compititive exams
-
AP: రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. ఈ సారి కొత్త విధానం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో రేపటి(శనివారం)నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. 6,455 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులకు ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. జూన్ 10 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఈసారి ఆఫ్ లైన్ లోనే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, ఏపీపీఎస్సీ సెక్రటరీ జె.ప్రదీప్ కుమార్ పరిశీలించారు. పకడ్బందీ చర్యలు.. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ జరగనుంది. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులకు బయోమెట్రిక్‌తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం 70 బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 290 మంది దివ్యాంగులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 58 మంది దివ్యాంగులు స్క్రైబ్స్ కు అనుమతి కోరారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. చదవండి: దేశంలోనే ఎక్కడా లేని విధంగా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’: గౌతం రెడ్డి -
GST: పోటీ పరీక్షలు రాసేవారికి శుభవార్త.. తగ్గనున్న ఫీజులు!
పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలకు ప్రవేశ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని లెవీ పరిధి నుంచి మినహాయిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. అలాగే పెన్సిళ్లు, షార్పనర్లపైనా లెవీని తగ్గించాలని జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. విద్యార్థులు దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం వివిధ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. వీటికి చెల్లించే ఫీజుపై ఇప్పటివరకు 18 శాతం జీఎస్టీని చెల్లించాల్సి వచ్చేది. తాజాగా ప్రవేశ పరీక్ష ఫీజులపై జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించడం విద్యార్థులకు ఊరట కలిగించే అంశం. ఈ మేరకు ఫీజులు తగ్గే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు ఊరట కలిగించే మరో అంశం పెన్సిల్, షార్పనర్లపై విధించే జీఎస్టీని తగ్గించడం. వీటిపై ప్రస్తుతం జీఎస్టీ 18 శాతంగా ఉంది. దీన్ని 12 శాతానికి తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. (ఇదీ చదవండి: కేంద్రం తీపికబురు: రూ. 16,982 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లింపు) -
యూనివర్సిటీల్లో పోటీ పరీక్షల కోచింగ్!
ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ మల్లేశ్ ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నియంత్రణపై దృష్టి ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై చర్యలు చేపట్టాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయల్లో పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు ప్రత్యేకంగా కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా వైస్ ఛాన్స్లర్లు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మల్లేశ్ పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ప్రభుత్వంతో చర్చించి వైస్ చాన్స్లర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోచింగ్ కేంద్రాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని, వాటిని వెంటనే నియంత్రించాలని డిమాండ్ చేస్తూ శనివారం తెలంగాణ బీసీ ఫోరం, విద్యార్థి సంఘాల నేతలు ఆంజనేయగౌడ్, కిరణ్, సురేందర్, శ్రీకాంత్ నేతృత్వంలో విద్యార్థులు ఉన్నత విద్యామండలి వద్ద ఆందోళన చేశారు. అనంతరం మండలి చైర్మన్ పాపిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మల్లేశ్‌కు విజ్ఞాపనపత్రం అందజేశారు. కోచింగ్ సెంటర్లు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని, కొన్ని సెంటర్లు అక్రమాలకు పాల్పడుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. గ్రూపు-1, గ్రూపుఏ-2 ప్రశ్నపత్రాలు లీక్ చేసి కోట్లాది రూపాయలు ఆర్జించారని పేర్కొన్నారు. ఉన్నత విద్యా మేధావులతో కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మల్లేశ్ మాట్లాడుతూ బిహార్‌లో ప్రభుత్వం కోచింగ్ కేంద్రాల ఫీజుల నియంత్రణ చట్టాన్ని తె చ్చిందని, రాష్ట్రంలోనూ అలాంటి చర్యలు చేపడితే బాగుంటుందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకె ళతామన్నారు. యూనివర్సిటీల్లో పోటీ పరీక్షల కోచింగ్‌ను ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. అందరికీ సమానావకాశాలు (ఈక్వల్ ఆపర్చునిటీస్), ఎంప్లాయ్‌బిలిటీ, రెమిడియల్ కోచింగ్ పద్దుల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చే నిధులను ఇందుకోసం వినియోగించుకోవచ్చని సూచించారు. -
సమస్యల ‘సర్కిల్’
ఇందూరు: అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా బీసీ స్టడీ సర్కిల్ లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లా కేంద్రంలో ఉండాల్సిన స్టడీ సర్కిల్‌ను నగరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. అది కూడా అడవి, గుట్ట ప్రాంతం మధ్యలో ఉంది. ఇక్కడ పాములు, విష పురుగుల భయంతోపాటు, సాయంత్రమైతే మందుబాబుల బెడద తీవ్రంగా ఉంటుంది. ఈ కారణంగా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఇంత దూరం వరకు వచ్చి శిక్షణ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. వారికి ప్రతిరోజు దారి ఖర్చులే రూ.50 వరకు అవుతాయి. వసతులు సరిగా లేని అద్దె భవనంలో శిక్షణ పొందటం, చుట్టూ భయానక వాతావరణం ఉండడంతో అభ్యర్థులు జంకుతున్నారు. ఉచిత శిక్షణ కోసం బీసీ విద్యార్థులు, అభ్యర్థులు గ్రూప్స్, పోలీసు, ఆర్మీ, ఫారెస్ట్, ఎక్సైజ్, డీఎస్సీ, వీఆర్ఓ, వీఆర్ఏ, బ్యాంకు, తదితర పోటీ ఉద్యోగ పరీక్షలకు సిద్ధం కావడానికి ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం 2010లో బీసీ స్టడీ సర్కిల్‌ను మంజూరు చేసింది. ఆ సమయంలో జిల్లా కేంద్రంలోనే అద్దె భవనంలో దీనిని ఏర్పాటు చేయగా, తర్వాత నాగారం రాజారాం స్టేడియం వెనుక ప్రాంతంలో ఉన్న ఓ పాడుబడిన భవనంలోకి మార్చారు. అప్పటి నుంచి అభ్యర్థులు స్టడీ సర్కిల్‌కు రావడానికి వెనకడుగు వేస్తున్నారు. వ్యయప్రయాసలకోర్చి నిత్యం ఏడు కిలో మీటర్ల దూరం వెళ్లే బదులు జిల్లా కేంద్రంలో ఉన్న ఏదో ఒక ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో చేరిపోదామని ఆలోచిస్తున్నారు. మహిళలు నాగారం వరకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఇన్నేళ్లో శిక్షణ తీసుకోవడానికి మహిళలు ఐదుగురికి మించి రాలేదు. 2014-15 సంవత్సరానికి కేవలం రెండు కోర్సుల అభ్యర్థులకే శిక్షణనిచ్చారు. అవి కూడా ఒకటి ఫారెస్ట్ పరీక్షలు కాగా, మరొకటి బ్యాంకింగ్ కోచింగ్. ఫారెస్టు పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం బ్యాంకింగ్వారికే శిక్షణ ఇస్తుంది. ఇందులో 60 సీట్లకు గాను కేవలం 26 మంది మాత్రమే కోచింగ్ తీసుకుంటున్నారు. బ్యాంకింగ్ కోచింగ్ తీసుకునే వారికి మెటీరియల్ బుక్స్ అందలేదు. డబ్బులిస్తాం మీరే కొనుక్కోవాలని సూచించినట్లు సమాచారం. నిధులు వృథా పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు, స్టడీ సర్కిల్లో పని చేసే ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రభుత్వం ఏటా రూ.25 లక్షలను మంజూరు చేస్తుంది. కానీ, సంవత్సరంలో రెండు నుంచి మూడు కోర్సులకు మాత్రమే శిక్షణ ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. బయటి వ్యక్తులచే అభ్యర్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. అలా అయితే ఉద్యోగులు ఉండి ఎందుకని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇతరులచే క్లాస్ చెప్పించే కార్యక్రమం పేరుతో నిధులు పక్కదారి పడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. స్టడీ సర్కిల్లో ప్రస్తుతం కోర్సు కో ఆర్డినేటర్, లైబ్రేరియన్, వాచ్‌మన్, అటెండర్లు ఇద్దరు, జూనియర్ అసిస్టెంట్/ టైపిస్టు/ కంప్యూటర్ ఆపరేటర్, అకౌంటెంట్, ఇలా మొత్తం ఏడుగురు ఉద్యోగులు పని చే స్తున్నారు. గతంలో ఇంతమంది అవసరం లేదని, నిధులు వృథా అవుతున్నాయని అటెండర్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్/టైపిస్టు/కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు తప్ప మిగతావాటిని రద్దు చేసింది. రాజకీయ నాయకుల సహకారంతో మళ్లీ ఆ నాలుగు పోస్టులను తిరిగి మంజురు చేయించుకున్నారు. ప్రస్తుతం వారు ఏ పని లేకపోగా కూర్చుండి నెలనెలా జీతాలు తీసుకుంటున్నారు. విషయం తెలిసీ కూడా సంబంధిత ఉన్నతాధికారులు మౌనంగా ఉంటున్నారు. స్టడీ సర్కిల్ లక్ష్యం నెరవేరకుండానే, ఏటా రూ.25 లక్షల నిధులు వృథాగా అవుతున్నాయి. కలగానే నూతన భవన నిర్మాణం బీసీ స్టడీ సర్కిల్ భవనాన్ని జిల్లా కేంద్రంలో నిర్మించాలని ఒత్తిడితేగా ప్రభుత్వం 2012లో మంజురు చేసింది. ఇందుకు నగరంలోని గంగాస్థాన్‌లో ఉన్న 2000 వేల గజాల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.15 కోట్లను కూడా మంజురు చేసింది. అప్పటి ఎంపీ మధుగౌడ్ అదనంగా రూ. 30 లక్షలు కూడా అందజేశారు. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడంతో ఇంజనీరింగ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదముంది. చర్యలు తీసుకుంటున్నాం బీసీ స్టడీ సర్కిల్లో సమస్యలు వాస్తవమే. శిక్షణ తీసుకునేందుకు అభ్యర్థులు నాగారం వరకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అద్దె భవనం పాతది కావడంతో అభ్యర్థులు శిక్షణ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ సంవత్సరంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడంతో కోర్సులు ప్రారంభించలేదు. జిల్లా కేంద్రంలో కొత్త భవనం మంజూరై రెండేళ్లవుతోంది. నిర్మించడంలో సంబంధిత అధికారులు జాప్యం చేస్తున్నారు. -విమలాదేవి, బీసీ స్టడీ సర్కిల్ ఇన్చార్జ్ అధికారి