్యాస్ పంపులు అందుబాటులో ఉన్నాయి. మరో 25 కేంద్రాలో నేచురల్ గ్యాస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన బంకులతో పాటు టోటల్, రిలయన్స్ బంకులు సైతం ఉన్నాయి. వాహనాలు 60 లక్షలపై మాటే మహా నగరంలో వాహనాల సంఖ్య అక్షరాలా 60 లక్షలు దాటిపోయింది. అందులో 10.35 లక్షల వరకు కార్లు ఉండగా, 1.46 లక్షల ఆటోరిక్షాలు, 80 వేల క్యాబ్‌లు ఉన్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంమీద సుమారు మూడు నాలుగు లక్షల వాహనాలు సీఎన్జీ, ఆటో గ్యాస్, లిక్విడ్, ఎల్పీజీ గ్యాస్‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆటో గ్యాస్, లిక్విడ్ గ్యాస్‌కు కొరత లేనప్పటకీ సీఎన్జీ పూర్తిస్థాయిలో సరఫరా లేదు. సాధారణంగా గ్యాస్ స్టేషన్లకు ప్రతిరోజు 5000 ఆటోలు, 1000 వరకు కార్ల తాకిడి ఉంటుంది. ఆటోల సీఎన్జీ కిట్స్ సామర్థ్యం నాలుగున్నర కిలోలు, కాగా నాలుగు కిలలో వరకు, కార్ల సామర్థ్యం పది కిలోలకుగాను ఎనిమిది కిలోల వరకు గ్యాస్ నింపుతారు. ఒక్కో స్టేషన్‌కు ప్రతిరోజు 6 వేల కిలో వరకు గ్యాస్ డిమాండ్ ఉంటుంది. అధిక మైలేజీ వల్లే డిమాండ్ పెట్రోల్, డీజిల్ కంటే సీఎన్జీ, ఆటో గ్యాస్‌తో నడిచే వాహనాలు మైలేజీ అధికంగా ఇస్తాయి. పెట్రోల్, డీజిల్ లీటర్‌కు 15 నుంచి 20 కిలో మీటర్ల వరకు మైలేజీ ఇస్తే సీఎన్జీ, ఆటో గ్యాస్, ఎల్పీజీ కిలో ఒక్కంటికి 22 నుంచి 28 కిలో మీటర్ల వరకు మైలేజీ వస్తుందని అంచనా. దీంతో వీటి ధర పెరిగినా డిమాండ్ ఏమాత్రం తగ్గడంలేదు. -
సిటీలో ‘సీఎన్జీ’ దోపిడీ!
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో సీఎన్జీ దోపిడీ తారస్థాయికి చేరింది. ఏ రోజుకు ఆ రోజు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను సాకు చేసుకొని సీఎన్జీ బంకులు అడ్డగోలు దోపిడీకి తెరలేపాయి. సీఎన్జీ కొరత తీవ్రంగా ఉందంటూ వినియోగదారుల జేబులు లూటీ చేస్తున్నాయి. ఒక కిలో సీఎన్జీపైన అదనంగా రూ.10 చొప్పున దండుకుంటున్నారు. దీంతో ఆటోవాలాలే తీవ్రంగా నష్టపోతున్నారు. అక్రమ వసూళ్లపై నిలదీసే వినియోగదారులకు సీఎన్జీ కొరతను సాకుగా చెబుతున్నారు. స్టాక్ లేదంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో వినియోగదారులు తప్పనిసరిగా అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోంది. నగరంలో గత కొంతకాలంగా ఈ అక్రమ దందా యధేచ్చగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. గ్రేటర్లో సుమారు 25 కంప్రెస్ట్ నేచురల్ గ్యాస్ ( సీఎన్జీ ) బంకులు ఉన్నాయి. ఒక్కో బంకు ద్వారా 6 వేల కిలోల వరకు సీఎన్జీ విక్రయించే సామర్ధ్యం ఉంది. కానీ డిమాండ్‌కు తగినంత అందుబాటులో లేకపోవడం వల్ల 3 వేల నుంచి 4 వేల కిలోల వరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో కిలో సీఎన్జీ రూ.58 చొప్పున లభిస్తోంది. కానీ బంకుల నిర్వాహకులు దీనికి మరో రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో డీజిల్ వినియోగించే కార్లు, ఆటోరిక్షాల వాహనదారులు సహజంగానే సీఎన్జీ కోసం బారులు తీరుతున్నారు. నగరంలోని నాగోల్, లక్డీకాపూల్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, మియాపూర్, అల్వాల్, ఉప్పర్‌పల్లి తదితర ప్రాంతాల్లోని సీఎన్జీ బంకుల్లో అదనపు వసూళ్ల పర్వం కొనసాగుతుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్లో ప్రస్తుతం 1.4 లక్షల ఆటోరిక్షాలు ఉన్నాయి. వీటిలో 80 వేలకు పైగా సీఎన్జీపైనే ఆధారపడి తిరుగుతున్నాయి. మరోవైపు సుమారు 2 లక్షలకు పైగా కార్లు సీఎన్జీని వినియోగిస్తున్నాయి. డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేకపోవడం వల్ల బంకుల వద్ద రాత్రింబవళ్లు రద్దీ కనిపిస్తుంది. సీఎన్జీ కాలుష్యరహిత ఇంధనం కావడం, పెట్రోల్, డీజిల్ కంటే ధరలు తక్కువ కావడం వల్ల డిమాండ్ పెరుగుతోంది. బంకుల నిర్వాహకులకు ఈ డిమాండ్ ఒక అవకాశంగా మారింది. దీంతో అక్రమార్జనకు తెరలేపారు. సాధారణంగా ఒక ఆటో సీఎన్జీ కిట్‌కు 4 కిలోలు సామర్ధ్యం మాత్రమే ఉంటుంది. సీఎన్జీ నింపుకొన్న ప్రతి సారి రూ.40 చొప్పున అదనంగా చెల్లించాల్సి వస్తుందని ఆటోడ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కార్లలోని ట్యాంకర్ల సామర్ధ్యం 10 కిలోల వరకు ఉంటుంది. కానీ 8 కిలోలు నింపుతారు. కొలతల్లోనూ మోసాలు.... మరోవైపు సీఎన్జీ కొలతల్లోనూ మోసాలు ఉన్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఒక కిలో సీఎన్జీ కొనుగోలు చేస్తే 850 గ్రాముల వరకే లభిస్తుందని పేర్కొంటున్నారు. ఆటోడ్రైవర్లు 4 కిలోల సీఎన్జీ కొనుగోలు చేస్తే 300 గ్రాములకు పైగా తగ్గిస్తున్నారు. సాధారణంగా పెట్రోల్, డీజిల్ బంకుల్లో తూకాల్లో మోసాలు ఉన్నట్లుగానే సీఎన్జీ బంకుల్లోనూ మోసాలు జరుగుతున్నట్లు ఆటోసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అరకొర సరఫరా.... గ్రేటర్లో డిమాండ్‌కు తగిన బంకులు, సీఎన్జీ సరఫరా లేక తీవ్రమైన కొరత నెలకొంటోంది. శామీర్‌పేటలో మదర్‌స్టేషన్‌ను నిర్మించి సీఎన్జీని అందుబాటులో తెచ్చినప్పటికి గ్రిడ్ నుంచి గ్యాస్ కొరత ఫలితంగా స్టేషన్లకు డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు. వాస్తవంగా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణకు వినియోగించే 85 వేల ఆటోలు, 7,500 బస్సులు, 2 లక్షల కార్లు, క్యాబ్‌లు, ట్యాక్సీలకు కలిపి రోజుకు సగటున 7,62,500 కిలోల సీఎన్జీ అవసరమని అంచనా. ఇందుకనుగుణంగానే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ప్రణాళికలను రూపొందించింది. తొలి దశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ డిపోల్లోని 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు. కానీ కొరత కారణంగా ప్రసుతం 110 బస్సులకే మాత్రమే పరిమితమైంది. ఇక ఆటోలు, కార్లు, తదితర వాహనాల కోసం సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేసినా డిమాండ్‌కు సరఫరా లేదు. ప్రస్తుతం అరకొరగా సరఫరా అవుతున్న సీఎన్జీ ఏ మాత్రం చాలడం లేదు. అక్రమాలను అడ్డుకోవాలి కొరతను సాకుగా చూపి అక్రమ వసూళ్లకు పాల్పడడం అన్యాయం. వెంటనే ఇలాంటి అక్రమాలను నిలిపివేయాలి. ఇప్పటికే తూనికలు–కొలతలు శాఖ అధికారులను కలిశాం. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమాలకు కళ్లెం వేయకపోతే ఆందోళనకు దిగుతాం.– ఎ.సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శి,తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం -
నో పెట్రోల్..ఓన్లీ గ్యాస్!
నగరంలో సీఎన్జీ, ఆటో గ్యాస్‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో కార్లు, ఆటోల్లో గ్యాస్ వాడకానికే నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. కొందరు ఏకంగా వాహనాలకు అధికారిక గ్యాస్ ట్యాంకులు అమర్చుకుంటున్నారు. మరికొందరు గ్యాస్ వాహనాలనే కొనుగోలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ధర తక్కువగా ఉండటమేగాక మైలేజీ అధికంగా వస్తుండటంతో గ్యాస్ వినియోగానికి డిమాండ్ పెరుగుతోంది. పెట్రోలు లీటర్ ధర రూ.79 ఉండగా...సీఎన్జీ కిలో రూ.52 ఉంది. ఆటో గ్యాస్ కిలో రూ.41.47 పైసలు ఉంది. ఇక మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన బంకులతోపాటు టోటల్, రిలయన్స్ బంకుల్లో సైతం గ్యాస్ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం 1.40 లక్షల వాహనాలు సీన్జీ, ఆటో గ్యాస్, లిక్విడ్, ఎల్పీజీ గ్యాస్‌ను వినియోగిస్తున్నాయి. ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. సాక్షి,సిటీబ్యూరో: పెట్రోల్ ధరలు ఆకాశాన్నం టుతుండటంతో నాలుగు చక్రాల వాహనదారులు గ్యాస్ వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. కొందరు అధికారికంగా అనుమతి తీసుకొని వాహనాల ట్యాంకులు ఏర్పాటు చేసుకుంటుండగా మరి కొందరు అనధికారికంగా మార్పిడి చేసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ మహా నగరంలో నేచురల్, లిక్విడ్ గ్యాస్‌కు డిమాండ్ పెరుగుతోంది.పెట్రోల్, డీజిల్‌తో పొలిస్తే ధర తక్కువగా ఉండటమేగాక మైలేజీ అధికంగా వస్తుండటంతో గ్యాస్ వినియోగానికి డిమాండ్ పెరుగుతోంది. రోజువారి సవరణల నేపథ్యంలో పెట్రోల్, డీసెల్ ధరలు అదుపు తప్పడంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్, డీజిల్ బంకులతోపాటు ఆటో గ్యాస్, సీఎన్జీ, లిక్విడ్ గ్యాస్ కేంద్రాలు ఉన్నాయి. నగర వ్యాప్తంగా 460 పైగా పెట్రోల్ బంకులు ఉండగా, అందులో 95 స్టేషన్లలో గ్యాస్ పంపులు కూడా కొనసాగుతున్నాయి. మరో ఇరవై ఐదు కేంద్రాలో నేచురల్ గ్యాస్ కేంద్రాలు నడుస్తున్నాయి. మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన బంకులతోపాటు టోటల్, రిలయన్స్ బంకుల్లో సైతం గ్యాస్ విక్రయిస్తున్నారు. ఆర కోటికి పైగా.. మహా నగరంలో వాహనాల సంఖ్య అక్షరాల అర కోటి దాటింది. ఇందులో 20 లక్షల వరకు మూడు, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతం 1.40 లక్షల వాహనాలు సీన్జీ,ఆటో గ్యాస్,లిక్విడ్, ఎల్పీజీ గ్యాస్‌ను వినియోగిస్తున్నాయి. ఆటో గ్యాస్, లిక్విడ్ గ్యాస్‌కు కొరత లేనప్పటికీ సీ«ఎన్జీ గ్యాస్ సరైన సరఫరా లేకుండా పోయింది. సాధారణంగా గ్యాస్ స్టేషన్లకు ప్రతి రోజు 5000 ఆటోలు, 1000 వరకు నాలుగు చక్రాల వాహనాల తాకిడి ఉంటుంది. ఆటోల సీఎన్జీ కిట్స్ సామర్ధ్యం నాలుగున్నర కిలోలు కాగా నాలుగు కిలోల వరకు, కార్ల సామర్ధ్యం పది కిలోలు ఎనిమిది కిలోల వరకు గ్యాస్‌ను నింపుతారు. ఒక్కో స్టేషన్‌కు ప్రతి రో జూ 6వేల కిలోవరకు గ్యాస్ డిమాండ్ ఉంటుం ది. ప్రస్తుతం గ్యాస్ ధర నిలకడగా ఉండటం. రోజువారి సవరణ దీనికి వర్తించకపోవడంతో గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. -
భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్ లీకేజీ
రంగారెడ్డి: మేడ్చల్ - శామీర్‌పేట్ రోడ్డులోని మెడిసిటీ కూడలి వద్ద శుక్రవారం భాగ్యనగర్ సీఎన్జీ గ్యాస్ పైపులైను లీకయిన సంఘటన కలకలం సృష్టించింది. వివరాలు...మెడిసిటీ కూడలి వద్ద ఉన్న పైపులైను లీకవుతోందని అటుగా వెళ్తున్న రాజబొల్లారం గ్రామస్తులు చూసి భాగ్యనగర్ సీఎన్జీ గ్యాస్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పైపులైనును పరిశీలించారు. గ్యాస్ లీకవుతున్న చోట మరమ్మతులు నిర్వహించి, లీకేజీ కాకుండా నియంత్రించారు. దీంతో రాజబొల్లారం గ్రామస్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా కొంతకాలంగా మేడ్చల్ పట్టణంతోపాటు మండలంలోని పలు ప్రాంతాల్లో లీకేజీ సవుస్యలు తలెత్తుతున్నాయి. భాగ్యనగర్ గ్యాస్ సిబ్బంది సకాలంలో లీకేజీలకు మరమ్మతులు చేస్తున్నప్పటికీ తరుచూ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. (మేడ్చల్) -
మేడ్చల్‌లో ‘గ్యాస్’ లీకేజీ కలకలం!
మేడ్చల్:ఓ ప్రైవేట్ స్థలంలో జేసీబీతో పని చేయిస్తుండగా భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్ పగిలిపోవడంతో సీఎన్జీ గ్యాస్ లీకైంది. ఈ సంఘటన మేడ్చల్‌లోని ఉమానగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌కు చెందిన లక్ష్మీనారాయణ ఉమానగర్‌లో జాతీయ రహదారి పక్కన దర్గా సమీపంలో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఇంటి ఆవరణలో నిలుస్తున్న వర్షం నీటిని సమీపంలోని డ్రైనేజీలోకి మళ్లించేందుకు మంగళవారం ఓ జేసీబీతో పనులు చేయిస్తున్నాడు. ఈక్రమంలో భూగర్భంలో ఉన్న భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్ పగిలిపోవడంతో సీఎన్జీ గ్యాస్ లీకైంది. ఈ సంఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న భాగ్యనగర్ గ్యాస్ కంపెనీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పైపులైన్ పగిలిన చోట మరమ్మతు చేసి గ్యాస్ లీకవకుండా చేశారు. అనంతరం ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సీఎన్జీ గ్యాస్ కావడంతో మంటలు చెలరేగే ప్రమాదం లేదని వారు స్థానికులకు చెప్పి వెళ్లిపోయారు. కాగా భాగ్యనగర్ సీఎన్జీ గ్యాస్ పైపులైన్లు చాలా తక్కువ లోతులోంచి ఉండడంతో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం మేడ్చల్ బస్‌డిపో వద్ద ఓ ప్రైవేట్ వ్యక్తి జేసీబీతో పనిచేయిస్తుండగా కూడా భాగ్యనగర్ సీఎన్జీ గ్యాస్ లీకైన విషయం తెలిసిందే. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.