శివాలయం చుట్టు నిర్మాణం చేసిన ప్రాకారం, ఆలయ ప్రాకారాలకు ఏర్పాటు చేసిన విగ్రహాలు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా శివాలయం చుట్టూ ప్రాకారాలకు విగ్రహాల కూర్పు చివరి దశకు చేరుకుంది. ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఆలయంలోనికి వెళ్లడానికి ద్వార గోపురం పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే రామాలయం పూర్తయింది. శివాలయం రాజగోపురం పనులు సైతం పూర్తి కావొస్తున్నాయి. శివాలయానికి చుట్టూ ప్రాకారం గోడలకు సాలహారం పనులు జరుగుతున్నాయి. అందులో గణపతిలో ఉన్న లక్ష్మీగణపతి, గజముఖ గణపతి, శ్వేతాంబర గణపతి, సిద్ది గణపతి తదితర గణపతి విగ్రహాలు, అదేవిధంగా నవవిధ దుర్గలు, సరస్వతి, కాళీ, మహాలక్ష్మి అమ్మవార్లు, సుబ్రహ్మణ్యం, కుమారస్వామి, నంది, సింహవాహిని దుర్గ వంటి అనేక దేవతల విగ్రహాలను పొందుపరుస్తున్నారు. వారం రోజుల్లో ఈ విగ్రహాల కూర్పు పూర్తవుతుంది.
పూర్తయిన రాజగోపురాలు..
ప్రధానాలయం పునర్నిర్మాణంలో భాగంగా సప్త రాజగోపురాలు పూర్తయ్యాయి. ఇంతకుముందే ఆరు రాజగోపురాలు పూర్తయిన విషయం తెలిసిందే. ఇక భక్తులు స్వామివారిని దర్శించుకుని బయటకు వెళ్లే సప్తతల రాజగోపురం పూర్తి కావడంతో సప్త రాజగోపురాల పనులు పూర్తయినట్లే. తిరుమాడ వీధుల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సప్తతల రాజగోపురం ఎత్తు దాదాపు 65 నుంచి 70 అడుగులు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment