![Oil Ministry Ordered Natural Gas Diversion From Industries To City Gas Distribution Sector - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/12/gas.jpg.webp?itok=BUuWg_Zi)
న్యూఢిల్లీ: పరిశ్రమలకు సరఫరా చేస్తున్న సహజవాయువును పట్టణ గ్యాస్, పైప్డ్ గ్యాస్ కోసం మళ్లించాలంటూ పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఆదేశించింది. సీఎన్‌జీ, పట్టణ పంపిణీ గ్యాస్ ధరలు 70% మేర పెరిగిపోవడంతో, వాటిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
గృహాల్లో వినియోగించే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ), వాహనాలకు వినియోగించే సీఎన్‌జీ డిమాండ్ తీర్చేందుకు వీలుగా, ఖరీదైన ఎల్‌ఎన్‌జీ దిగుమతితో లోటును అధిగమించాలని మూడు నెలల క్రితం పెట్రోలియం శాఖ ఆదేశించింది. ఇది ధరలు పెరిగేందుకు దారితీసింది. దీంతో దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్‌ను పట్టణాల్లో సరఫరాకే వినియోగించాలన్న పూర్వపు విధానానికి అనుకూలంగా పెట్రోలియం శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో గ్యాస్‌ను పంపిణీ చేసే ఇంద్రప్రస్థ గ్యాస్‌కు, ముంబైలో గ్యాస్ పంపిణీలోని మహానగర్ గ్యాస్‌కు రోజువారీగా 17.5 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంఎస్‌సీఎండీ) నుంచి 20.78 ఎంఎంఎస్‌సీఎండీకి గ్యాస్ సరఫరా పెరగనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో సీఎన్‌జీ, పీఎన్‌జీ అవసరాలను 94% మేర తీర్చడానికి వీలవుతుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం 84% వరకు దేశీయ సరఫరా కాగా, మిగిలిన మొత్తానికి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment