Nizamabad Government Medical College
-
ర్యాగింగ్‌పై నివేదిక, ఏం తేలనుందో...
సాక్షి, నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతుంది. రెండు రోజులుగా విద్యార్థులు, అధ్యాపకులు హైరానా పడుతున్నారు. జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్న సీనియర్లు, అధ్యాపకులపై ఆరోపణలు వెలువెత్తడం ఆందోళన కలిగి స్తోంది. కళాశాలలో పరిపాలన వ్యవస్థ సక్రమంగా లేదని ఆరోపణలు రావడంపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. కొన్ని రోజులుగా సీనియర్ వైద్య విద్యార్థులు జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడుతుండడంతో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజులుగా కళాశాల ఆవరణలో రాత్రి వేళలో పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు ఇష్టారీతిన తిరగడం, మద్యం సేవించడం కొనసాగుతోంది. ఇదివరకు పలుమార్లు కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను గట్టిగా హెచ్చరించారు. ముగ్గురు విద్యార్థులపై సైతం చర్యలు తీసుకుని ఇంటికి పంపించారు. అయినా కళాశాలలో విద్యార్థుల ప్రవర్తన మారకపోవడంతో జూనియర్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లడం కలకలంరేపింది. ఆందోళన ర్యాగింగ్ ఘటనకు సంబంధించి నివేదికలో ఏముందోనని అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ర్యాగింగ్ ఘటనపై డీఎంఈ రమేశ్‌రెడ్డి ముగ్గురు ప్రొఫెసర్లతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్లు శ్రీనివాస్, నాగేశ్వర్, శివప్రసాద్‌లు కళాశాలలో విచారణ చేపట్టి నివేదికను డీఎంఈకి పంపించారు. విద్యార్థులను అధ్యాపకులను వేర్వేరుగా విచారించారు. ర్యాగింగ్ ఘటనలు జరిగినట్లు కొందరు జూనియర్ విద్యార్థులు కమిటీ ముందు గోడు వెల్లబోసుకున్నట్లు తెలిసింది. అలాగే కళాశాలలో రాత్రివేళలో మద్యం సేవిస్తున్నారని కొందరు విద్యార్థినులు పేర్కొన్నారు. సెక్యూరిటీ వ్యవస్థ లేకుండాపోయిందని వాపోయినట్లు తెలిసింది. దీంతో నివేదికలో ఏముందోనని ఎలాంటి చర్యలు ఉంటాయోనని అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ర్యాగింగ్‌కు పాల్పడితే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని డీఎంఈ తెలిపారు. అలాగే కళాశాలలో జరుగుతున్న సంఘటనపై ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. విద్యార్థులకు సెక్యూరిటీ విధానం సరిగ్గా లేదని నివేదిక కమిటీ కూడా పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలపై విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలలో ఏంజరుగుతుందోనని ఆరా తీస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రుల రాకపోకలు కొనసాగుతున్నాయి. ర్యాగింగ్ అవాస్తవం ► మెడికల్ కళాశాలపై వచ్చినవి వదంతులే.. ► ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర నిజామాబాద్ అర్బన్: రెండు రోజులుగా ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ పేరిట వస్తున్న కథనాలు అవాస్తవాలని కళాశాల ప్రిన్సిపల్ ఇందిర గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ర్యాగింగ్ విషయంపై జూనియర్ విద్యార్థులను విచారించగా ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని వారు తెలిపారన్నారు. అలాగే విద్యార్థులు గాని, వారి తల్లిదండ్రులు గాని పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. పోలీసులు కేవలం ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించేందుకు కళాశాలకు వచ్చారన్నారు. తెలంగాణ వైద్య విద్య సంచాలకుల ఆదేశాల మేరకు ముగ్గురి సభ్యులతో కూడిన కమిటీ ద్వారా వసతి గృహాల్లో విచారణ చేపట్టిందన్నారు. నివేదికను సీల్డ్కవర్లో డీఎంఈ కార్యాలయానికి పంపించడం జరిగిందన్నారు. ర్యాగింగ్, మత్తు పదార్థాల వాడకంపై పత్రికలు, టీవీల్లో కథనాలు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. కళాశాలలో ర్యాగింగ్, మత్తు పదార్థాల వినియోగం లాంటివి ఏమీ జరగడం లేదని పేర్కొన్నారు. -
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో ర్యాగింగ్ కలకలం సంచలనంగా మారింది. నిజామాబాద్ మెడికల్ కళాశాల విద్యార్థిని తనను కొంతమంది ర్యాంగింగ్ చేస్తున్నారంటూ తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా హాస్టల్లో విద్యార్థులు మద్యం తాగుతున్నట్లుగా గుర్తించారు. కాలేజీ యాజమాన్యం ర్యాంగింగ్కు పాల్పడిన ముగ్గురు వైద్య విద్యార్థులను హాస్టల్ నుంచి తొలగించింది. పోలీసుల హెచ్చరికలతో డీఎంఈ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. -
కా‘లేజీ సార్లు’
సాక్షి, నిజామాబాద్: భావి వైద్యులను తీర్చిదిద్దే వారే బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. నెలనెలా రూ.లక్షల్లో వేతనం తీసుకుంటూ విధులకు డుమ్మా కొడుతున్నారు. నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సిబ్బంది ఇష్టారాజ్యం నడుస్తోంది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నెలల తరబడి గైర్హాజరవుతున్నారు. వారి దారిలోనే మిగతా వారు కూడా కాలేజీకి ముఖం చాటేస్తున్నారు. వైద్యవిద్య బోధనతో పాటు వైద్య సేవలు అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. గొప్పలు చెప్పుకునే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కళాశాల యంత్రాంగం పట్టించుకోక పోవడంతో వారి ఆటలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రెండ్రోజుల క్రితం మెడికల్ కళాశాలలో పీజీ సీట్ల అనుమతి కోసం ఎంసీఐ బృందం ఆకస్మిక తనిఖీకి రావడంతో డుమ్మా మాస్టార్ల బాగోతం మరోసారి రట్టయింది. వారి గైర్హాజరు వల్ల అనుమతి లభించడంపై సందేహాలు నెలకొన్నాయి! తీరు మారేదెన్నడు? పై నుంచి కింది స్థాయి దాకా ఉద్యోగులు, సిబ్బంది డుమ్మాలు కొట్టడంలో ముందున్నారు. మెడికల్ కళాశాలలో 12 మంది ప్రొఫెసర్లు, 94 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 32 మంది అసోసియేట్ ఫ్రొఫెసర్లు, 150 మంది వరకు సీనియర్, జూనియర్ రెసిడెన్షియల్ డాక్టర్లు కొనసాగుతున్నారు. అయితే, వీరిలో రోజు వారీగా వైద్యసేవలు అందించడంలో కొందరు తరచూ గైర్హాజరవుతున్నారు. 12 మంది ప్రొఫెసర్లలో 8 మంది హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో సగం మంది వరకు నెలలో సగం రోజులు డుమ్మా కొడుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 94 మంది ఉండగా వీరిలో చాలా వరంగల్, హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు తరచూ గైర్హాజరయ్యే జాబితాలో ఉన్నారు. 32 మంది అసోసియేట్ ప్రొఫెసర్లలో 8 మంది రెగ్యులర్‌గా డుమ్మా కొడుతున్నారు. ఇక సీనియర్, జూనియర్ రెసిడెన్షియల్ వైద్యుల్లో 30, 40 మంది తరచూ విధులు ఎగ్గొడుతున్నారు. భయం లేని బయోమెట్రిక్! ఆస్పత్రిలో బయోమెట్రిక్ హాజరు విధానం అమలులో ఉన్నా ప్రయోజనం శూన్యం. 10–15 రోజులకు ఒకసారి ఆస్పత్రికి వచ్చి సెలవులను అధికారికంగా చూపించడం, అనంతరం రోజువారీగా అటెండెన్స్ పడేలా ‘ఒప్పందం’ చేసుకున్నట్లు సమాచారం. ఒక ప్రొఫెసర్ ఏడాది నుంచి అటు కాలేజీకి, ఇటు ఆస్పత్రికి రాకపోయినా పట్టించుకునే వారే లేరు. మెడిసిన్ విభాగంలో మరో వైద్యుడు మూడు నెలలుగా ముఖం చూపించడం లేదు. ఫోరెన్సిక్, పాథలాజికల్ విభాగంలో ఐదుగురు రోజుల తరబడి గైర్హాజరవుతున్నారు. కొన్ని నెలలుగా ఈ తతంగం కొనసాగుతోంది. సీనియర్, జూనియర్ రెసిడెన్షియల్ వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో కాకుండా ఖలీల్వాడిలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో హాజరు వేసుకుని, ఆ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి పోతున్నారు. నైట్ డ్యూటీలు అసలే చేయడం లేదు. ఇక, శని, ఆదివారాలు వస్తే చాలు డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. పట్టింపు లేదా..? ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతరులు తరచూ గైర్హాజరవుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. రెగ్యులర్‌గా డుమ్మా కొడుతున్న వైద్యుల వివరాలను కళాశాల అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా కళాశాల, ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా వారి ఇష్టారాజ్యం నడుస్తోంది. గతంలో 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎంసీఐ రెండుసార్లు అనుమతి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ తర్వాత మళ్లీ వదిలేశారు. చర్యలు తప్పవు.. ఆస్పత్రిలో విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి ఏ వైద్యుడు అయినా అనుమతి లేనిదే సెలవులో వెళ్లకూడదు. బయోమెట్రిక్ హాజరు కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వైద్యులపై చర్యలు తప్పవు. వైద్యులు ఇకనైనా సక్రమంగా వైద్యసేవలు అందించాలి. – డాక్టర్ దిన్దయాల్బంగ్, ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ -
ఇందూరంటే లోకువా!
సాక్షి, నిజామాబాద్ అర్బన్: ఇందూరు జిల్లా అంటే లోకువనో ఏమో కానీ.. కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో ఇటు సర్కారు, అటు ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లా ఆస్పత్రితో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల దుస్థితిపై స్పందించడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోవడం లేదు. ఫలితంగా వైద్య కళాశాలలో ఏడేళ్లుగా పోస్టులు భర్తీ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిజామాబాద్ మెడికల్ కళాశాల కంటే ఏడాది క్రితం ప్రారంభమైన నల్లగొండ, సూర్యపేట వైద్య కళాశాలలకు ప్రభుత్వం ఇటీవల పోస్టులు మంజూరు చేసింది. అంతేకాదు తక్షణమే ఆయా పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించింది. ప్రత్యేక మెడికల్ పోస్టుల ద్వారా ఆయా పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, నిజామాబాద్ వైద్య కళాశాలకు ఏడేళ్ల క్రితం మంజూరైన పోస్టుల భర్తీని మాత్రం మరిచి పోయింది. సిబ్బంది కొరత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిజామాబాద్‌కు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. 2008లో జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించి, తక్షణమే అమలయ్యేలా చూశారు. జీవో 150 ద్వారా కళాశాలకు 2012లో కొత్త పోస్టులను మంజూరు చేశారు. ఇందులో బోధన, బోధనేతర, పరిపాలన అధికారులు, సిబ్బంది పోస్టులున్నాయి. 150 జీవో ప్రకారం ప్రభుత్వ పరిపాలన విభాగంలో 189, ప్రిన్సిపల్ విభాగంలో 50 పోస్టులు మంజూరయ్యాయి. ఈ రెండు విభాగాలకు సంబంధించి ప్రస్తుతం 11 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇక, సూపరింటెండెంట్ విభాగంలో 15 పోస్టులకు గాను 9 మంది పని చేస్తుండగా, ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్లినికల్ విభాగంలో 87 పోస్టులు మొత్తం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విద్య బోధనకు సంబంధించి అన్ని రకాల ప్రొఫెసర్లు కలిపి 311 మంది ఉండాల్సి ఉండగా, 162 మంది మాత్రమే పని చేస్తున్నారు. 149 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 805 పోస్టులకు గాను 171 మంది పని చేస్తున్నరు.ఇక, ఆస్పత్రిలో వివిధ విభాగాలకు సంబంధించి 410 పోస్టులకు గాను 211 మంది పని చేస్తున్నారు. ఇందులోనూ కొందరిని డిప్యూటేషన్ పద్ధతిలో ఇక్కడ నియమించారు. ఎంసీఐ అనుమతి కోసం తంటాలు.. ప్రతి ఏటా ఎంసీఐ అనుమతి కోసం అధికారులు అనేక తంటాలు పడుతున్నారు. ఎంసీఐ పరిశీలనకు వస్తుందంటే అధికారులు ఆందోళన చెందుతున్నారు. కళాశాల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి ఉద్యోగులను చూపించాల్సి ఉంటుంది. దీంతో డిప్యూటేషన్‌పై సిబ్బందిని ఇక్కడ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎంసీఐ అనుమతి పొందడంలో రెండుసార్లు విఫలమయ్యారు. అయినప్పటికీ పోస్టుల భర్తీకి సంబంధించి మాత్రం చర్యలు చేపట్ట లేదు. కాంట్రాక్ట్, తాత్కాలిక పద్ధతిలోనూ భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు అనుమతించడం లేదు. జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పడినప్పటి నుంచి ఓపీ రోగుల సంఖ్య రెండింతలు పెరిగింది. నిత్యం 1500 మందికి పైగా రోగులకు ఇక్కడ వైద్యం అందిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
మెడికల్ కళాశాలకు ఎట్టకేలకు అనుమతి
నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల చింత ఎట్టకేలకు తీరింది. ఎంబీ బీఎస్ రెండవ సంవత్సరం తరగతుల నిర్వహణకు ఎంసీఐ అనుమతి లభించడంతో ఇటు విద్యార్థులు, అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వంద సీట్లు మంజూరు కావడంతో ఆనందం వ్యక్తమవుతోంది. ఏడాదిగా రెండవ సంవత్సరం అనుమతి విషయంలో స్తంభన నెలకొంది. సౌకర్యాలు లేవంటూ ఎంసీఐ పలుమార్లు అనుమతిని నిరాకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18, 19 తేదీలలో ఇద్దరు సభ్యుల ఎంసీఐ బృందం కళాశాల ను పరిశీలించింది. ప్రొఫెసర్ల కొరత, గ్రంథాలయం, వసతి భవనాలు సక్రమంగా లేవంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో అధికారులు లోపాలను సరి దిద్దేందుకు నడుం బిగించారు. గత నెల మొదటివారం లో ఎంసీఐ బృందం తిరిగి కళాశాలను పరిశీలించింది. సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసి, అనుమతి కోసం సిఫారసు చేసింది. విస్తరించనున్న వైద్యసేవలు తెలంగాణ నవ నిర్మాణంలో భాగంగా జిల్లాలోని ప్రభు త్వ మెడికల్ కళాశాల మరింత పటిష్టం కానుంది. మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ఈ జిల్లా వెనుకబడిన ప్రాంతంగా కళాశాల అనుమతి నివేదికలో రాష్ట్ర ప్ర భుత్వమే పేర్కొంది. కనుక అధిక నిధులు కేటాయించి అవకాశం మెండుగా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కళాశాలకు రూ. 164 కోట్లను మంజూరు చేసింది. మొదటి విడత 100 కోట్లు, రెండవ విడత 64 కో ట్లను విడుదల చేసింది. ఇప్పుడిక అన్ని సౌకర్యాలతో మహారాష్ట్ర, ఆదిలాబాద్, కరీం నగర్ ప్రాంతాల రోగులకు కూడా ముఖ్యమైన ఆస్పతిగా మారనుంది. వైఎస్ఆర్ చలవతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చలవతోనే జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైంది. 2008 అక్టోబర్ లో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ షష్ఠి పూర్తి కార్యక్రమం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించా రు. 2009లో కళాశాలకు ప్రభుత్వం ని ధులను మంజూరు చేసింది. 2013 మే లో ఎంసీఐ బృందం తొలిసారిగా పరిశీ లనకు వచ్చింది. జులై 24న మొదటి ఏడాది తరగతులకు 100 సీట్లతో అనుమతి లభించింది. అదే ఏడాది ఆగస్టు ఐదున తరగతులు ప్రారంభమయ్యాయి. డీఎంఈ చొరవతో డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (డీఎంఈ) మెరుగైన వైద్యసేవల కోసం ఈ కళాశాలపై దృష్టి సారించింది. ఇం దులో భాగంగానే 121 మంది ప్రొఫెసర్లు, 92 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల ను నియమించింది. ఆయా విభాగాల లో నిపుణులైన వైద్యులు ఇందులో ఉ న్నారు. న్యూరాలాజీ, కార్డియాలజీతోపాటు, ఇతర ముఖ్య సేవలు అం దు బాటులోకి వచ్చాయి. ఎంఆర్ఐ స్కాన్, సీటీస్కాన్, డిజిటల్ ఎక్స్‌రేలు, ఆధుని క ఆపరేషన్ థియేటర్లు, చిన్నపిల్లలకు సంబంధించిన ఎన్ఐసీ తదితర సౌకర్యాలను కల్పించనున్నారు. ఎనిమిదంతస్తుల భవనంలో వెయ్యి పడకల ఆ స్పత్రి అందుబాటులో ఉంది. పీజీ కోర్సులకూ అనుమతి కళాశాల ఏర్పాటైన మొదటి ఏడాదే పీ జీ కోర్సులు అందుబాటులోకి వచ్చా యి. ఈ ఏడాది నుంచి డీఎన్బీ (డిప్లొ మా ఇన్ నేషనల్ బోర్డు)కు చెందిన పీజీ కోర్సులకు అనుమతి లభించింది. మూ డేళ్ల వ్యవధి గల మెడిసిల్, సర్జరీ, గైనిక్, ఫిజిషియన్, అనస్థీషియన్ కోర్సులకూ అవకాశం వచ్చింది. ఒక్కో కోర్సులో నాలుగు చొప్పున మొత్తం 20 సీట్లు మంజూరు కానున్నాయి. చిన్నపిల్లలకు మేలు చిన్నపిల్లలకు మెరుగైన వైద్య చికిత్స లభించే అవకాశం ఉంది. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు దీర్ఘకాలిక వ్యా ధులు, మానసిక సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించి, వారికి మెరుగైన వైద్యసేవలు అందించడానికి అత్యాధునిక వైద్యసేవలతో, నిపుణులైన వైద్యులతో ప్రత్యేక విభాగం నెలకొల్పాలని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిష న్ నిర్ణయించింది. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దీనిని ఏర్పాటు చేస్తున్నా రు. ఎన్ఆర్హెచ్ఎం అధికారి అరుణ్‌సింగ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ సహానీ గత ఫిబ్రవరి ఏడున మెడికల్ కళాశాలను సందర్శించారు. రూ. 13 కోట్ల రూపాయల తో ఈ విభాగాన్ని ఏర్పాటు చేసేందు కు అంగీకరించారు. యువతకు ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ కళాశాలలో ప్రభుత్వం 812 ఉద్యోగాలు భర్తీకి జీవో నం.50ని విడుదల చేసింది. ఇందులో పారామెడికల్ సిబ్బందితో పాటు పరిపాలన వి భాగం, వైద్యులు ఉన్నారు. 217 మంది స్టాఫ్ నర్సులు, 202 మంది నాల్గవ తరగతి ఉద్యోగులు, పరిపాలన విభాగాని కి సంబంధించి 50 మంది, సూపరిం డెంట్ పరిధిలో 189 మంది, పారా మె డికల్ సిబ్బంది నియామకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.