మమ్మదాన్‌పల్లి అంగన్‌వాడీ కేంద్రంలో అక్షరాలు నేర్చుకుంటున్న చిన్నారులు(ఫైల్)
అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఇకనుంచి మరింత పారదర్శకంగా వ్యహరించాలి. లేదంటే ఏ క్షణం ఎవరు ఫిర్యాదు చేస్తారో తెలియదు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 155209 హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సరుకులు పక్కదారి పట్టినా, పౌష్టికాహార పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా వెంటనే ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
నవాబుపేట : అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలను అరికట్టడంతో పాటు, విధులకు ఎగనామం పెడుతున్న వారికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులు, కిశోర బాలికలు, తల్లులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన భోజనం అందేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 155209 హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పౌష్టికాహారం పక్కదారి పట్టినా, సెంటర్లలో అవకతవకలు చోటుచేసుకున్నా వెంటనే ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది పని చేస్తుంది.
ఫిర్యాదు చేసిన వెంటనే....
లబ్ధిదారులకు అంగన్‌వాడీ సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడమే ఈ హెల్ప్‌లైన్ నంబర్ ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు లబ్ధిదారులకు ఎక్కడ, ఎప్పుడు సేవలు అందుతాయనే విషయాలను తెలుసుకోవచ్చు. సేవల్లో ఎలాంటి లోటుపాట్లు ఎదురైనా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. విషయం తెలుసుకున్న వెంటనే సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపడుతారు.
కార్యక్రమాల అములు, క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు, అవసరాలపై అంగన్‌వాడీ టీచర్లు కూడా హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. తల్లి పిల్లల పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, పెరుగుదల సమస్యలు, తల్లి పాలు పట్టడం, పిల్లల అభివృద్ధి కి తల్లిదండ్రులు చేయాల్సిన అంశాలపై సలహాలు కూడా ఈ హెల్ప్‌లైన్ అందిస్తుంది.
జిల్లాలో...
వికారాబాద్ జిల్లాలో 914 అంగన్‌వాడీ సెంటర్లు పని చేస్తున్నాయి. 6 నెలల నుంచి 3 సంవత్సరాల వయసున్న 49,126 మంది చిన్నారులు వీటిలో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. 3 నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లలు 13,870 పౌష్టికాహారం తీసుకుంటూ అక్షరాలు దిద్దుతున్నారు.
లక్ష్యం...
జీవీకే, ఆర్‌ఎంఆర్‌ఐ వారి సహకారంతో మహిళా, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ ఇటీవల హెల్ప్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఉచిత ఫోన్‌కాల్ ద్వారా పోషణ, ఆరోగ్య సంబంధిత సేవలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పొందవచ్చు. హెల్ప్‌లైన్ కల్పించే సౌకర్యాలు...
æ గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు పిల్లలకు మెరుగైన పౌష్టికాహారం అందించడం.
æ అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు ఆరేళ్లలోపు పిల్లల వివరాలు నమోదు చేయడం.
æ గర్భిణులు ఐరన్ మాత్రలు, ఇతర సూక్ష్మపోషకకాలు తీసుకునేలా చూడటం.
æ గర్భిణులు, బాలింతలు ఆరేళ్లలోపు పిల్లలు, కిశోర బాలికల్లో రక్తహీనత తగ్గించేలా చర్యలు తీసుకోవడం.
æ క్రమంతప్పకుండా బాలింతలు, గర్భిణుల ఆరోగ్య తనిఖీ, చిన్న పిల్లలకు వ్యాధి నిరోదక టీకాలు సకాలంలో అందేలా చూడటం.
æ తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్య తగ్గించడం.
æ మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలకు వరకు ఆరోగ్యకరమైన వాతావరణంలో మెరుగైన ప్రీ స్కూల్ విద్య అందేలా చూడటం.
Comments
Please login to add a commentAdd a comment