శివ పదాలు అంటే మహా దేవుడైన శివుని భావస్వరాంజలులే, అటువంటి పదాలను పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ దాదాపు 1100 పైగా అత్యద్భుతంగా రచించారు. ఋషీపీఠం ఆధ్వర్యంలో మూడవ శివపద అంతర్జాతీయ అంతర్జాల పాటల పోటీలు ఈ మే నెల 12,13,14వ తేదీల్లో యూట్యూబ్ మాధ్యమంగా శివపదాంకిత వాణీ, నాగసంపత్ వారణాసి, శ్రీకాంత్ వడ్లమాని, శ్రీనివాస్ మేడూరు సహకారంతో నిర్వహించారు.
శివపద గీతాల పోటీను పూర్తిగా విన్న షణ్ముఖ శర్మ.. ఇంత మంది చిన్నారులు, పెద్దలూ అందరూ భావానికి ప్రాధాన్యమిస్తూ వందల కొద్దీ శివ పదాలను పాడటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని శివాశీస్సులు అందించారు. ఈ పోటీలు ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు "గ్లోబల్ శివపదం టీం"ను, న్యాయనిర్ణేతలను అభినందించి ఆశీర్వదించారు. ఋషిపీఠం తరఫున పూర్ణ సహకారాలు అందించినందుకు శ్రీ మారేపల్లి సూర్యనారాయణకు, విద్యుత్ అంతరాయాలు ఉన్నా కార్యక్రమంలో ఎటువంటి అంతరాయాలూ రాకుండా మెరుగైన సాంకేతిక సహకారం అందించిన శ్రీ తోలేటి వెంకట పవన్ కి ప్రత్యేక ఆశీస్సులు అందించారు.
మొత్తం 5 ఖండాలలోని వివిధ దేశాల నుంచి 300 మంది ఔత్సాహికులు ఈ పాటల పోటీల్లో పాల్గునగా, 17 మంది ప్రఖ్యాత సంగీత గురువులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వీరిలో భారతదేశం నుంచి శారదా సుబ్రమణియమ్, తులసి విశ్వనాథ్, పద్మ త్యాగరాజన్,పెద్దాడ సూర్యకుమారి, విష్ణుప్రియ భరధ్వాజ్, విద్యా భారతి, రాధికా కృష్ణ, శ్రీదేవి దేవులపల్లి, లక్ష్మి మూర్తి, మోహన కృష్ణ, ప్రతిమ పాల్గొన్నారు.
అమెరికా నుంచి పావని మల్లాజ్యోస్యుల, లక్ష్మి కొలవెన్ను, అనీల కుమార్ గరిమెళ్ళ , లలిత రాంపల్లి, ప్రభల శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతే కాకుండా సింగపూర్ నుంచి శేషు కుమారి యడవల్లి న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు.
వయసులవారీగా ఉపమన్యు, మార్కండేయ, భక్త కన్నప్ప, నత్కీర, పుష్పదంత అనే 5 విభాగాలలో ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రవాసులయిన ఎందరో పిల్లలు సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో, స్పష్టమైన ఉఛ్చారణతో శృతి, లయ బద్ధంగా శివపదాలను అద్భుతంగా వీనులవిందుగా పాడారు. న్యాయనిర్ణేతలు తగు సూచనలు, ప్రోత్సాహం అందిస్తూ ఉత్సాహవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోటీలలో పాల్గొనటం వలన పిల్లలకు సంప్రదాయం, సత్ప్రవర్తన అలవడుతుందని కొందరు న్యాయ నిర్ణేతలు అన్నారు.
ఈ కార్యక్రమం మొత్తం అంతా శివమయంగా మారిపోయింది. పాడే వారు, వినే వారు అందరూ కూడా శివ భక్తి సారంలో తన్మయులయ్యారు. రసరమ్యముగా సాగిన ఈ కార్యక్రమం శుక్రవారం మొదలై ఆదివారం రోజు ముగిసింది. అప్పుడే పోటీలు అయిపోయాయా అన్నట్టుగా ఉందని, వచ్చే ఏడాది కోసం ఇప్పటి నించే వేచిచూస్తామని న్యాయనిర్ణేతలుగా వ్యవహరించినవారు అన్నారు. ఇలాంటి శివపద భక్తిభావనలో ఓలలాడే అవకాశం రావటం తమ అదృష్టంగా భావిస్తామని, గాయకులూ, నిర్వాహకులూ, న్యాయనిర్ణేతలు, వీక్షకులూ అంతా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment