‘సర్వే’తో సాధించిందేమిటి?
సమగ్ర కుటుంబ సర్వేపై విపక్షాల ధ్వజం ప్రశ్నోత్తరాల్లోనే అధికార విపక్షాల వాగ్వివాదం
హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే అంశంపై మంగళవారం శాసనసభ అట్టుడికింది. దీనిపై ప్రశ్నోత్తరాల సమయంలో విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించడంతో వాడివేడిగా చర్చ జరిగింది. సమగ్ర సర్వేతో సాధించిందేమిటని విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు.
రాష్ట్రాన్ని నిర్బంధించారు..: టీడీపీ
తొలుత ఈ అంశంపై టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... సమగ్ర సర్వే పేరిట రాష్ట్రాన్ని 12 గంటల పాటు నిర్బంధించారని వ్యాఖ్యానించారు. ‘‘సంక్షేమ పథకాలన్నింటికీ సర్వేనే ఆధారమని చెప్పడంతో వలస వెళ్లిన లక్షలాది మంది పేదలు సొంతూళ్లకు రావాల్సి వచ్చింది. రవాణా వ్యవస్థను నిలిపేసిన ప్రభుత్వం వైన్‌షాపులను ఎందుకు తెరిచి ఉంచింది. రూ. 20 కోట్ల ఖర్చుతో 12 గంటల్లో సర్వే చేస్తే.. వంద శాతం ఫలితాలు వస్తాయా..?’’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సర్వేలో రెండు సార్లు నమోదు చేసుకుంటే చర్యలు తీసుకుంటామన్నారని, మరి నవీపేట మండలం పోతంగల్‌లో, హైదరాబాద్‌లోనూ నిజామాబాద్ ఎంపీ వివరాలు నమోదైతే చర్యలు తీసుకోలేదేమని ప్రశ్నించారు. పెన్షన్ల పంపిణీకి అర్జీలు తీసుకుంటున్న ప్రభుత్వం.. వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకున్నారా? అంటూ ఆడపడుచులను అవమానపరిచేలా ఆదేశాలు జారీ చేసిందని... మహిళలను అవమానించినందుకు ప్రభుత్వాన్ని రోడ్డుపై నిలబెట్టి రాళ్లతో కొట్టాలని అన్నారు.
మీసేవ ద్వారా అవకాశమివ్వాలి: మజ్లిస్
హైదరాబాద్‌లో 25 శాతం మంది సర్వే పరిధిలోకి రాలేదని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. వారిని మళ్లీ ఎప్పుడు సర్వే చేస్తారని ప్రశ్నించారు. ‘‘ప్రజలు తమ సమాచార నమోదు చేసుకునేందుకు మీ సేవ కేంద్రాలు లేదా వెబ్‌సైట్ ద్వారా అవకాశం కల్పించాలి. సర్వే ఆధారంగా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన వారికి సంక్షేమ పథకాలు నిరాకరిస్తే ఒప్పుకోబోం. సర్వే వివరాలను ప్రభుత్వం సభ ముందు పెట్టాలి..’’ అని అక్బరుద్దీన్ కోరారు. విద్యుత్‌పై తీర్మానం కాపీని ఉర్దూలో అందించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ ఉర్దూలో ప్రతులను అందజేస్తామన్నారు. కాగా.. సర్వేలో దొర్లిన తప్పులను ఎలా సరి చేస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ప్రశ్నించారు.
ఇదే ప్రామాణికం కాదు: ఈటెల
విపక్ష సభ్యులు ప్రశ్నలకు మంత్రి ఈటెల రాజేందర్ సమాధానమిస్తూ.. సర్వేకు ప్రభుత్వం రూ. 20 కోట్లు ఖర్చు చేసిందని, 1.27 కోట్ల కుటుంబాల వివరాలు సేకరించామని చెప్పారు. సర్వేలో మిగిలిపోయిన కుటుంబాల వివరాలను తిరిగి నమోదు చేస్తామన్నారు. ‘‘తెలంగాణలో ఆర్థిక,సామాజిక,విద్య,వైద్య ఉపాధి, స్థితిగతులు తెలుసుకునేందుకే సర్వే చేశాం. ఒక్క రోజులో చేపట్టిన ఈ సర్వేతో ప్రపంచమంతా నివ్వెరపోయింది. ఇది ఎలా సాధ్యమైందని ప్రధాని మోదీ కూడా కేసీఆర్‌ను మెచ్చుకున్నారు. చాలా మందికి సొంత గ్రామాలతో పాటు నగరాల్లో ఓటరు కార్డులు, రేషన్ కార్డులు ఉన్నాయి. వీటన్నింటిని సరిచేయాలనే సర్వే చేశాం. అవసరమైతే క్రాస్ చెక్ చేసుకుంటాం. కానీ అది ప్రామాణికం కాదు..’’ అని ఈటెల పేర్కొన్నారు. కాగా.. సర్వే ప్రకారం ఏయే వర్గాల జనాభా ఎంతో చెప్పాలని బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ పట్టుబట్టడంతో ఈటెల వివరాలు వెల్లడించారు. సర్వే ప్రకారం తెలంగాణలో ఎస్సీ జనాభా 17.5%, ఎస్టీ జనాభా 9.91%, బీసీలు 51.09%, ఓసీలు 21.5% ఉన్నట్లు చెప్పారు. అన్నివర్గాల్లో కలపి మైనారిటీలు 14.46 శాతంగా ఉన్నారని తెలిపారు.