సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరిపేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. సరుకుల రవాణా, పంపిణీలో అక్రమాలు, దారి మళ్లింపులకు ఇకపై అడ్డుకట్ట వేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) వ్యవస్థను ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తెచ్చి ఎక్కడా అవకతవకలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోనుంది. కొత్త విధానం అమలు ద్వారా ప్రజాధనం సక్రమ నిర్వహణ సాధ్యమని పౌరసరఫరాల శాఖ స్పష్టంచేస్తోంది. ప్రతీ బియ్యం గింజా లబ్ధిదారునికి చేరేలా లెక్కతేలుతుందని చెప్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో పీడీఎస్ వ్యవస్థ అంతా మ్యాన్యువల్‌గా జరుగుతుండటంతో కింది నుంచి పైస్థాయి వరకు అనేక అక్రమాలు జరుగుతున్నాయి. స్టాక్ పాయింట్ మొదలు, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ వరకు వివిధ స్థాయిల్లో అధికారులు, డీలర్లు చేతివాటం చూపడంతో రూ.కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం జరిగింది. దీనికి తోడు కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నుంచి మండల్ లెవల్ స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా అవుతున్న బియ్యం సహా ఇతర సరుకుల్లో అన్నీ అక్రమాలే జరుగుతున్నాయి.
ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్ల వరకు సరఫరా చేస్తున్న బియ్యంలో 10శాతం బియ్యం పక్కదారి పడుతుండగా, ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు రవాణా చేసే సమయంలో మరో 15శాతం అక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని నివారించేందుకు సరుకుల సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ అమర్చాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. దీని ద్వారా వాహనం ఎక్కడ ఉన్నది, ఏ దారిలో ప్రయాణిస్తున్నది అధికారులు తెలుసుకోవచ్చు. ఎక్కడైనా వాహనాన్ని ఆపినా ఆ వివరాలు తెలిసిపోతాయి.
సరుకు రవాణా చేసే వాహన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎమ్మార్వో స్థాయి మొదలు కింది స్థాయి అధికారి, చివరికి డీలర్, గ్రామ ఆహార సంఘం సభ్యుడు వరకు చేరేలా ఎస్‌ఎంఎస్ వ్యవస్థను పటిష్టపరుస్తున్నారు. దీంతో జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల కార్యాలయాలకు ఎప్పటికప్పుడు సమాచారం పక్కాగా ఉండి అక్రమాలకు చెక్‌పడుతుంది. ఈ వ్యవస్థ అమలుకు వీలుగా రాష్ట్రంలోని 177 మండల స్థాయి స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న కంప్యూటర్లకు, విద్యుత్, ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించనున్నారు. జిల్లాల అధికారులకు సైతం దీనిపై అవగాహన కల్పిస్తారు.