జాతీయ జెండాకు సెల్యూట్ చేయని కలెక్టర్
- తెలంగాణ ఉద్యమకారుల ఆవేదన
- చర్చనీయాంశమైన కలెక్టర్ వ్యవహారశైలి
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన జెండావిష్కరణలో సెల్యూట్ చేయకపోవడం చర్చనీయాంశమైంది. తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పతాకావిష్కరణ చేశారు. అనంతరం మంత్రితోపాటు ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజులు జెండాకు సెల్యూట్ చేస్తూ జాతీయగీతం ఆలపించారు. ఇదే వేదికపై ఉన్న కలెక్టర్ మాత్రం సెల్యూట్ చేయలేదు. గతంలో జనవరి 26 గణతంత్ర వేడుకల్లోనూ కలెక్టర్ ఇలాగే వ్యవహరించారు.
అటెన్షన్‌లో ఉంటే చాలు: జాతీయజెండా అంటే తనకు గౌరవమని, సెల్యూట్ చేయాలన్న నిబంధనేమీ లేదని కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. అయితే.. అటెన్షన్‌లో నిలబడితే సరిపోతుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తనకు శిక్షణ సమయంలో చెప్పారని, అదే పాటిస్తున్నానని వివరించారు. యూనిఫామ్‌లో ఉన్న పోలీస్ సిబ్బంది మాత్రం తప్పనిసరిగా సెల్యూట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. త్రివిధ దళాల్లోని వారికి సెల్యూట్ తప్పనిసరి అని, తమకు అవసరం లేదన్నారు.