childrans
-
ఈ నెల 28 న అమ్మవడి పధకం అమలు
-
అందమైన నగల తయారీలో బుజ్జి చేతులు రక్తసిక్తం!
ఆ పట్టణానికి చెందిన పోలీసులు ఒక గృహంపై దాడులు చేసి, 22 మంది బాల కార్మికులను రెస్క్యూ చేశారు. వీరిని షహన్వాజ్ అనే వ్యాపారి రూ. 500 చొప్పున వారి తల్లిదండ్రుల నుంచి కొనుగోలు చేశాడని పోలీసులు గుర్తించారు. తరువాత ఆ చిన్నారుల చేత రోజుకు ఏకంగా 18 గంటలపాటు ఆర్టిఫిషిల్ నగల తయారీ పనులు చేయిస్తున్నట్లు కనుగొన్నారు. అది రాజస్థాన్‌లోని జైపూర్... ఈ పట్టణం పింక్ సిటీగా పేరొందింది. పర్యాటక ప్రాంతంగానూ గుర్తింపు పొందింది. ఆభరణాల తయారీకి కేంద్రంగా ఉన్న ఈ పట్టణానికి విదేశీయులకు కూడా వస్తుంటారు. ఇక్కడ తయారయ్యే నగలు వేసుకుని మహిళలు మురిసిపోతుంటారు. కానీ ఈ నగల తయారీ వెనుక కొందరి బాల్యం మసకబారుతున్నదని, వెట్టి చాకిరీతో వారు నలిగిపోతున్నారనే విషయం చాలామందికి తెలియదు. జైపూర్‌లోని భట్టాబస్తీలో 22 మంది చిన్నారులను జూన్ 12 న పోలీసులు ఒక పిల్లల సంరక్షణా సంస్థ సాయంలో రెస్క్యూ చేశారు. వీరి చేత బలవంతంగా నగలు తయారు చేసే పనులు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చదువుకునే వయసులో వారి బాల్యాన్ని చిదిమేస్తున్నట్లు పోలీసులు గమనించారు. పోలీసులు రెస్క్యూ చేసిన చిన్నారులంతా బాహార్లోని సీతామఢి, ముజఫ్ఫర్‌పూర్ ప్రాంతానికి చెందినవారని సమాచారం. రెస్క్యూ అనంతరం విచారణలో పోలీసులకు పలు విషయాలు తెలిశాయి. ఈ చిన్నారులతో రోజుకు 18 గంటల పాటు చాకిరీ చేయిస్తున్నారు. భోజనం పేరుతో వారికి ఖిచిడీ మాత్రమే ఇస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆవేదన చెందారు. ఈ సందర్భంగా ఆ చిన్నారులు పోలీలసులతో మాట్లాడుతూ షహన్వాజ్ అనే వ్యక్తి తమ తల్లిదండ్రులకు రూ.500 చొప్పున ఇచ్చి తమను కొనుగోలు చేశాడని తెలిపారు. తమను బీహార్ నుంచి ఇక్కడకు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: బాధితులకు వైద్య సేవలు అందించే ఎక్స్‌ప్రెస్ రైలు ఈ చిన్నారులందరినీ ఒక గదిలో బంధించి, ప్రతీరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ నగలు తయారీ చేసే పనులను బలవంతంగా చేయిస్తున్నారు. ఈ నేపధ్యంలో పని ఒత్తిడికి తోడు రోజూ ఖిచిడీ తినడం వలన ఆ చిన్నారులు అనారోగ్యం బారినపడుతున్నారు. అయినా వారి యజమాని మనసు కరగడం లేదు. పైగా ఆ చిన్నారుల చేత పశువుల చేత పనిచేయించినట్లు వ్యవహరిస్తున్నాడు. కాగా సోమవారం అంటే జూన్ 12న రాత్రి సమయంలో ఈ గదిలో నుంచి చిన్నారుల రోదనలు వినిపించడంతో స్థానికులు ‘బచపన్ బచావో’ అనే పిల్లల సంరక్షణ సంస్థకు ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే ఆ సంస్థ నిర్వాహకులు మనీష్ శర్మ పోలీసులకు ఈ సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసిన షహన్వాజ్ తన భార్యతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సందర్భంగా పోలీసులు అక్కడ రెస్క్యూ నిర్వహించి, 22 మంది చిన్నారులను కాపాడారు. వారంతా 9 నుంచి 16 ఏళ్ల మధ్యగలవారేనని పోలీసులు గుర్తించారు. వారిని వారి తల్లిదండ్రుల చెంతకు తరలించే ప్రయత్నిం చేస్తున్నారు. అలాగే నిందితుడు షహన్వాజ్, అతని భార్య కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: రీల్స్‌పై మోజులో బావిపైకి ఎక్కి.. -
పొంగి పొర్లిన శివ భక్తి.. ఖండాంతరాల్లో శివ పద నాద తరంగాలు!
శివ పదాలు అంటే మహా దేవుడైన శివుని భావస్వరాంజలులే, అటువంటి పదాలను పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ దాదాపు 1100 పైగా అత్యద్భుతంగా రచించారు. ఋషీపీఠం ఆధ్వర్యంలో మూడవ శివపద అంతర్జాతీయ అంతర్జాల పాటల పోటీలు ఈ మే నెల 12,13,14వ తేదీల్లో యూట్యూబ్ మాధ్యమంగా శివపదాంకిత వాణీ, నాగసంపత్ వారణాసి, శ్రీకాంత్ వడ్లమాని, శ్రీనివాస్ మేడూరు సహకారంతో నిర్వహించారు. శివపద గీతాల పోటీను పూర్తిగా విన్న షణ్ముఖ శర్మ.. ఇంత మంది చిన్నారులు, పెద్దలూ అందరూ భావానికి ప్రాధాన్యమిస్తూ వందల కొద్దీ శివ పదాలను పాడటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని శివాశీస్సులు అందించారు. ఈ పోటీలు ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు "గ్లోబల్ శివపదం టీం"ను, న్యాయనిర్ణేతలను అభినందించి ఆశీర్వదించారు. ఋషిపీఠం తరఫున పూర్ణ సహకారాలు అందించినందుకు శ్రీ మారేపల్లి సూర్యనారాయణకు, విద్యుత్ అంతరాయాలు ఉన్నా కార్యక్రమంలో ఎటువంటి అంతరాయాలూ రాకుండా మెరుగైన సాంకేతిక సహకారం అందించిన శ్రీ తోలేటి వెంకట పవన్ కి ప్రత్యేక ఆశీస్సులు అందించారు. మొత్తం 5 ఖండాలలోని వివిధ దేశాల నుంచి 300 మంది ఔత్సాహికులు ఈ పాటల పోటీల్లో పాల్గునగా, 17 మంది ప్రఖ్యాత సంగీత గురువులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వీరిలో భారతదేశం నుంచి శారదా సుబ్రమణియమ్, తులసి విశ్వనాథ్, పద్మ త్యాగరాజన్,పెద్దాడ సూర్యకుమారి, విష్ణుప్రియ భరధ్వాజ్, విద్యా భారతి, రాధికా కృష్ణ, శ్రీదేవి దేవులపల్లి, లక్ష్మి మూర్తి, మోహన కృష్ణ, ప్రతిమ పాల్గొన్నారు. అమెరికా నుంచి పావని మల్లాజ్యోస్యుల, లక్ష్మి కొలవెన్ను, అనీల కుమార్ గరిమెళ్ళ , లలిత రాంపల్లి, ప్రభల శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతే కాకుండా సింగపూర్ నుంచి శేషు కుమారి యడవల్లి న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. వయసులవారీగా ఉపమన్యు, మార్కండేయ, భక్త కన్నప్ప, నత్కీర, పుష్పదంత అనే 5 విభాగాలలో ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రవాసులయిన ఎందరో పిల్లలు సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో, స్పష్టమైన ఉఛ్చారణతో శృతి, లయ బద్ధంగా శివపదాలను అద్భుతంగా వీనులవిందుగా పాడారు. న్యాయనిర్ణేతలు తగు సూచనలు, ప్రోత్సాహం అందిస్తూ ఉత్సాహవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోటీలలో పాల్గొనటం వలన పిల్లలకు సంప్రదాయం, సత్ప్రవర్తన అలవడుతుందని కొందరు న్యాయ నిర్ణేతలు అన్నారు. ఈ కార్యక్రమం మొత్తం అంతా శివమయంగా మారిపోయింది. పాడే వారు, వినే వారు అందరూ కూడా శివ భక్తి సారంలో తన్మయులయ్యారు. రసరమ్యముగా సాగిన ఈ కార్యక్రమం శుక్రవారం మొదలై ఆదివారం రోజు ముగిసింది. అప్పుడే పోటీలు అయిపోయాయా అన్నట్టుగా ఉందని, వచ్చే ఏడాది కోసం ఇప్పటి నించే వేచిచూస్తామని న్యాయనిర్ణేతలుగా వ్యవహరించినవారు అన్నారు. ఇలాంటి శివపద భక్తిభావనలో ఓలలాడే అవకాశం రావటం తమ అదృష్టంగా భావిస్తామని, గాయకులూ, నిర్వాహకులూ, న్యాయనిర్ణేతలు, వీక్షకులూ అంతా అన్నారు. -
Corona: ‘ముందస్తు ప్రణాళిక లేకుంటే.. థర్డ్ వేవ్ ఆపటం కష్టం’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వ్యాప్తి ఉద్ధృతి నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పలువురు రాజకీయ నాయకులు, మేధావులు ప్రధాని మోదీకి లేఖలు రాస్తున్నారు. వైరస్ కట్టడికి అనుసరించాల్సిన విధివిధానాలపై లేఖల్లో పేర్కొంటున్నారు. అయితే తాజాగా కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదంటూ కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం విమర్షలు గుప్పించారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై శనివారం ఆయన ట్విటర్లో స్పందించారు. కరోనా సెకండ్ వేవ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందని మండిపడ్డారు. కోవిడ్ టీకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్టు గుర్తుచేశారు. భవిష్యత్తుల్లో కరోనా పిల్లలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చిన్నారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. పిల్లలకు అందించే చికిత్స, వ్యాక్సినేషన్ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. దేశ భవిష్యత్తు కోసం ప్రస్తుత ప్రభుత్వాన్ని నిద్రలేపాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయకపోతే రాబోయే కరోనా మూడో దశను కూడా నివారించడం సాధ్యం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. (చదవండి: కర్ఫ్యూ ఉల్లంఘించాడని పోలీసుల దాడి: బాలుడు మృతి) -
ఈమె 8 మంది శిశువులను చంపారట!
సాక్షి, న్యూఢిల్లీ : ఆమె ఎప్పుడూ ముఖంపై చెరగని చిరు నవ్వుతో నిజమైన మాతమూర్తిలా కనిపిస్తుంది. ఆమె ఆ ఆస్పత్రిలో శిశువుల బాగోగులు చూసుకుంటుంటే దివి నుంచి దిగిన దేవ కన్యలా కనిపిస్తుంది. ఆమెలో అభం శుభం తెలియని శిశువులను నిర్ధాక్షిణ్యంగా చంపేసే రాక్షసి దాగుందంటే ఎవరూ నమ్మరు. ఆమె పేరే లూసీ లెట్‌బై. ఆమెకు 30 ఏళ్లు. ఇంగ్లండ్‌లోని చెస్టర్ యూనివర్శిటీ గ్రాడ్యువేట్. ఎన్హెఎస్ ఆధ్వర్యంలో చెస్టర్ నగరంలో నడుస్తున్న ‘కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆస్పత్రిలో శిశువుల సంరక్షణ బాధ్యతలను చూసుకునే నర్సుగా ఎప్పటి నుంచో పని చేస్తున్నారు. 2015, మార్చి నెల నుంచి 2016 జూలై నెల మధ్య ఆ ఆస్పత్రిలో పురుడు పోసుకున్న శిశువుల మరణాలు హఠాత్తుగా పెరిగాయి. ప్రసవం సందర్భంగా, నెలలు నిండకుండానే సాధారణంగా సంభవించే శిశు మరణాలకంటే ఆ ఏడాది కాలంలో ఆ మరణాలు 10,11 శాతం పెరిగాయి. ఆస్పత్రి ఉన్నతాధికారులు అంతర్గతంగా దర్యాప్తు చేయగా, అనుమానాలన్నీ లూసీ లెట్‌బై వైపే దారితీశాయి. అంతకుముందు లివర్‌పూల్ ఆస్పత్రిలో పని చేయడమే కాకుండా, వైద్య సేవల కోసం మూడు మిలియన్ పౌండ్లు (దాదాపు 29.5 కోట్ల రూపాయలు) విరాళాలుగా వసూలు చేసిన ఘన చరిత్ర ఆమెకుంది. తోటి నర్సులు కూడా లూసీ అలాంటి నేరాలకు పాల్పడుతుందని కలలో కూడా ఊహించలేదు. చెస్టర్ ఆస్పత్రిలో అసహజంగా కనిపించిన శిశు మరణాలలో, వారి వద్దకు ఆఖరి సారి వెళ్లిందీ లూసీయేనని తేలడంతో ఆస్పత్రి అధికార వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఆస్పత్రిలో అంతుచిక్కని శిశు మరణాలపై దర్యాప్తు జరిపిన చెషైర్ పోలీసులు 2018లో ఒకసారి, 2019లో ఒకసారి లూసీని అరెస్ట్ చేశారు. ఆమెపై ఎనిమిది మంది శిశువుల హత్య, ఆరుగురు శిశువులపై హత్యాయత్నం అభియోగాలు మోపారు. అదే కేసులో తాజాగా ఆమెను మూడోసారి మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. లూసీపై కొత్తగా మరో నాలుగు హత్యాయత్నం కేసులు అదనంగా నమోదు చేశారు. మొత్తం ఆమెపై దాఖలైన కేసులు ఎనిమిది హత్య కేసులుకాగా, పది హత్యాయత్నం కేసులు. ఇంతకుముందు రెండుసార్లు లూసీని చెస్టర్ ఆస్పత్రిలోనే అరెస్ట్ చేయగా, ఈసారి ఆమె నివసిస్తున్న వెస్ట్బోర్న్ రోడ్డులోని ఆమె ఇంటిలో అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు ఇంకా ముగియనందున మొదట రెండుసార్లు లూసీ బెయిల్‌పై విడుదలయ్యారు. అత్యంత సంక్లిష్టమైన, సున్నితమైన ఈ కేసును గత మూడేళ్లుగా దర్యాప్తు చేస్తున్నామని డిటెక్టివ్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఫాల్ హగెస్ తెలిపారు. నెలలు నిండకుండానే పుట్టడం వల్ల ఆ శిశువులు గుండె లేదా ఊపిరితిత్తుల వైఫల్యంతో చనిపోయారని లూసీ చెబుతూ వస్తున్నారు. ఆయన చనిపోయిన శిశువుల కాళ్లు, చేతులపై ఒక విధమైన గాయాలుండడం అటు ఆస్పత్రి వర్గాలను, ఇటు పోలీసులను ఆశ్యర్య పరుస్తోంది. లూసీ ఇలాంటి నేరాలు చేశారంటే తాము ఇప్పటికీ నమ్మలేక పోతున్నామని, ఆమె తనకెంతో ఇష్టమని నర్సు వత్తిలో ఇప్పటికీ కొనసాగుతున్నారని మిత్రులు తెలిపారు. అభియోగాలు ఎదుర్కొంటున్న లూసీ మాత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు మొదటి నుంచి నిరాకరిస్తూ వస్తున్నారు. ఇంగ్లండ్ స్థానిక కాలమానం ప్రకారం ఈరోజు లూసీని అక్కడి కోర్టు ముందు హాజరపర్చాల్సి ఉంది. -
‘అంగన్వాడీ’ల బడిబాట
ఖమ్మంమయూరిసెంటర్: చిన్నారులను బడిబాట పట్టించేందుకు అంగన్వాడీ టీచర్లు రోడ్డుబాట పట్టనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరుతూ ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రుల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నించనున్నారు. బాలబాలికలు, ఐదేళ్లలోపు పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో, ఐదేళ్లు దాటితే పాఠశాలల్లో ఉండాలనే నినాదంతో పట్టణాలు, గ్రామాల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు బడిబాట నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, స్థానిక పెద్దలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. దీంతో 11వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో ప్రదర్శనలు నిర్వహించి.. చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మూడేళ్లు వచ్చిన ప్రతి చిన్నారి అంగన్వాడీ కేంద్రంలో చేరాల్సిన ఆవశ్యకత, అవసరాన్ని స్థానికులకు వివరించేలా అంగన్వాడీ టీచర్లను సన్నద్ధం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు, పోషక పదార్థాల వివరాలు బడిబాటలో ప్రతి ఒక్కరికి వివరించనున్నారు. మంచి విద్యను అందించేందుకు.. అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్లు నిండిన పిల్లలను చేర్చేందుకు బడిబాట కార్యక్రమం నిర్వహించాల ని ఇప్పటికే నిర్ణయించారు. గతంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ–స్కూల్ కార్యక్రమంగా భావించేవారు. పాఠశాలకు వెళ్లడం చిన్నారులకు అలవాటు చేసేందుకు ఉపయోగపడగా.. మరోవైపు చిన్నారులకు పౌష్టికాహారం అందించి.. వారితో ఆటలు ఆడించి.. పాఠశాల అంటే భయం పోగొట్టేందుకు పనిచేసేవారు. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మార్పులు తెచ్చారు. కేవలం పౌష్టికాహారం అందించడం.. ఆట పాటలతో గడపడమే కాకుండా.. వారికి విజ్ఞానాన్ని అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. చిన్నారులకు వర్క్‌బుక్‌లను అందించి.. వారితో హోమ్ వర్క్ చేయించాలని నిర్ణయించారు. జిల్లాలో 7 ప్రాజెక్టుల కింద మొత్తం 1,896 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 1,605 మెయిన్ కేంద్రాలు కాగా.. 291 ఉప కేంద్రాలున్నాయి. వీటిలో చిన్నారులను చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమాలు ఇలా.. బడిబాట సందర్భంగా ఏ రోజు.. ఏ కార్యక్రమం చేపట్టాలో అధికారుల నుంచి వివరాలు వచ్చా యి. ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. బుధవా రం గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇందు లో అంగన్వాడీ టీచర్లతోపాటు ఆయాలు, స్వ యం సహాయక సంఘాలు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, యువత, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాల్సి ఉంటుంది. అలాగే బడి మానేసిన ఆడపిల్లలను కూడా తిరిగి బడిలో చేర్పించేందుకు వీరు కృషి చేయాల్సి ఉంటుంది. ఇక ఈనెల 7, 8 తేదీల్లో ఇంటింటికీ తిరిగి రెండున్నరేళ్ల పిల్లలను గుర్తించాల్సి ఉంటుంది. చిన్నారుల తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రాల్లో అడ్మిషన్ల గురించి.. ప్రీ–స్కూల్ సిలబస్ గురించి, అక్కడ ఉండే టైమ్ టేబుల్, వర్క్ బుక్స్, పిల్లలకు ఇచ్చే యాక్టివిటీ బుక్స్, ప్రీ–స్కూల్ కిట్ మెటీరియల్ గురించి వివరిస్తారు. ఇక 10వ తేదీన అంగన్వాడీలో చేరిన పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యను అందించాల్సిన ఆవశ్యకతపై తల్లిదండ్రులకు వివరిస్తారు. ప్రత్యేక కార్యక్రమాలను అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసి పిల్లల తల్లిదండ్రులు, వారి బంధువులను ఆహ్వానిస్తారు. గ్రామ పెద్దలను ముఖ్యఅతిథులుగా ఆహ్వానించి.. అంగన్వాడీ కేంద్రాల్లో తమ పిల్లలను ఎందుకు చేర్పించాలో వివరించేలా ఏర్పాట్లు చేస్తారు. ప్రీ–స్కూల్ మెటీరియల్‌ను బహిరంగంగా ప్రదర్శనలో ఉంచుతారు. ఆరోగ్యవంతులుగా ఉన్న పిల్లలను గుర్తించి.. తల్లిదండ్రులకు బహుమతులు అందించనున్నారు. ఇక 11వ తేదీన స్వచ్ఛ అంగన్వాడీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని శుభ్రపరచడం, ఆవరణను శుభ్రం చేసి అనవసరంగా ఉన్న సామగ్రిని తొలగిస్తారు. ఆవరణలో మొక్కలు నాటుతారు. మంచినీటి సదుపాయం కల్పించడంతోపాటు టాయిలెట్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటారు. దీంతో అంగన్వాడీ బడిబాట కార్యక్రమం ముగిసినట్లవుతుంది. ప్రతి వాడలో అంగన్వాడీ బడిబాట.. జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, ప్రతి వీధిలో, వాడలో అంగన్వాడీ బడిబాట నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. బుధవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాల పరిధిలో వివిధ రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు, గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులను పాల్గొనేలా చేసి.. వారికి ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరించి, వాటిపై అవగాహన కల్పిస్తాం. అంగన్వాడీల్లో ఐదేళ్ల వయసులోపు పిల్లలు ఎందుకు చేరాలనే ఆవశ్యకతను బాడిబాటలో వివరించనున్నాం. – ఆర్.వరలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ -
బాల్యదశలో జాగ్రత్త!
పాలమూరు: బాల బాలికలు ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని.. తద్వారా ఎలాంటి అనారోగ్యం దరిచేరదని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్ట ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కలెక్టర్ మాత్రలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది లోపు జిల్లాలో నులిపురుగులు, ఏలికపాములు, కొంకిపురుగులు నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో ఎవరు కూడా మలవిసర్జన చేయకుండా విద్యార్థులు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులు సైతం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. పిల్లలో కొంకిపురుగులు, నులిపురుగులు కడుపులో ఏర్పడితే పెరుగుదల లోపించడం, రక్తహీనత, చదువుపై శ్రద్ధ కోల్పోవడం జరుగుతుందన్నారు. అంతకుముందు కలెక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేయడంతో పాటు విద్యాబోధనపై ఆరా తీశారు. డీఎంహెచ్ఓ డాక్టర్ రజిని, ప్రోగ్రాం అధికారి డాక్టర్ శశికాంత్, మాస్‌మీడియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ కృష్ణ, డాక్టర్లు జరీనా, సునీత, హెల్త్‌ఎడ్యుకేటర్ రాజగోపాలాచారి, ఉమాదేవి, సుభాష్‌చంద్రభోస్, రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 85.9శాతం మందికి మాత్రలు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలో 85.9శాతం మందికి మాత్రలు వేశారు. జిల్లాలోని 15మండలాలు, నారాయణపేట జిల్లాలో 11 మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని 1నుంచి 19 ఏళ్ల లోపు చిన్నారులు, యువతీ యువకులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.జిల్లా వ్యాప్తంగా 4,65,826 మంది బాలబాలికలకు గాను 3,51,568మందికి మాత్రలు వేసినట్లు అధికారులు తెలిపారు. ఇక మిగిలిపోయిన 1,14,258 మంది బాలబాలికలకు ఈనెల 23న మాత్రలు అందించనున్నారు. నులిపురుగు మాత్రలు తప్పనిసరి... భూత్పూర్ (దేవరకద్ర): ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు నులిపురుగు మాత్రలు విధిగా వేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ రిజిని సూచించారు. భూత్పూర్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఆమె మంగళవారం మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ మాత్రలు వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.కాగా, మండలంలో 10,833 మందికి గాను 7,513 మందికి మాత్రలు వేసినట్లు సీహెచ్ఓ రామయ్య వివరించారు. జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఒక్కసారి సూపించండయ్యా..
‘‘అయ్యా.. ఈ ఫొటోలోని చిట్టితల్లి నా బిడ్డయ్యా.. మూడేళ్ల క్రితం సుట్టపోల్ల ఇంటికి వెళ్లోస్తూ కానరాకుండా పోయింది. ఇటీవల సానికొంపల నుంచి పిల్లలను రక్షించి తీసుకొచ్చి నట్టు టీవీ, పేపర్లలో సూచి కడుపుతీపితో వచ్చినం.. ఒక్కసారి ఆ పిల్లలను సూపించండయ్యా..అందులో నా బిడ్డ ఉందేమోనని సూసుకుంటా..’’ అంటూ ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతూ పోలీసు అధికారులను ప్రాథేయపడడం అక్కడున్న వారందరినీ కలచివేసింది. యాదగిరిగుట్ట (ఆలేరు): ముస్కాన్ ఆపరేషన్‌లో భాగంగా ఇటీవల చిన్నారుల అక్రమ రవాణా ముఠా, వ్యభిచార నిర్వాహకుల చెరల్లో నుంచి రక్షించబడిన 15మంది చిన్నారుల్లో తమ కూతురు ఉందని బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లికి చెందిన తుంగని నందం–భాగ్యమ్మ దంపతులు శనివారం యాదగిరిగుట్ట టౌన్ సీఐ అశోక్ కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆ దంపతులు మీడియాతో మాట్లాడారు. మాకు ముగ్గురు కూతుళ్లు. చిన్న కూతురు టి.కల్పన (తప్పిపోయినప్పుడు వయస్సు 11సంవత్సరాలు) బొమ్మలరామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. 22 ఏప్రిల్ 2015న సమీప బంధువుల ఇంటికి వెళ్లి బొమ్మలరామారం మండలం హజీపురం మీదుగా మైసిరెడ్డిపల్లికి మధ్యాహ్నం సుమారు 3గంటల ప్రాం తంలో నడుచుకుంటూ వస్తూ కానరాకుండా పోయింది. దీంతో బంధువుల ఇంటికి, ఇతర ప్రాంతాల్లో వెతికిన కనిపించలేదు. వెంటనే కుటుంబసభ్యులు అంతా కలిసి బొమ్మలరామారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెండ్రోజులుగా యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న పరిణామాలు వివిధ పత్రికల్లో, చానల్స్‌లో రావడంతో వారు శనివారం యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. దీంతో టౌన్ సీఐ అశోక్ కుమార్‌ను కలిసిన వారు, తమ కూతురు ఉందో చూస్తామని వేడుకున్నారు. పిల్లలు అందరూ మహబూబ్‌నగర్ జిల్లా అమ్మన్గల్ ప్రజ్వల హోమ్స్‌లో ఉన్నారని సీఐ అశోక్ తెలిపారు. అక్కడికి తీసుకెళ్లి, చిన్నారులను చూపెట్టి, గుర్తుపట్టిన వారిని డీఎన్ఏ టెస్టు చేయిస్తామన్నారు. విచారణ ముమ్మరం : సీఐ అశోక్‌కుమార్ ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా బాలికల అక్రమ రవాణా కేసును పూర్తిస్థాయిలో ఛేదించేందుకు విచారణ ముమ్మరంగా సాగుతోందని యాదగిరిగుట్ట సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఈ కేసులో సంబంధం ఉన్న వ్యభిచారగృహ నిర్వాహకుల ముఠాసభ్యులు 14మంది, ఆర్ఎంపీ డాక్టర్‌ను అరెస్టు చేశామని, వీరి నుంచి 15మంది చిన్నారులను రక్షించామని తెలిపారు. పట్టుబడిన ముఠాతో పాటు వైద్యుడిని శుక్రవారం రిమాండ్‌కు తరలించామని, చిన్నారులను మహబూబ్‌నగర్‌లోని ప్రజ్వల పాఠశాలలో చేర్పించామని వెల్లడించారు. దొరికిన చిన్నారుల్లో మా పిల్లలు ఉన్నారని వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. పిల్లల గురించి తెలుసుకోవాలంటే ప్రజ్వల స్కూల్‌కు తీసుకెళ్తున్నామని, అక్కడ డీఎన్ఏ టెస్టులు చేయించి, అధికారుల సూచనలతో తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. నేరస్తుల మీద వివిధ ఐపీసీ సెక్షన్లు, హ్యూమన్ అండ్ ట్య్రాపరింగ్, డాక్టర్‌పై చీటింగ్ కేసు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్టు, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ కేసు నమోదు చేశామన్నారు. దాడులు జరుగుతున్నాయని భయానికి కొంతమంది వ్యభిచార నిర్వాహకులు ఇక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం ఉందన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. అంతే కాకుండా తమ దగ్గర మరికొంత సమాచారం ఉందని, విచారణ చేసి చిన్నారులను వారి దగ్గరి నుంచి రక్షిస్తామని తెలిపారు. -
ఎల్లలు దాటిన ‘ప్రేమ’
మహబూబ్‌నగర్ రూరల్ : మాతృత్వం.. ఆ భావన అనిర్వచనీయం.. పెళ్లయిన ప్రతీ మహిళా తల్లి కావాలని కోరుకుంటుంది.. పుట్టిన బిడ్డలో తమ ప్రతిరూపాన్ని చూసుకుంటూ చెప్పలేని ఆనందాన్ని అనుభవిస్తారు.. అదే భావన పురుషులకూ ఉంటుంది.. అయితే, మారుతున్న జీవనశైలితో సంతాన లేమి సమస్య పలువురికి చెప్పలేని ఆవేదనను మిగులుస్తోంది.. ఈ నేపథ్యంలో చట్టబద్ధంగా అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్న పలువురు తమకు సంతానం లేదన్న బెంగ తీర్చుకుంటున్నారు... అలాంటి వారిలో విదేశీయులు కూడా ఉండడం.. వారు పాల మూరు శిశుగృహ నుంచి పిల్లల దత్తత తీసుకుని తల్దిండ్రుల ప్రేమకు ఎల్లలు లేవని నిరూపిస్తుండడం విశేషం. అభాగ్యులు ఎందరో.. ఏ పాపం తెలియని పలువురు శిశువులను అమ్మ పేగు తెంచుకుని పుట్టిన మరుక్షణమే ముళ్ల పొదలపాలు చేస్తున్నారు. కళ్లు కూడా తెరవని పసికందులను అనాథలుగా మారుస్తున్నారు. కారణాలేమైనా ఇలాంటి పిల్లలెందరో తమ తప్పు లేకున్నా రోడ్డు పాలవుతున్నారు. ఇలాంటి సంఘటనలు పాలమూరు జిల్లాలో అడపాదడపా చోటు చేసుకుంటున్నాయి. ఆయా సందర్భాల్లో స్థానికులు ఇచ్చే సమాచారం ఆధారంగా ఐసీడీఎస్ సిబ్బంది సహకారంతో పిల్లలను శిశుగృహకు చేర్చుతున్నారు. ఇంకా కొందరు తల్లిదండ్రులు తాము పిల్లలను పోషించలేమంటూ స్వచ్ఛందంగా శిశుగృహ అధికారులకు అప్పగించి వెళ్తున్నారు. ఇలాం జిల్లా కేంద్రంలోని శిశుగృహకు చేరుకుంటున్న వారిలో ఎక్కువ మంది బాలికలే ఉండడం గమనార్హం. వేధిస్తున్న సంతాన లేమి ఆధునిక జీవన విధానం, మానసిక ఒత్తిడి తదిత కారణాలు సంతాన లేమికి దారి తీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆధునిక వైద్య విధా నాలు అందుబాటులోకి వచ్చినా.. అందరికీ సంతాన భాగ్యం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో సంతానం కోసం ఏళ్ల తరబడి పరితపిస్తున్న జంటలు చివరికి చట్టపరమైన దత్తతకు మొగ్గు చూపుతున్నాయి. దత్తత ప్రక్రియ ఆన్లైన్ విధా నంలో పారదర్శకంగా జరుగుతుండడంతో గడిచిన ఏడేళ్లలో పాలమూరు శిశుగృహ ద్వారా ఎందరో చిన్నారులు ‘అమ్మానాన్న’ల ఒడికి చేరా రు. 2010లో శిశుగృహ ఏర్పాటు చేయగా, 2011 నుంచి దత్తత ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు 111 మంది శిశువులు దత్తతకు వెళ్లగా.. అందులో నలుగురు బాలికలు విదేశాలకు వెళ్లారు. సంతాన లేమితో బాధపడుతున్న జంటలకు స్త్రీ, శిశు సంక్షేమశాఖ చట్టపరంగా పిల్లలను దత్తత తీసుకునే అవకాశం కల్పిస్తోంది. రోజుల వయçస్సు ఉన్న పసికందుల నుంచి 18 ఏళ్ల వయసున్న బాలల వరకు చట్ట ప్రకారం దత్తత తీసుకునే వీలుంది. ఎక్కువ శాతం నాలుగేళ్ల లోపు పిల్లలను దత్తత తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. గడిచిన ఏడేళ్లలో శిశుగృహ నుంచి 111 మంది చిన్నారులను దత్తత ఇచ్చారు. అందులో 93 మంది బాలికలు, 18 మంది బాలురు ఉన్నారు. సులువైన చట్టాలు రాష్ట్రంలోనే వెనకబడిన ప్రాంతంగా, వలసల జిల్లాగా పేరుగాంచిన మహబూబ్‌నగర్ జిల్లా నుంచి పిల్లలను దత్తత తీసుకునేందుకు పలువురు విదేశీ దంపతులు ముందుకొస్తున్నారు. స్వీడన్, ఇటలీ, మాల్టా వంటి దేశాలకు చెందిన దంపతులు పిల్లలు లేరనే బాధను విడనాడి జిల్లాకు వచ్చి అనాథ పిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు. ఇక్కడి చట్టాల ప్రకారం విదేశాలకు శిశువులను దత్తత తీసుకువెళ్లాలంటే ఎన్నో అవరోధాలు ఉంటాయని తొలుత భావించేవారు. అయితే అందుకు భిన్నంగా సులువైన చట్టాలు ఉండడంతో ఇక్కడి చిన్నారులను విదేశాలకు తీసుకువెళ్లి తల్లిదండ్రుల ప్రేమను పంచుతున్నారు. విదేశాలకు.. శిశుగృహలోని చిన్నారులను ఎంతోమందికి చట్టబద్ధంగా దత్తత ఇస్తున్నారు. ఇందులో స్వీడన్‌కు ఒకరు, ఇటలీ దేశానికి ఇద్దరు ఆడపిల్లలు, మాల్టా దేశానికి ఒక పాప చొప్పున దత్తత ఇచ్చారు. ప్రస్తుతం స్పెయిన్ దేశానికి ఒక మగ, ఒక ఆడ శిశువు, మాల్టా దేశానికి ఒక పాప, అమెరికాకు ఒక పాపను దత్తత ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలో చట్టబద్ధంగా అన్ని అర్హతలు గుర్తించి, ప్రక్రియ పూర్తయ్యాక వీరిని ఆయా దంపతులకు అప్పగించనున్నారు. పారదర్శక విధానం సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దత్తత ప్రక్రియను పారదర్శక విధానంలో నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా శిశుగృహలో 11 మంది పిల్లలను దత్తత ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతుండగా 47 మంది దంపతులు దత్తత కోరుతూ దరఖాస్తులు ఇచ్చి వేచి చూస్తున్నారు. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మొదలుకుని దత్తత కోరుకునే జంటలకు పిల్లలను అప్పగించడం వరకు ప్రక్రియలన్నీ ఆన్లైన్ విధానంలోనే స్త్రీ, శిశు సంక్షేమశాఖ నిర్వహిస్తుంది. దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి జాబితాలో సీనియార్టీ ప్రకారం చట్టపరమైన జాగ్రత్తలు పాటిస్తూ పిల్లలను దత్తత ఇస్తున్నారు. దత్తతకు వెళ్లిన పిల్లలు తాము వెళ్లిన చోట ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని రెండేళ్ల పాటు సంబంధిత శాఖ పర్యవేక్షిస్తుంది. మగ, ఆడ పిల్లలనే తేడా లేకుండా తమకంటూ సొంత వారు ఉంటే చాలు అనే భావన దత్తత కోరుకుంటున్న జంటల్లో కనిపిస్తుంది. దత్తతకు వెళ్తున్న వారిలో ఆడ పిల్లల సంఖ్యే ఎక్కువగా ఉండడం విశేషం. కాగా, ఆరోగ్యం, ఆర్థిక స్థోమత కలిగి భార్యాభర్తల వయస్సు కలుపుకుని 90 ఏళ్ల నుంచి 110 ఏళ్లు కలిగిన వారికే పిల్లలను దత్తత ఇస్తారు. చట్టబద్ధంగా దత్తత ప్రక్రియ పూర్తయ్యేందుకు ఆడపిల్లలకైతే ఆరు నెలల నుంచి ఏడాది, మగ పిల్లల విషయంలోనైతే ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతుంది. చట్టబద్ధంగా దత్తతకు ఓకే.. పిల్లలు కావాలనే తపనతో చాలామంది దళారుల వలలో పడి మోసపోతున్న ఘటనలు అక్కడకక్కడా చూస్తున్నాం. అయితే శిశువులను పెంచుకోవాలనే ఆసక్తి ఉన్న దంపతులు చట్టబద్ధంగానే ముందుకు సాగాలి. నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకుంటే జైలుశిక్ష, జరిమానా ఉంటుంది, న్యాయపరమైన ఇబ్బందులు సైతం ఎదురవుతాయి. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) వెబ్సైట్ ద్వారా లేదా మా కార్యాలయంలో సంప్రదించడం ద్వారా దత్తత నిబంధనలు, వివరాలు తీసుకోవచ్చు. -
చిన్నారులను మింగిన నీటిగుంత
మహేశ్వరం : నీటి నిల్వ కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండల పరిధిలోని దుబ్బచర్ల గ్రామ సమీపంలో వ్యవసాయ పొలం వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని దుబ్బచర్ల గ్రామానికి చెందిన బండ శ్రీశైలం, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమారులు. వ్యవసాయ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నీటి నిల్వ కోసం పొలం వద్ద పెద్ద గుంత తీసి బోరు నీటిని నింపుతున్నారు. పాఠశాలలకు సెలవు కావడంతో తల్లి లక్ష్మీతో కలిసి కుమారులు బండ చరణ్‌తేజ(9), జశ్వంత్(7), మణి(5)లు పొలం వద్దకు వెళ్లారు. తల్లి గొర్రెలను పొలం వద్ద మేపుతుండగా చిన్నారులు ఇద్దరు కాళ్లు చేతులు కడుక్కునేందుకు గుంత వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు నీటి గుంతలో పడిపోయారు. వీరిలో చిన్నవాడు ఇద్దరు అన్నలు గుంతలో పడిన విషయాన్ని చూసి భయంతో ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లికి చెప్పాడు. వెంటనే తల్లి నీటిగుంత వద్ద వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరు నీటి మునిగి దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని భర్త శ్రీశైలం, గ్రామస్తులకు తెలపడంతో సంఘటన స్థలానికి గ్రామస్తులు భారీగా చేరుకున్నారు. గ్రామంలో విషాదఛాయలు.. ఇద్దరి చిన్నారులు నీటిగుంతలో పడి మరణిం చడంతో తల్లిదండ్రులు, బంధువులు ఇద్దరి చిన్నారుల మృతదేహాలను చూసి బోరున విలపించా రు. విషయం తెలుసుకున్న మహేశ్వరం పోలీసు లు గ్రామానికి చేరుకొని ఇద్దరి మృతికి గల కారణాలను బాధిత తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. వారు తవ్విన గుంతలో వారి పిల్లలు ప డి దుర్మరణం చెందడం అందరినీ కలిచివేసింది. గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు నీటి గుంతలో పడి చనిపోవడం విషాద ఛాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యుల ను పీసీసీ సభ్యుడు కొరుపోలు రఘుమారెడ్డి, గ్రా మ సర్పంచ్ కోమటమ్మ, నాయకులు హనుమానాయక్, బాలరాజ్ పలువురు మృతదేహాలను సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. -
'గుర్తుకొస్తున్నాయి'... : ఎమ్మెల్యే
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : చిన్నప్పుడు ఆడిన గోలీల ఆటను ఒక్కసారి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ గుర్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మోడ్రన్ రైతు బజార్ పనులను శనివారం పరిశీలించిన ఎమ్మెల్యే తిరిగి బయలుదేరారు. ఆ సమయంలో అక్క డే గోలీలు ఆడుకుంటున్న చిన్నారులను చూసిన ఆయన పరిశీలిస్తుండగా.. వారు మీరు కూడా ఆడతారా అంటూ అడిగారు. దీంతో ఎమ్మెల్యే వారి వద్ద నుంచి గోలీ తీసుకుని కాసేపు సరదాగా ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తన చిన్నతనంలో ఇలాంటి ఆటలకు ప్రాధాన్యత ఉండేదని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి తరం ఇండోర్ గేమ్స్, కంప్యూటర్లకే పరిమిత మవుతున్నారని తెలిపారు. అయితే, వేసవి సెలవుల సందర్భంగా పిల్లల విషయమై తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. -
అసిఫా దోషులను శిక్షించాలి
తిరుపతి అర్బన్ /కల్చరల్ : జమ్ము కాశ్మీర్ కథువాలో చిన్నారి అసిఫాపై అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవి, నగర అధ్యక్షురాలు బుర్రా సావిత్రియాదవ్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం నుంచి నగర వీధుల్లో ర్యాలీగా నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద ముగించారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నా, నిర్భయ చట్టం అమలులో ఉన్నా ఫలితం లేకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ప్రమీలమ్మ, రిటైర్డ్ ప్రిన్సిపాల్ స్వరాజ్య లక్ష్మి, వివిధ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. క్రైస్తవుల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం వచ్చాక మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలు, అరాచకాలను అరికట్టాలని అసీఫా దోషులను శిక్షించాలని, పాస్టర్ అరుళ్ అరసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్నారి అసీఫా హత్యను ఖండిస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ తిరుపతి క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి తిరుపతి నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో పాస్టర్స్ రాజేంద్రన్, భీమిరెడ్డి, విజయకుమార్, డానియేల్, జాన్‌పాల్, దీలీప్, జయపాల్, ప్రమీల, జమిలా, క్రైస్తవులు, చిన్నారులు పాల్గొన్నారు. -
వాహనాలు ఉన్న చోట పిల్లల్లో ఉబ్బసం
వాహనాల పొగకు పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మోటారు వాహనాల కారణంగా తలెత్తే వాయు కాలుష్యం కారణంగా చిన్నారులు ఉబ్బసం బారిన పడుతున్నారు. వాహనాల నుంచి వెలువడే నానా వాయువుల్లో ముఖ్యంగా నైట్రోజన్ ఆక్సైడ్ ప్రభావం వల్ల చిన్నారులు ఉబ్బసం బారిన పడుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ స్టడీస్ శాస్త్రవేత్తలు ఇంగ్ల్లండ్లోని బ్రాడ్ఫోర్డ్ ప్రాంతాన్ని నమూనాగా తీసుకుని చేపట్టిన తాజా అధ్యయనంలో తేలింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువ మంది చిన్నారులు ఉబ్బసంతో బాధపడుతున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని లీడ్స్ వర్సిటీ నిపుణుడు డాక్టర్ హనీన్ ఖ్రీస్ తెలిపారు. వాహనాల కాలుష్యాన్ని అదుపు చేయగలిగితే, ఉబ్బసంతో బాధపడే చిన్నారుల సంఖ్యను చాలావరకు తగ్గించవచ్చని వెల్లడించారు. తమ అధ్యయనానికి బ్రాడ్ఫోర్డ్ను నమూనాగా తీసుకున్నా, ప్రపంచవ్యాప్తంగా వాహన కాలుష్యం ప్రభావం దాదాపు ఒకేవిధంగా ఉంటుందని డాక్టర్ ఖ్రీస్ వివరించారు. -
ఈ నెల 19 నుంచి పల్స్ పోలియో
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఈనెల 19న జాతీయ పల్స్ పోలియో దినంగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అహ్మద్ బాబు తెలిపారు. గురువారం వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమావేశంలో పేర్కొన్నారు. 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. వంద శాతం చుక్కల మందు వేయాలన్నారు. ఈ నెల 21, 22 తేదీలలో ఇంటింటికి వెళ్లి పిల్లల వివరాలు సేకరించి చుక్కల మందులు వేయాలని అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు సూచించారు. ఇందుకోసం 5.40 లక్షల వ్యాక్సిన్లు జిల్లాకు అందాయని తెలిపారు. 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలు జిల్లాలో 3,62,523 ఉన్నారని అంచనా వేశామన్నారు. చక్కుల మందులకు సంబంధించిన గ్రామాల్లో పది రోజుల ముందుగానే బ్యానర్లు, పోస్టర్లు అతికించాలన్నారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, వంద శాతం పోలియో చుక్కలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డీఎంహెచ్‌వో మేకల స్వామి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.