Farmers Co-operative Society
-
‘కృషి కల్యాణ్’తో రైతు ఆదాయం రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే కృషి కల్యాణ్ అభియాన్ పథకం ముఖ్య ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి నీరజాశాస్త్రి అన్నారు. బుధవారం వ్యవసాయ కమిషనరేట్‌లో ఈ పథకం అమలు తీరుతెన్నులను ఆమె సమీక్షించారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల సమన్వయంతో రైతుల సమగ్ర అభివృద్ధికి, ఉత్పత్తుల పెంపు, ఉత్పాదకత పెంచేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని నీరజాశాస్త్రి అన్నారు. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రైతులకు భూసార కార్డుల పంపిణీ, అపరాలు, నూనెగింజల మినీ కిట్ల పంపిణీ, ఉద్యాన, అటవీ, వెదురు మొక్కలను అందజేయడం, పాడి పశువులకు 100 శాతం వ్యాక్సినేషన్ జరిగేలా చూడటం, గొర్రెలు, మేకల్లో పీపీఆర్ రోగ నివారణ, పశువులకు కృత్రిమ గర్భధారణకు చర్యలు చేపడతామని చెప్పారు. సూక్ష్మ నీటిపారుదల విధానం, సమగ్ర పంటల విధానాన్ని ప్రోత్సహించడానికి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామంలో 10 నుంచి 20 వ్యవసాయ పరికరాలను అందజేస్తామని చెప్పారు. ఈ పథకాన్ని కేంద్రం జూన్ 1 నుంచి జూలై 18 వరకు అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దేశంలోని 115 జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో 25 గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. తెలంగాణ నుంచి ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ పథకాన్ని విజయవంతం చేయాల్సిందిగా వ్యవసాయ కమిషనర్ జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. రైతు సమన్వయ సమితుల సహకారాన్ని తీసుకోవచ్చన్నారు. రోజువారీ నివేదికలను కృషి విజ్ఞాన కేంద్రం పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. -
రైతు సమన్వయ సమితికి 15 పోస్టులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతు సమన్వయ సమితిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 15 పోస్టులను కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వ్యవసాయశాఖ అధికారులనే ఈ పోస్టులకు నియమించాలని సూచించింది. మేనేజింగ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అకౌంట్ ఆఫీసర్, సూపరింటెండెంట్, సీనియర్ అకౌంటెంట్ పోస్టులను ఒక్కోటి చొప్పు న కేటాయించగా, రెండు వ్యవసాయాధికారి (ఏవో) పోస్టులను కేటాయించింది. ఇద్దరు డేటా ఆపరేటర్లు, ముగ్గురు ఆఫీసు సబార్డినేటర్లు, చైర్మన్‌కు పీఏ పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
గ‘లీజు’ బాబులు
* డీసీఎంఎస్ దుకాణా సముదాయం స్వార్థపరుల పాలు * దుకాణాలను బినామీలకు అంటగట్టి అక్రమార్జన * ఫుట్‌పాత్ వ్యాపారుల వద్దా వసూళ్లు ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డీసీఎంఎస్‌లో గ‘లీజు’ బాగోతం బాహాటంగా కొనసాగుతోంది. రాజకీయ పరపతిని పెట్టుబడిగా పెట్టిన కొంతమంది పెద్దలు డీసీఎంఎస్ నిబంధనలకు తూట్లు పొడిచి ఈ బాగోతాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో రైతు సహకార సొసైటీలకు దక్కాల్సిదంతా పెద్దల జేబుల్లోకి చేరిపోతోంది. రైతు సొసైటీల నుంచి దుకాణాలను నామ మాత్రపు లీజుకు పొందడం, తాము పొందిన లబ్ధిని బినామీలకు కట్టపెట్టి వారినుంచి బాడుగలపేర భారీగా డబ్బులు వసూలు చేయడం ఇబ్రహీంపట్నం డీసీఎంఎస్‌లో యథేచ్చగా కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల ద్వారా 11 దుకాణాలతో కూడిన వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు. ఇబ్రహీంపట్నంలో మరెక్కడాలేని విలువ డీసీఎంఎస్ దుకాణ సముదాయాలకు ఉంటుంది. దీంతో ఇక్కడ దుకాణాలను దక్కించుకునేందుకు భారీఎత్తున పోటీ పెరిగింది. సొసైటీ నిబంధనల మేరకు దుకాణాల లీజును సొంతం చేసుకున్న లబ్ధిదారులు.. లీజు వ్యవహారం పూర్తయిన తరువాత అసలు మతలబును తెరమీదకు తీసుకువచ్చారు. లీజు ధర రూ.1850, బినామీ ధర 20వేలు!! ఇబ్రహీంపట్నం డీసీఎంఎస్ వాణిజ్య సముదాయంలో నామమాత్రపు లీజు డబ్బును సొసైటీలకు చెల్లిస్తూ.. బినామీల నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక్కడి దుకాణ సముదాయంలో మొత్తం 11 దుకాణాలు ఉండగా వీటిలో 8 దుకాణాలను బినామీలే నిర్వహిస్తున్నారు. సొసైటీ లీజు బాడుగ రూ,1850లను లబ్ధిదారులు చెల్లిస్తూ.. బినామీలనుంచి రూ.20 వేల వరకు ప్రతినెలా అద్దె రూపంలో అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఎలాంటి ఉపాధి లేని నిరుద్యోగ అర్హులకు కేటాయించాల్సిన ఈ దుకాణాలను పరపతి గలిగిన పెద్దలు చేజిక్కించుకోవడంతో ఇలా పక్కదారి పడుతోంది. దీంతో సొసైటీలకు మేలు జరగక..నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరకుండా ఈ గలీజు వ్యవహారం నిరాఘాటంగా కొనసాగుతోంది.ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్ విలువకు(అంటే అక్రమమార్గంలో బినామీలనుంచి వసూలు చేస్తున్న అద్దె డబ్బులకు అనుగుణంగా) దుకాణాల లీజులు అధికారికంగా ఖరారు చేస్తే ఇబ్రహీంపట్నం సొసైటికి భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అదనపు ప్రయోజనాలు కూడా.. లబ్ధిదారులు డీసీఎంఎస్ దుకాణాలను బినామీలకు అప్పగించి అక్రమంగా డ బ్బులు వసూలు చేయడం ఒక ఎత్తుకాగా ఆయా దుకాణాల ముందుగల ఫుట్‌పాత్‌లపై చిరువ్యాపారాలు నిర్వహిస్తున వారి నుంచి కూడా భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తోపుడు బళ్లు,పానీపూరి,చాయ్‌వాలాల నుంచి ప్రతిరోజు రెండు వందలనుంచి మూడు వందల రూపాయలను లబ్ధిదారులు వసూలు చేస్తున్నట్లుగా తెలిసింది. మా దృష్టికి వచ్చింది: మాధవి, డీసీఎంఎస్మేనేజర్ లబ్ధిదారులు దుకాణాలను బినామీలకు అప్పగించడం,సొసైటీకి చెల్లిస్తున్న బాడుగకు అధికంగా బినామీల నుంచి వసూలు చేయడం మా దృష్టికి వచ్చింది. దీనిపై చైర్మన్ మీటింగ్‌కూడా ఏర్పాటు చేశారు. నిర్ణయం పైస్థాయిలో జరగాల్సి ఉంది.