- ఉన్నత విద్యామండలి
- వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ మల్లేశ్
- ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నియంత్రణపై దృష్టి
- ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై చర్యలు
చేపట్టాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయల్లో పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు ప్రత్యేకంగా కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా వైస్ ఛాన్స్‌లర్లు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మల్లేశ్ పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ప్రభుత్వంతో చర్చించి వైస్ చాన్స్‌లర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోచింగ్ కేంద్రాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని, వాటిని వెంటనే నియంత్రించాలని డిమాండ్ చేస్తూ శనివారం తెలంగాణ బీసీ ఫోరం, విద్యార్థి సంఘాల నేతలు ఆంజనేయగౌడ్, కిరణ్, సురేందర్, శ్రీకాంత్ నేతృత్వంలో విద్యార్థులు ఉన్నత విద్యామండలి వద్ద ఆందోళన చేశారు. అనంతరం మండలి చైర్మన్ పాపిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మల్లేశ్‌కు విజ్ఞాపనపత్రం అందజేశారు. కోచింగ్ సెంటర్లు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని, కొన్ని సెంటర్లు అక్రమాలకు పాల్పడుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. గ్రూపు-1, గ్రూపుఏ-2 ప్రశ్నపత్రాలు లీక్ చేసి కోట్లాది రూపాయలు ఆర్జించారని పేర్కొన్నారు. ఉన్నత విద్యా మేధావులతో కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మల్లేశ్ మాట్లాడుతూ బిహార్‌లో ప్రభుత్వం కోచింగ్ కేంద్రాల ఫీజుల నియంత్రణ చట్టాన్ని తె చ్చిందని, రాష్ట్రంలోనూ అలాంటి చర్యలు చేపడితే బాగుంటుందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకె ళతామన్నారు. యూనివర్సిటీల్లో పోటీ పరీక్షల కోచింగ్‌ను ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. అందరికీ సమానావకాశాలు (ఈక్వల్ ఆపర్చునిటీస్), ఎంప్లాయ్‌బిలిటీ, రెమిడియల్ కోచింగ్ పద్దుల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చే నిధులను ఇందుకోసం వినియోగించుకోవచ్చని సూచించారు.