తెలంగాణ మంత్రి పోచారం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలపై నిజనిర్ధారణ కమిటీ వేయడమేగాక, రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్య లు తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం శాసనసభలో రైతు సంఘాల ప్రతినిధులు ఆయనను కలసి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. దీంతో మంత్రి పైవిధంగా హామీ ఇచ్చారు. టి.విశ్వేశ్వరరావు, పశ్య పద్మ (తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం-సీపీఐ), బొంతల చంద్రారెడ్డి, జగ్గారెడ్డి, నరసింహారెడ్డి (తెలంగాణ రైతుసంఘం-సీపీఎం), వీరహనుమంతరావు, కె.రాంగోపాల్‌రెడ్డి (కౌలురైతులసంఘం) మంత్రిని కలసిన బృం దంలో ఉన్నారు. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలుకు కేంద్రంపై ఒత్తిడి చేస్తామని మంత్రి చెప్పారని వారు వెల్లడించారు. 1956 నాటి వడ్డీ నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు గిట్టుబాటు ధరలు నిర్ణయించాలని, జీఓ 421ను సవరించాలని, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచాలని వారు మంత్రిని కోరారు. ఎఫ్.ఐ.ఆర్, పంచనామా, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ల ఆధారంగా తహసీల్దార్ రిపోర్ట్‌ను పూర్తిచేయాలని, ప్రస్తుతమున్న త్రిసభ్య కమిటీని రద్దుచేసి, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేసినట్టు వారు తెలిపారు. రుణం చెల్లించిన వెంటనే వడ్డీమాఫీని వర్తింపజేయాలని, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ఆహారపంటలకు రూ.10వేలు, వాణిజ్యపంటలకు రూ.20వేలు ఇవ్వాలని కోరామన్నారు.
రైతుల ఆత్మహత్యలపై నిజనిర్ధారణ కమిటీ
Published Tue, Nov 18 2014 2:39 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM
Advertisement
Advertisement