ఆ పట్టణానికి చెందిన పోలీసులు ఒక గృహంపై దాడులు చేసి, 22 మంది బాల కార్మికులను రెస్క్యూ చేశారు. వీరిని షహన్వాజ్ అనే వ్యాపారి రూ. 500 చొప్పున వారి తల్లిదండ్రుల నుంచి కొనుగోలు చేశాడని పోలీసులు గుర్తించారు. తరువాత ఆ చిన్నారుల చేత రోజుకు ఏకంగా 18 గంటలపాటు ఆర్టిఫిషిల్ నగల తయారీ పనులు చేయిస్తున్నట్లు కనుగొన్నారు.
అది రాజస్థాన్‌లోని జైపూర్... ఈ పట్టణం పింక్ సిటీగా పేరొందింది. పర్యాటక ప్రాంతంగానూ గుర్తింపు పొందింది. ఆభరణాల తయారీకి కేంద్రంగా ఉన్న ఈ పట్టణానికి విదేశీయులకు కూడా వస్తుంటారు. ఇక్కడ తయారయ్యే నగలు వేసుకుని మహిళలు మురిసిపోతుంటారు. కానీ ఈ నగల తయారీ వెనుక కొందరి బాల్యం మసకబారుతున్నదని, వెట్టి చాకిరీతో వారు నలిగిపోతున్నారనే విషయం చాలామందికి తెలియదు.
జైపూర్‌లోని భట్టాబస్తీలో 22 మంది చిన్నారులను జూన్ 12 న పోలీసులు ఒక పిల్లల సంరక్షణా సంస్థ సాయంలో రెస్క్యూ చేశారు. వీరి చేత బలవంతంగా నగలు తయారు చేసే పనులు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చదువుకునే వయసులో వారి బాల్యాన్ని చిదిమేస్తున్నట్లు పోలీసులు గమనించారు. పోలీసులు రెస్క్యూ చేసిన చిన్నారులంతా బాహార్‌లోని సీతామఢి, ముజఫ్ఫర్‌పూర్ ప్రాంతానికి చెందినవారని సమాచారం.
రెస్క్యూ అనంతరం విచారణలో పోలీసులకు పలు విషయాలు తెలిశాయి. ఈ చిన్నారులతో రోజుకు 18 గంటల పాటు చాకిరీ చేయిస్తున్నారు. భోజనం పేరుతో వారికి ఖిచిడీ మాత్రమే ఇస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆవేదన చెందారు. ఈ సందర్భంగా ఆ చిన్నారులు పోలీలసులతో మాట్లాడుతూ షహన్వాజ్ అనే వ్యక్తి తమ తల్లిదండ్రులకు రూ.500 చొప్పున ఇచ్చి తమను కొనుగోలు చేశాడని తెలిపారు. తమను బీహార్ నుంచి ఇక్కడకు తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: బాధితులకు వైద్య సేవలు అందించే ఎక్స్‌ప్రెస్ రైలు
ఈ చిన్నారులందరినీ ఒక గదిలో బంధించి, ప్రతీరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ నగలు తయారీ చేసే పనులను బలవంతంగా చేయిస్తున్నారు. ఈ నేపధ్యంలో పని ఒత్తిడికి తోడు రోజూ ఖిచిడీ తినడం వలన ఆ చిన్నారులు అనారోగ్యం బారినపడుతున్నారు. అయినా వారి యజమాని మనసు కరగడం లేదు. పైగా ఆ చిన్నారుల చేత పశువుల చేత పనిచేయించినట్లు వ్యవహరిస్తున్నాడు.
కాగా సోమవారం అంటే జూన్ 12న రాత్రి సమయంలో ఈ గదిలో నుంచి చిన్నారుల రోదనలు వినిపించడంతో స్థానికులు ‘బచపన్ బచావో’ అనే పిల్లల సంరక్షణ సంస్థకు ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే ఆ సంస్థ నిర్వాహకులు మనీష్ శర్మ పోలీసులకు ఈ సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసిన షహన్వాజ్ తన భార్యతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సందర్భంగా పోలీసులు అక్కడ రెస్క్యూ నిర్వహించి, 22 మంది చిన్నారులను కాపాడారు. వారంతా 9 నుంచి 16 ఏళ్ల మధ్యగలవారేనని పోలీసులు గుర్తించారు. వారిని వారి తల్లిదండ్రుల చెంతకు తరలించే ప్రయత్నిం చేస్తున్నారు. అలాగే నిందితుడు షహన్వాజ్, అతని భార్య కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రీల్స్‌పై మోజులో బావిపైకి ఎక్కి..
Comments
Please login to add a commentAdd a comment