సాక్షి, సిటీబ్యూరో: సిటీలో సీఎన్‌జీ దోపిడీ తారస్థాయికి చేరింది. ఏ రోజుకు ఆ రోజు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను సాకు చేసుకొని సీఎన్‌జీ బంకులు అడ్డగోలు దోపిడీకి తెరలేపాయి. సీఎన్‌జీ కొరత తీవ్రంగా ఉందంటూ వినియోగదారుల జేబులు లూటీ చేస్తున్నాయి. ఒక కిలో సీఎన్‌జీపైన అదనంగా రూ.10 చొప్పున దండుకుంటున్నారు. దీంతో ఆటోవాలాలే తీవ్రంగా నష్టపోతున్నారు. అక్రమ వసూళ్లపై నిలదీసే వినియోగదారులకు సీఎన్‌జీ కొరతను సాకుగా చెబుతున్నారు. స్టాక్ లేదంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో వినియోగదారులు తప్పనిసరిగా అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోంది. నగరంలో గత కొంతకాలంగా ఈ అక్రమ దందా యధేచ్చగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
గ్రేటర్‌లో సుమారు 25 కంప్రెస్ట్ నేచురల్ గ్యాస్ ( సీఎన్‌జీ ) బంకులు ఉన్నాయి. ఒక్కో బంకు ద్వారా 6 వేల కిలోల వరకు సీఎన్‌జీ విక్రయించే సామర్ధ్యం ఉంది. కానీ డిమాండ్‌కు తగినంత అందుబాటులో లేకపోవడం వల్ల 3 వేల నుంచి 4 వేల కిలోల వరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో కిలో సీఎన్‌జీ రూ.58 చొప్పున లభిస్తోంది. కానీ బంకుల నిర్వాహకులు దీనికి మరో రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో డీజిల్ వినియోగించే కార్లు, ఆటోరిక్షాల వాహనదారులు సహజంగానే సీఎన్‌జీ కోసం బారులు తీరుతున్నారు. నగరంలోని నాగోల్, లక్డీకాపూల్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మియాపూర్, అల్వాల్, ఉప్పర్‌పల్లి తదితర ప్రాంతాల్లోని సీఎన్‌జీ బంకుల్లో అదనపు వసూళ్ల పర్వం కొనసాగుతుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్‌లో ప్రస్తుతం 1.4 లక్షల ఆటోరిక్షాలు ఉన్నాయి. వీటిలో 80 వేలకు పైగా సీఎన్‌జీపైనే ఆధారపడి తిరుగుతున్నాయి. మరోవైపు సుమారు 2 లక్షలకు పైగా కార్లు సీఎన్‌జీని వినియోగిస్తున్నాయి. డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేకపోవడం వల్ల బంకుల వద్ద రాత్రింబవళ్లు రద్దీ కనిపిస్తుంది. సీఎన్‌జీ కాలుష్యరహిత ఇంధనం కావడం, పెట్రోల్, డీజిల్ కంటే ధరలు తక్కువ కావడం వల్ల డిమాండ్ పెరుగుతోంది. బంకుల నిర్వాహకులకు ఈ డిమాండ్ ఒక అవకాశంగా మారింది. దీంతో అక్రమార్జనకు తెరలేపారు. సాధారణంగా ఒక ఆటో సీఎన్జీ కిట్‌కు 4 కిలోలు సామర్ధ్యం మాత్రమే ఉంటుంది. సీఎన్‌జీ నింపుకొన్న ప్రతి సారి రూ.40 చొప్పున అదనంగా చెల్లించాల్సి వస్తుందని ఆటోడ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కార్లలోని ట్యాంకర్ల సామర్ధ్యం 10 కిలోల వరకు ఉంటుంది. కానీ 8 కిలోలు నింపుతారు.
కొలతల్లోనూ మోసాలు....
మరోవైపు సీఎన్‌జీ కొలతల్లోనూ మోసాలు ఉన్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు.
ఒక కిలో సీఎన్‌జీ కొనుగోలు చేస్తే 850 గ్రాముల వరకే లభిస్తుందని పేర్కొంటున్నారు. ఆటోడ్రైవర్లు 4 కిలోల సీఎన్జీ కొనుగోలు చేస్తే 300 గ్రాములకు పైగా తగ్గిస్తున్నారు. సాధారణంగా పెట్రోల్, డీజిల్ బంకుల్లో తూకాల్లో మోసాలు ఉన్నట్లుగానే సీఎన్‌జీ బంకుల్లోనూ మోసాలు జరుగుతున్నట్లు ఆటోసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అరకొర సరఫరా....
గ్రేటర్‌లో డిమాండ్‌కు తగిన బంకులు, సీఎన్‌జీ సరఫరా లేక తీవ్రమైన కొరత నెలకొంటోంది. శామీర్‌పేటలో మదర్‌స్టేషన్‌ను నిర్మించి సీఎన్జీని అందుబాటులో తెచ్చినప్పటికి గ్రిడ్ నుంచి గ్యాస్ కొరత ఫలితంగా స్టేషన్లకు డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు. వాస్తవంగా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణకు వినియోగించే 85 వేల ఆటోలు, 7,500 బస్సులు, 2 లక్షల కార్లు, క్యాబ్‌లు, ట్యాక్సీలకు కలిపి రోజుకు సగటున 7,62,500 కిలోల సీఎన్జీ అవసరమని అంచనా. ఇందుకనుగుణంగానే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ప్రణాళికలను రూపొందించింది. తొలి దశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ డిపోల్లోని 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు. కానీ కొరత కారణంగా ప్రసుతం 110 బస్సులకే మాత్రమే పరిమితమైంది. ఇక ఆటోలు, కార్లు, తదితర వాహనాల కోసం సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేసినా డిమాండ్‌కు సరఫరా లేదు. ప్రస్తుతం అరకొరగా సరఫరా అవుతున్న సీఎన్‌జీ ఏ మాత్రం చాలడం లేదు.
అక్రమాలను అడ్డుకోవాలి
కొరతను సాకుగా చూపి అక్రమ వసూళ్లకు పాల్పడడం అన్యాయం. వెంటనే ఇలాంటి అక్రమాలను నిలిపివేయాలి. ఇప్పటికే తూనికలు–కొలతలు శాఖ అధికారులను కలిశాం. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమాలకు కళ్లెం వేయకపోతే ఆందోళనకు దిగుతాం.– ఎ.సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శి,తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం
Comments
Please login to add a commentAdd a comment