
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘నోటా’ సినిమా విడుదలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిశారు. ‘నోటా’ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, ఇది ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాసేవిధంగా తెరకెక్కించారని కేతిరెడ్డి ఫిర్యాదు చేశారు. తెలంగాణ సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన అనంతరం కేతిరెడ్డి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు.
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని మొదట ఎన్నికల కమిషనర్, డీజీపీ చూసిన తర్వాతే విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఎన్నికల సమయం కావడంతో ‘నోటా’ సినిమా ప్రభావం ఉంటుందన్నారు. ఈ సినిమా వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశముంటుందని ఆయన పేర్కొన్నారు. ‘నోటా’ అన్న ఈ సినిమా టైటిల్ కూడా వివాదాస్పదం అయ్యే అవకాశముందని చెప్పారు. ఇలాంటి టైటిల్ ఈసీ నిబంధనలకు విరుద్ధమని ఆయన చెప్పారు. వరుస విజయాలతో జోరుమీదున్న విజయ్ దేవరకొండ ఈ నెల 5వ తేదీన ‘నోటా’ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment