సర్వే సక్సెస్ | Comprehensive household survey - 2014 success | Sakshi
Sakshi News home page

సర్వే సక్సెస్

Published Wed, Aug 20 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

Comprehensive household survey - 2014 success

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే చిన్నచిన్న ఒడిదుడుకులు మినహా సజావుగా సాగింది. సర్వేకు విశేష స్పందన లభించింది. ప్రజలు కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు ఉత్సాహం చూపారు. కుటుంబ యజమానితోపాటు, కుటుంబ సభ్యులు అంతా ఇంటి వద్దే ఉండి ఎన్యూమరేటర్‌కు ధ్రువీకరణ పత్రాలు చూపిస్తూ వివరాలు తెలిపారు.

 పట్టణవాసులు వివరాలు నమోదు చేసుకోవడానికి తమ స్వగ్రామాలకు వెళ్లగా పట్టణాలు బోసిపోయాయి. పల్లెలు ప్రజలతో కళకళలాడాయి. జిల్లాలోని విద్యా సంస్థలు, బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరుచుకోలేదు. సాయంత్రం వరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జనాలు లేక రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి తదితర పట్టణాల్లో నిత్యం రద్దీగా ఉండే వ్యాపార కూడళ్లు బోసిపోయాయి.

 రాత్రి వరకూ కొనసాగిన సర్వే
 ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సర్వే రాత్రి 11 గంటలు దాటే వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు
 83.33 శాతం కుటుంబాల్లో సర్వే పూర్తి చేసినట్లు జిల్లా యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. రాత్రి 8 గంటల వరకు 92 శాతం సర్వే పూర్తికాగా, సర్వే ముగిసే సమయానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 99 శాతం కుటుంబాలను సర్వే చేసినట్లు అధికారులు తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా 866 గ్రామపంచాయతీలు, ఏడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 7.89 లక్షల కుటుంబాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు ఈ మేరకు సర్వే ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న తన స్వగ్రామం జైనథ్ మండలం దీపాయిగూడలో తన కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయించుకున్నారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఉట్నూర్ , మంచిర్యాల డివిజన్లలో పర్యటించి సర్వే తీరును పర్యవేక్షించారు.

 సర్వేలో ముందున్న గిరిజనం
 మైదాన ప్రాంతం కంటే ఏజెన్సీ ఏరియాల్లోనే అత్యధికంగా ఎన్యూమరేషన్ నమోదు కావడం గమనార్హం. గోండు, కొలాం, మన్నేవార్ తదితర గిరిజన తెగల గిరిజనులు ఉత్సాహంగా తమ కుటుంబాల వివరాలను నమోదు చేసుకున్నారు. మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్‌లో సాయంత్రం ఆరు గంటల వరకే 90 శాతం కుటుంబాల సర్వే పూర్తయిందని కలెక్టర్ ఎం.జగన్మోహన్ తెలిపారు.

 బోసిపోయిన బొగ్గుబావులు
 సింగరేణి కార్మికులతో సందడిగా ఉండే బొగ్గు బావులు బోసిపోయాయి. కేవలం కార్మికుల సమ్మె చేస్తున్నప్పుడు మాత్రమే నిలిచిపోయే బొగ్గు ఉత్పత్తి, ఇప్పుడు ప్రభుత్వమే సెలవు ప్రకటించడంతో గనులు ఒకరోజు మూతపడ్డాయి. ఆదిలాబాద్ జిల్లాలోని 15 భూగర్భ గనులు, నాలుగు ఓపెన్‌కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచింది. సింగరేణి వ్యాప్తంగా 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిందని, ఈ ఉత్పత్తి విలువ సుమారు రూ.4.50 కోట్లు ఉంటుందని సింగరేణి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించడంతో సుమారు రూ.3 కోట్ల భారం పడుతుందని అధికారులు తెలిపారు.

 బాసరలో ఘననీయంగా తగ్గిన భక్తుల రద్దీ
 నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం భక్తులు లేక నిర్మానుష్యంగా మారింది. వేకువజామున అమ్మవారికి అభిషేకం నిర్వహించిన పూజారులు సర్వేలో తమ పేర్లు నమోదు చేయించుకునేందుకు తమ నివాసాలకు వెళ్లిపోయారు.

 పలుచోట్ల ఆటంకాలు..ఆలస్యంగా ప్రారంభం...
 సర్వే ముందస్తు ఏర్పాట్లలో జరిగిన పొరపాట్ల కారణంగా జిల్లాలో పలుచోట్ల సర్వేకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. పలు గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో సర్వే ఆలస్యంగా ప్రారంభమైంది. ఎన్యూమరేటర్లకు ఇంటి నంబర్లు దొరకక ఇబ్బంది పడ్డారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు నివాసం ఉన్నట్లు సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లకు చెప్పడంతో ఒక్కో ఎన్యూమరేటర్ అదనంగా 5 నుంచి 15 కుటుంబాలను సర్వే నిర్వహించాల్సి వచ్చింది.
 
 ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బేల మండలంలో పలువురు తమ పేర్లు ప్రాథమిక సర్వే లిస్టులో లేవని, దీంతో తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవడం లేదని తహశీల్దార్, ఎంపీడీవోల దృష్టికి తీసుకురావడంతో వారు సంబంధిత ఎన్యూమరేటర్లతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. సర్వే చేసిన కొందరు ఎన్యూమరేటర్‌కు అంశాలపై పూర్తి అవగాహన లేకపోవడంతో కొన్ని చోట్ల తూతూ మంత్రంగా వివరాలు నమోదు చేశారని పలు గ్రామాల వాసులు ఆరోపించారు.

బోథ్  నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్యూమరేటర్లు సర్వే ఆలస్యంగా ప్రారంభించారు. బోథ్ మండల కేంద్రంలోని ఏడో వార్డులో కొన్ని ఇళ్లకు అధికారులు నంబర్లు వేయకపోవడంతో సర్వే సాయంత్రం వరకు నిర్వహించలేదు. అధికారులు కల్పించుకుని సమస్యను పరిష్కరించారు. తాంసి మండలం కప్పర్లలో ఒకే బ్లాక్‌ను ఇద్దరు ఎన్యూమరేటర్లకు కేటాయించారు. దీంతో గందరగోళానికి దారి తీసింది.

బెల్లంపల్లిలోని కాల్‌టెక్స్, హన్మాన్‌బస్తీ 26వ వార్డులోనూ పలువురి ఇళ్లకు సీ నంబర్లు వేయకపోవడం వల్ల పలువురు ఆందోళన నిర్వహించారు. ఎన్యూమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. అధికారులు కల్పించుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. తాళ్లగురిజాల గ్రామంలో పలువురు ఎస్టీల ఇళ్లకు సీ నంబర్లు వేయలేదు. మరికొన్ని ఇళ్లకు బై నంబర్లు కూడా వేయకపోవడంతో ఎస్టీల పేర్లు, వివరాలు ఎన్యూమరేటర్లు నమోదు చేసుకోలేదు. తాండూర్ మండలం మాదారం టౌన్‌షిప్‌లో ఒకే బ్లాక్‌ను ముగ్గురు ఎన్యూమరేటర్లకు విధులు అప్పగించడంలో రెండు గంటలు ఆలస్యంగా సర్వే ప్రారంభమైంది.

నిర్మల్ పట్టణంలో 97 మంది ఎన్యూమరేటర్లు సర్వే విధులకు గైర్హాజరు అయ్యారు. దీంతో అధికారులు స్పందించి ట్రిపుల్ ఐటీ విద్యార్థులను శిక్షణ ఇప్పించి సర్వేకు పంపించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో సర్వే ఆలస్యంగా ప్రారంభమైంది.

ఆసిఫాబాద్‌లోని రావులవాడ, పెషాజీనగర్, రాజంపేట్, వాంకిడి మండలం కమ్మాల తదితర చోట్ల ఇంటి నంబర్లు దొరక్క సర్వేకు ఆటంకం ఏర్పడింది. దీంతో ఎన్యూమరేటర్లు ఇబ్బందులు పడగా, స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
     
ఖానాపూర్‌లో కొన్ని గృహాలకు ముందస్తు నంబర్లు వేయకపోవడంతో ఇంటి యజమానులు ఆందోళనకు దిగారు. అధికారులకు విషయం తెలుసుకుని ఈ గృహాల్లో సర్వే చేశారు. సర్వేను కరెంటు కోతలు వదలడం లేదు. ఎన్యూమరేటర్లు ఒక్కో గ్రామంలో రాత్రి 9 గంటల వరకు విధులు నిర్వహించారు. పూర్తి చేసిన ఫారాలను ఖానాపూర్ పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు. కరెంటు లేకపోవడంతో ఫారాలను సెల్, టార్చిలైట్ వెలుతురులో అధికారులకు అందజేశారు. కొందరు బుధవారం ఉదయం ఇస్తామని వెళ్లిపోయారు.
     
భైంసా పట్టణంలోని సంతోష్‌నగర్, సిద్దార్థనగర్‌లలో ఆలస్యంగా సర్వే ప్రారంభమైంది. ముథోల్ మండలంలో సర్వే కోసం గ్రామాలకు ఎన్యూమరేటర్లు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో ముగ్గురు ఎన్యూమరేటర్లకు గాయాలయ్యాయి.
     
కాగజ్‌నగర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం తలెత్తి పట్టణంతోపాటు, పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సర్వేకు ఆటంకం కలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement