బాల్యదశలో జాగ్రత్త!   | Collector Ronald Ross Talk On Children Health | Sakshi
Sakshi News home page

బాల్యదశలో జాగ్రత్త!  

Published Wed, Feb 20 2019 8:24 AM | Last Updated on Wed, Feb 20 2019 8:24 AM

Collector Ronald Ross Talk On Children Health - Sakshi

పాలమూరు: బాల బాలికలు ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని.. తద్వారా ఎలాంటి అనారోగ్యం దరిచేరదని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్ట ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కలెక్టర్‌ మాత్రలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది లోపు జిల్లాలో నులిపురుగులు, ఏలికపాములు, కొంకిపురుగులు నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో ఎవరు కూడా మలవిసర్జన చేయకుండా విద్యార్థులు అవగాహన కల్పించాలని సూచించారు.

విద్యార్థులు సైతం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. పిల్లలో కొంకిపురుగులు, నులిపురుగులు కడుపులో ఏర్పడితే పెరుగుదల లోపించడం, రక్తహీనత, చదువుపై శ్రద్ధ కోల్పోవడం జరుగుతుందన్నారు. అంతకుముందు కలెక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి పూలమాలలు వేయడంతో పాటు విద్యాబోధనపై ఆరా తీశారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రజిని, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శశికాంత్, మాస్‌మీడియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్‌ కృష్ణ, డాక్టర్లు జరీనా, సునీత, హెల్త్‌ఎడ్యుకేటర్‌ రాజగోపాలాచారి, ఉమాదేవి, సుభాష్‌చంద్రభోస్, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ నటరాజ్, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

85.9శాతం మందికి మాత్రలు 
జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలో 85.9శాతం మందికి మాత్రలు వేశారు. జిల్లాలోని 15మండలాలు, నారాయణపేట జిల్లాలో 11 మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని 1నుంచి 19 ఏళ్ల లోపు చిన్నారులు, యువతీ యువకులకు అల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశారు.జిల్లా వ్యాప్తంగా 4,65,826 మంది బాలబాలికలకు గాను 3,51,568మందికి మాత్రలు వేసినట్లు అధికారులు తెలిపారు. ఇక మిగిలిపోయిన 1,14,258 మంది బాలబాలికలకు ఈనెల 23న మాత్రలు అందించనున్నారు. 

నులిపురుగు మాత్రలు తప్పనిసరి... 
భూత్పూర్‌ (దేవరకద్ర): ప్రభుత్వ,ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులకు నులిపురుగు మాత్రలు విధిగా వేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రిజిని సూచించారు. భూత్పూర్‌ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఆమె మంగళవారం మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ మాత్రలు వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.కాగా, మండలంలో 10,833 మందికి గాను 7,513 మందికి మాత్రలు వేసినట్లు సీహెచ్‌ఓ రామయ్య వివరించారు. జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ కృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement