గ‘లీజు’ బాబులు | Collections at Footpath Vendors | Sakshi
Sakshi News home page

గ‘లీజు’ బాబులు

Published Mon, Oct 13 2014 1:31 AM | Last Updated on Thu, Oct 4 2018 2:15 PM

గ‘లీజు’ బాబులు - Sakshi

గ‘లీజు’ బాబులు

* డీసీఎంఎస్ దుకాణా సముదాయం స్వార్థపరుల పాలు
* దుకాణాలను బినామీలకు అంటగట్టి అక్రమార్జన
* ఫుట్‌పాత్ వ్యాపారుల వద్దా వసూళ్లు

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డీసీఎంఎస్‌లో గ‘లీజు’ బాగోతం బాహాటంగా కొనసాగుతోంది. రాజకీయ పరపతిని పెట్టుబడిగా పెట్టిన కొంతమంది పెద్దలు డీసీఎంఎస్ నిబంధనలకు తూట్లు పొడిచి ఈ బాగోతాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో రైతు సహకార సొసైటీలకు దక్కాల్సిదంతా పెద్దల జేబుల్లోకి చేరిపోతోంది. రైతు సొసైటీల నుంచి దుకాణాలను నామ మాత్రపు లీజుకు పొందడం, తాము పొందిన లబ్ధిని బినామీలకు కట్టపెట్టి వారినుంచి బాడుగలపేర భారీగా డబ్బులు వసూలు చేయడం ఇబ్రహీంపట్నం డీసీఎంఎస్‌లో యథేచ్చగా కొనసాగుతోంది.

ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల ద్వారా 11 దుకాణాలతో కూడిన వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు. ఇబ్రహీంపట్నంలో మరెక్కడాలేని విలువ డీసీఎంఎస్ దుకాణ సముదాయాలకు ఉంటుంది. దీంతో ఇక్కడ దుకాణాలను దక్కించుకునేందుకు భారీఎత్తున పోటీ పెరిగింది. సొసైటీ నిబంధనల మేరకు దుకాణాల లీజును సొంతం చేసుకున్న లబ్ధిదారులు.. లీజు వ్యవహారం పూర్తయిన తరువాత అసలు మతలబును తెరమీదకు తీసుకువచ్చారు.
 
లీజు ధర రూ.1850, బినామీ ధర 20వేలు!!

ఇబ్రహీంపట్నం డీసీఎంఎస్ వాణిజ్య సముదాయంలో నామమాత్రపు లీజు డబ్బును సొసైటీలకు చెల్లిస్తూ.. బినామీల నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక్కడి దుకాణ సముదాయంలో మొత్తం 11 దుకాణాలు ఉండగా వీటిలో 8 దుకాణాలను బినామీలే నిర్వహిస్తున్నారు. సొసైటీ లీజు బాడుగ రూ,1850లను లబ్ధిదారులు చెల్లిస్తూ.. బినామీలనుంచి రూ.20 వేల వరకు ప్రతినెలా అద్దె రూపంలో అక్రమంగా వసూలు చేస్తున్నారు.

ఎలాంటి ఉపాధి లేని నిరుద్యోగ అర్హులకు  కేటాయించాల్సిన ఈ దుకాణాలను పరపతి గలిగిన పెద్దలు చేజిక్కించుకోవడంతో ఇలా పక్కదారి పడుతోంది. దీంతో సొసైటీలకు మేలు జరగక..నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరకుండా ఈ గలీజు వ్యవహారం నిరాఘాటంగా కొనసాగుతోంది.ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్ విలువకు(అంటే అక్రమమార్గంలో బినామీలనుంచి వసూలు చేస్తున్న అద్దె డబ్బులకు అనుగుణంగా) దుకాణాల లీజులు అధికారికంగా ఖరారు చేస్తే ఇబ్రహీంపట్నం సొసైటికి భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
 
అదనపు ప్రయోజనాలు కూడా..

లబ్ధిదారులు డీసీఎంఎస్ దుకాణాలను బినామీలకు అప్పగించి అక్రమంగా డ బ్బులు వసూలు చేయడం ఒక ఎత్తుకాగా ఆయా దుకాణాల ముందుగల ఫుట్‌పాత్‌లపై చిరువ్యాపారాలు నిర్వహిస్తున వారి నుంచి కూడా  భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తోపుడు బళ్లు,పానీపూరి,చాయ్‌వాలాల నుంచి ప్రతిరోజు రెండు వందలనుంచి మూడు వందల రూపాయలను  లబ్ధిదారులు వసూలు చేస్తున్నట్లుగా తెలిసింది.
 
మా దృష్టికి వచ్చింది: మాధవి, డీసీఎంఎస్‌మేనేజర్
లబ్ధిదారులు దుకాణాలను బినామీలకు అప్పగించడం,సొసైటీకి చెల్లిస్తున్న బాడుగకు అధికంగా  బినామీల నుంచి వసూలు చేయడం మా దృష్టికి వచ్చింది. దీనిపై చైర్మన్ మీటింగ్‌కూడా ఏర్పాటు చేశారు. నిర్ణయం పైస్థాయిలో జరగాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement