సాక్షి, నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతుంది. రెండు రోజులుగా విద్యార్థులు, అధ్యాపకులు హైరానా పడుతున్నారు. జూనియర్‌లను ర్యాగింగ్ చేస్తున్న సీనియర్లు, అధ్యాపకులపై ఆరోపణలు వెలువెత్తడం ఆందోళన కలిగి స్తోంది. కళాశాలలో పరిపాలన వ్యవస్థ సక్రమంగా లేదని ఆరోపణలు రావడంపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. కొన్ని రోజులుగా సీనియర్ వైద్య విద్యార్థులు జూనియర్‌లపై ర్యాగింగ్‌కు పాల్పడుతుండడంతో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజులుగా కళాశాల ఆవరణలో రాత్రి వేళలో పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు ఇష్టారీతిన తిరగడం, మద్యం సేవించడం కొనసాగుతోంది. ఇదివరకు పలుమార్లు కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను గట్టిగా హెచ్చరించారు. ముగ్గురు విద్యార్థులపై సైతం చర్యలు తీసుకుని ఇంటికి పంపించారు. అయినా కళాశాలలో విద్యార్థుల ప్రవర్తన మారకపోవడంతో జూనియర్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లడం కలకలంరేపింది.
ఆందోళన
ర్యాగింగ్ ఘటనకు సంబంధించి నివేదికలో ఏముందోనని అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ర్యాగింగ్ ఘటనపై డీఎంఈ రమేశ్‌రెడ్డి ముగ్గురు ప్రొఫెసర్లతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్లు శ్రీనివాస్, నాగేశ్వర్, శివప్రసాద్‌లు కళాశాలలో విచారణ చేపట్టి నివేదికను డీఎంఈకి పంపించారు. విద్యార్థులను అధ్యాపకులను వేర్వేరుగా విచారించారు. ర్యాగింగ్ ఘటనలు జరిగినట్లు కొందరు జూనియర్ విద్యార్థులు కమిటీ ముందు గోడు వెల్లబోసుకున్నట్లు తెలిసింది. అలాగే కళాశాలలో రాత్రివేళలో మద్యం సేవిస్తున్నారని కొందరు విద్యార్థినులు పేర్కొన్నారు. సెక్యూరిటీ వ్యవస్థ లేకుండాపోయిందని వాపోయినట్లు తెలిసింది. దీంతో నివేదికలో ఏముందోనని ఎలాంటి చర్యలు ఉంటాయోనని అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ర్యాగింగ్‌కు పాల్పడితే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని డీఎంఈ తెలిపారు. అలాగే కళాశాలలో జరుగుతున్న సంఘటనపై ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. విద్యార్థులకు సెక్యూరిటీ విధానం సరిగ్గా లేదని నివేదిక కమిటీ కూడా పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలపై విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలలో ఏంజరుగుతుందోనని ఆరా తీస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రుల రాకపోకలు కొనసాగుతున్నాయి.
ర్యాగింగ్ అవాస్తవం
► మెడికల్ కళాశాలపై వచ్చినవి వదంతులే..
► ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర
నిజామాబాద్ అర్బన్: రెండు రోజులుగా ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ పేరిట వస్తున్న కథనాలు అవాస్తవాలని కళాశాల ప్రిన్సిపల్ ఇందిర గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ర్యాగింగ్ విషయంపై జూనియర్ విద్యార్థులను విచారించగా ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని వారు తెలిపారన్నారు. అలాగే విద్యార్థులు గాని, వారి తల్లిదండ్రులు గాని పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. పోలీసులు కేవలం ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించేందుకు కళాశాలకు వచ్చారన్నారు. తెలంగాణ వైద్య విద్య సంచాలకుల ఆదేశాల మేరకు ముగ్గురి సభ్యులతో కూడిన కమిటీ ద్వారా వసతి గృహాల్లో విచారణ చేపట్టిందన్నారు. నివేదికను సీల్డ్‌కవర్‌లో డీఎంఈ కార్యాలయానికి పంపించడం జరిగిందన్నారు. ర్యాగింగ్, మత్తు పదార్థాల వాడకంపై పత్రికలు, టీవీల్లో కథనాలు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. కళాశాలలో ర్యాగింగ్, మత్తు పదార్థాల వినియోగం లాంటివి ఏమీ జరగడం లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment