న్యూఢిల్లీ: పర్యావరణానికి అనుకూలమైన సీఎన్‌జీని జీఎస్‌టీలో చేర్చే వరకు దీనిపై ప్రస్తుతమున్న ఎక్సైజ్ డ్యూటీని మోస్తరు స్థాయికి తగ్గించాలని కిరీట్ పారిఖ్ కమిటీ సూచించింది. గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉండడం తెలిసిందే. ప్రస్తుతం సీఎన్‌జీపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల స్థాయిలో వ్యాట్, సేల్స్ ట్యాక్స్ అమల్లో ఉన్నాయి.
సహజ వాయువును గ్యాసియస్ రూపంలో విక్రయిస్తే దానిపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ విధించడం లేదు. సీఎన్‌జీగా మార్చి విక్రయిస్తే 14.5 శాతం ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తోంది. దీనిపై రాష్ట్రాల స్థాయిలో 24.5 శాతం వరకు వ్యాట్ అమలవుతోంది. వినియోగదారుడికి ప్రయోజనం కలిగించే, మార్కెట్ ఆధారిత, పారదర్శక ధరల విధానం సిఫారసు చేసేందుకు ఏర్పాటైనదే కిరీట్ పారిఖ్ కమిటీ. పూర్తి అధ్యయనం, సంప్రదింపుల తర్వాత ఇటీవలే ఈ కమిటీ కేంద్రానికి తన సిఫారసులు అందజేయడం గమనార్హం.
జీఎస్‌టీ కిందకు తేవాలి.. : సహజ వాయువు, సీఎన్‌జీని జీఎస్‌టీ కిందకు తీసుకురావాలని ఈ కమిటీ ముఖ్యమైన సూచన చేయడం గమనించాలి. ఇందుకు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని అభిప్రాయపడింది. ‘‘ఏకాభిప్రాయం సాధించేందుకు అవసరమైతే రాష్ట్రాలకు ఐదేళ్లపాటు ఆదాయంలో అంతరాన్ని సర్దుబాటు చేయాలి. అవసరమైన ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రక్రియను ఇప్పుడే ఆరంభించాలి’’అని కిరీట్ పారిఖ్ కమిటీ సిఫారసు చేసింది.
గ్యాస్‌ను జీఎస్‌టీ కిందకు తెస్తే పెద్ద ఎత్తున ఆదాయం నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళనతో, గ్యాస్‌ను అధికంగా ఉత్పత్తి చేసే గుజరాత్ తదితర రాష్ట్రాలు ఉన్న విషయం గమనార్హం. రాష్ట్రాల అంగీకారంతో సీఎన్‌జీని జీఎస్‌టీ కిందకు తెచ్చే వరకు.. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం ద్వారా తుది వినియోగదారుడిపై పడే భారాన్ని తగ్గించాలని కమిటీ సూచించింది.
భాగస్వాముల ప్రయోజనాలను పరిరక్షించేందుకు దీన్ని దీర్ఘకాలిక పరిష్కారంగా పేర్కొంది. జీఎస్‌టీ కిందకు గ్యాస్‌ను తీసుకురావడం అన్నది.. గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పడుతుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశ ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటా 6.2 శాతంగా ఉంటే, 2030 నాటికి 15 శాతానికి పెంచాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యంగా కావడం గమనించాలి. ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియాలకు సంబంధించిన దేశీ లెగసీ క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే సహజ వాయువు ధరలపై పరిమితులను పారిఖ్ కమిటీ సిఫారసు చేయడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment