Enter the details of the families
-
కుటుంబాలే గల్లంతు..
ఆన్లైన్లో కనిపించని పేర్లు * పట్టణంలో నమోదు కానివి.. * 263 కుటుంబాలు * పట్టణం పేర్లు పల్లెల్లోకి.. హుస్నాబాద్ : సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు గల్లంతయ్యూయి. హుస్నాబాద్ పట్టణంలోని రెండువందల కుటుంబాలకు సంబంధించిన సమాచారం ఆన్లైన్లో కనిపించకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించగా.. పట్టణంలో 6,943 కుటుంబాలు ఉన్నట్లు తేలింది. ఈ వివరాలను అధికారులు తిమ్మాపూర్ మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఆన్లైన్లో న మోదు చేయించారు. అయితే సర్వేలో వివరాలను సమర్పించిన 263 కుటుంబాల సమాచారం ఆన్లైన్లో కనిపించడంలేదు. పట్టణంలోని పలువార్డులకు సంబంధించిన ఈ సమాచారం లేకపోవడంతో పింఛన్లు, ఆహారభద్రత కార్డులకోసం దరఖాస్తులు చేసుకున్న వారు వీటిని పొందలేని పరిస్థితి నెలకొంది. ఎవరిది తప్పు.. సమగ్రసర్వేలో అధికారులు సైతం నిర్లక్ష్యంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది. అన్నింటికి సమగ్రసర్వే ఆధారమని ప్రభుత్వం ఓవైపు ప్రకటించినప్పటికీ స్థానిక అధికార యంత్రాంగం ఈ విషయంపై శ్రద ్ధ కనబర్చకపోవడంతో సమాచారం గల్లంతైనట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని 263 కుటుంబాల సమాచారాన్ని హుస్నాబాద్ మండలంలోని ఆయా గ్రామాల్లోని కుటుంబాలుగా నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పట్టణమని సర్వేపత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ గ్రామాల్లో ఎందుకు నమోదుచేశారనే దానిపై స్పష్టత కరువైంది. రూరల్‌లో 49 కుటుంబాల సమాచారం ఉన్నప్పటికీ మిగతా సమాచారం ఎక్కడికి వెళ్లందన్నది ఇప్పటికీ అంతుచిక్కడంలేదు. దీనిపై అర్హుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తిరిగి నమోదుకోసం ప్రయత్నాలు.. సమగ్రసర్వేలో గల్లంతైన కుటుంబాలను తిరిగి నమోదుచేసే ప్రక్రియను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు డీఆర్డీఏ శాఖకు ఈ బాధ్యతలు అప్పగించనట్లు సమాచారం. ప్రత్యేక సాఫ్ట్వేర్ వస్తేనే నమోదుచేసేందుకు వీలుకల్గుతుంది. త్వరలోనే దీన్ని అందించి కుటుంబాల వివరాలను నమోదుచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
భోజనం ఎలా.. ఇళ్లకు వెళ్లేదెలా?
కీసర:వారంతా విద్యార్థులు.. సమగ్ర సర్వేలో స్వచ్ఛందగా పాల్గొన్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వే చేశారు. వారికి మధ్యాహ్నం భోజన వసతి కల్పించిన అధికారులు సర్వే ముగిశాక వారిని విస్మరించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు.. రాత్రివేళ తాము ఇంటికి ఎలా చేరుకోవాలి.. భోజనం ఎక్కడ చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై మండిపడుతూ.. మండలంలోని అహ్మద్‌గూడ గ్రామంలో ఆందోళనకు దిగారు. సమగ్ర సర్వే కోసం తామంతా స్వచ్ఛందంగా తరలి వచ్చామని.. తమ కోసం ఆలోచించేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయ బృందాన్ని ప్రభుత్వ అధికారులను వినియోగించుకునే ప్రభుత్వం వారికి సకల ఏర్పాట్లు చేస్తుందని వారికంటే తక్కువ తామేం చేశామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వెంటనే రవాణా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. సర్వేలో విద్యార్థినులు చాలా మంది ఉన్నారని ... వారి పరిస్థితి ఏంటని అన్నారు. తమ నిరసనపై స్థానిక అధికారులు స్పందించకపోవడం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఎన్యూమరేటర్లను సురక్షితంగా వారి ఇళ్లకు చేరుస్తామన్నారు. -
సర్వే సక్సెస్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే జిల్లాలో విజయవంతమైంది. మంగళవారం ఉదయం 8గంటలకే సర్వే ప్రారంభించాల్సి ఉండడంతో అధికారగణం అంతా తెల్లవారుజాము నుంచే విధుల్లో తలమునకలైంది. ఉదయం 6 గంటల కల్లా మండల కేంద్రాలకు హాజరైన సిబ్బంది..అల్పాహారం ముగించుకుని సర్వేకు ఉపక్రమించారు. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రారంభమైన సర్వే ప్రక్రియ.. రాత్రి 9 గంటల తర్వాత కూడా కొనసాగింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో 7.89 లక్షల కుటుంబాలున్నట్లు భావించినయంత్రాంగం..రాత్రి వరకు 7.17 లక్షల కుటుంబాలను కవర్ చేస్తూ.. వారి వివరాలు సేకరించినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. మొత్తంగా 27,675 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్న ఈ సర్వేలో దాదాపు 90 శాతం జనాభా నుంచి వివరాలు సేకరించారు. జిల్లాలో అధికంగా మర్పల్లి మండలంలో 97.41 శాతం కుటుంబాల వివరాలు సేకరించారు. ఆతర్వాత యాలాల మండలంలో 89.14 శాతం, ఇబ్రహీంపట్నంలో 88.9 శాతం, తాండూరు గ్రామీణంలో 88.89 శాతం వివరాలు సేకరించి అగ్రభాగంలో నిలిచాయి. అదేవిధంగా రాజేంద్రనగర్ గ్రామంలో అతి తక్కువగా 65.25 శాతం వివరాలు నమోదు కాగా, హయత్‌నగర్ గ్రామీణంలో 66.91 శాతం సర్వే పూర్తయింది. అక్కడక్కడా అయోమయం.. గందరగోళం కొన్నిచోట్ల సర్వే ప్రక్రియ గందరగోళంగా మారింది. ఒకే గృహంలో నాలుగైదు కుటుంబాలున్నప్పటికీ.. కేవలం ఒకరి వివరాలు మాత్రమే సేకరిస్తున్నారంటూ ఇబ్రహీంపట్నం, తాండూరు, హయత్‌నగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చేశారు. తాండూరులో ఏకంగా అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే గృహాల నమోదులో భాగంగా వేసిన నంబర్ల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలపడంతో కొంత అయోమయం నెలకొంది. సర్వేలో ప్రధానాంశాలివీ... సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా జిల్లాకు చెందిన ప్రముఖుల ఇళ్ళను ఎన్యూమరేటర్లు సందర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ జె.ఎం లింగ్డో, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేల కుటుంబాల వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించారు. తాండూరులోని రాజీవ్ గృహకల్ప కాలనీలో కిరాయిదారులను రాత్రికి రాత్రి ఖాళీ చేయించిన ఓనర్లు మంగళవారం హడావుడిగా ఇళ్లకు చేరి సర్వేలో పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో నిన్నటివరకు ఇక్కడే నివాసమున్న కిరాయిదారుల వివరాలు రికార్డు చేయలేదు. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. తాండూరు మున్సిపాలిటీ పరిధిలో పలువురు ఎన్యూమరేటర్లు విధులకు గైర్హాజరు కావడంతో స్థానికులు రూట్ఆఫీసర్ను నిలదీశారు. ఈక్రమంలో వాగ్వాదం కాస్త గొడవకు దారితీసింది. దీంతో సదరు అధికారిణి తాను సర్వే చేయలేనంటూ మున్సిపల్ కమిషనర్‌కు రిపోర్టు చేశారు. పరిగిలో స్థానికంగా నివాసం ఉండని పలువురు.. మంగళవారం ఉదయం కల్లా వారి సొంతింటి ముందు హాజరై ఎన్యూమరేటర్లకు వివరాలిచ్చారు. సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు వచ్చిన కుల్కచర్ల మండలం ఆలుగడ్డతాండా వాసి పాముకాటుకు గురై మృత్యువాత పడ్డాడు. అదేవిధంగా మోమిన్‌పేట మండలంలో బూర్గుపల్లితాండా వాసి రోడ్డుప్రమాదానికి గురై మృతిచెందాడు. హయత్‌నగర్ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో పలువురు లబ్ధిదారులు వారి ఇళ్లను కిరాయికిచ్చారు. తాజాగా సర్వే నేపథ్యంలో వారిని హడావుడిగా ఖాళీ చేయించిన ఓనర్లు.. వారి వివరాలు మాత్రమే నమోదు చేసుకున్నారు. ఫలితంగా కిరాయిదారుల వివరాలు రికార్డులోకి రాలేదు. -
సమగ్ర సర్వేలోసకల జనులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉదయం పది గంటల వరకు సర్వే 22 శా తంగా నమోదైంది. అప్పటి వరకు మందకొడి గా సాగిన సర్వే ఆ తర్వాత వేగం పుంజుకుంది. రాత్రి ఎనిమిది గంటల వరకు 5,63,275 కుటుంబాలు (81శాతం) తమ వివరాలను నమోదు చేయించుకున్నాయి. కలెక్టర్ రొనాల్డ్‌రాస్ అదనంగా మరో 600 మంది ఎన్యూమరేటర్లను ప్రత్యేకంగా రంగంలోకి దింపడంతో సమగ్ర కుటుంబ సర్వే లక్ష్యానికి చేరుకుంది. అయితే, జిల్లావ్యాప్తంగా పలుచోట్ల తమ పేర్లు లేవని, తమ ఇంటికి స్టిక్కర్లు వేయలేదని, స్టిక్కర్లు వేసినా ఎన్యూమరేటర్లు వివరా లు నమోదు చేయలేదని ప్రజలు ఆందోళనకు దిగారు. ఎలుపుగొండ ఎంపీడీఓ రవీశ్వర్‌గౌడ్, కామారెడ్డి మున్సిపల్ క మిషనర్ బాలోజీ నాయక్ తదితరులను నిర్బంధించారు. ఎడపల్లిలో నిర్బంధించిన ఎన్యూమరేటర్లను ఉన్నతాధికారులు విడిపించారు. చెదురు మదురు సంఘటనలు మినహా సర్వే ప్రశాంతంగా ముగిసింది. సర్వే సందర్భంగా జిల్లా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూరు, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్ తదితర పట్టణాలలో వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలను మూసి ఉంచారు. వాహనాలు తిరగలేదు. ప్రధాన వీధులు నిర్మానుష్యంగా మారాయి. ఇళ్ల వద్దనే ఉండి వ్యవసాయ శాఖ మంత్రి పరిగి శ్రీనివాస్‌రెడ్డి ఆయన స్వగ్రామం బాన్సువాడ నియోజకవర్గం పోచారంలో పేరు నమోదు చేయించుకున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మద్నూరు మండలం సిర్పూరులో వివరాలు నమోదు చేసుకున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ పాంగ్రా పరిధిలోని బ్యాంకు కాలనీలో వివరాలు నమోదు చేసుకున్నారు. బోధన్ ఎమ్మెల్యే అహ్మద్ షకీల్, ఆయన కుటుంబసభ్యులు 35 వార్డులో నమోదు చేసుకున్నారు. నవీపేట మండలం సిరాన్‌పల్లికి చెందిన మాజీ మంత్రి పి. సుదర్శన్ రెడ్డి ఇంటికి తాళం ఉంది. ఆయన హైదరాబాద్‌లో సర్వేలో పాల్గొన్నారని సమాచారం. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ భిక్కనూర్ మండలం బస్వాపూర్‌లో, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే డోన్‌గాంలో, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు మహమ్మద్నగ ర్లో వివరాలు నమోదు చేసుకున్నారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. సర్వే జాబితాలో పేర్లు లేవని నిరసనలు జిల్లా అంతటా సర్వే సందడి...పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. దూరం ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లినవారు స్వగ్రామాలకు చేరుకుని సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల తమ ఇళ్లకు స్టిక్కర్లు అంటించలేదని, సర్వే జాబితాలో తమ పేర్లు లేవని నిరసన వ్యక్తం చేశారు. రెంజల్ మండలం నీలా, ఈరన్నగుట్ట తదితర గ్రామాలలో ప్రజలు గ్రామ పంచాయతీలను ముట్టడించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నమోదు చేస్తామని హామీ ఇవ్వడం తో ఆందోళన విరమించారు. మాచారెడ్డి మండలం ఎలుపుగొండలో ఎంపీడీఓ రవీశ్వర్గౌడ్తోపాటు ఐ దుగురు సాక్షరభారత్ కార్యకర్తలపై దాడికి యత్నించడంతో వారు గ్రామ పంచాయతీలోకి వెళ్లి త లుపులు వేసుకున్నారు. నిజాంసాగర్ మండలం మహమ్మద్‌నగర్‌లో, పరారీ లో ఉన్న అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ ధనుల వెంకట్రాములు సర్వే కోసం వచ్చి పోలీసులకు చిక్కాడు. కుటుంబాల సంఖ్య కొత్తగా చేరిన వారితో 7.10 లక్షలకు పెరిగిందని, కొద్దిగా ఆలస్యం జరిగినా నూటికి నూరు శాతం సర్వే పూర్తి చేశామని కలెక్టర్ రొనాల్డ్‌రాస్ మంగళవారం రాత్రి పేర్కొన్నారు. కాగా, సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లకు బుధవారం సెలవు ప్రకటించారు. -
నంబర్లు లేవు.. నమోదు చేయలేదు..
బెల్లంపల్లి : అధికారుల నిర్లక్ష్యం వల్ల బెల్లంపల్లిలో కొన్ని కుటుంబాలు మంగళవారం కుటుంబ, ఆర్థిక, సామాజిక సమగ్ర సర్వేకు నోచుకోలేదు. ఎన్యూమరేటర్లు సదరు ఇళ్లలో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకోలేదు. అధికారుల తప్పిదానికి తాము బలయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 34వ వార్డు కాల్టెక్స్ ఏరియాలో 30 ఏళ్ల పైబడి నుంచి కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దాసరి ఓదమ్మ, దాసరి జ్యోతి, గరిగ నాగరాజు, గరిగ నాగమణి, గరిగ వెంటేశ్వర్రావు, గరిగ వెంకటేశ్వరమ్మ, గరిగ శివ, గరిగ శోభ, కుడుపూడి నాగరాజు, కుడుపూడి రమాదేవి, ఉమామహేశ్వరి, అనుషాదేవి వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నారు. వీరిలో కొందరికి సొంత గృహాలు ఉండగా.. మరికొందరు అద్దె ఇళ్లలో జీవిస్తున్నారు. కూలీ పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరందరికి రేషన్, ఆధార్‌కార్డులు ఉన్నా సదరు వ్యక్తులు నివసిస్తున్న ఇళ్లకు నంబర్లు వేయలేదు. దీంతో సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లు వివరాల నమోదుకు నిరాకరించారు. తమ కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకోవాలని సభ్యులు కోరినా ఎన్యూమరేటర్లు అంగీకరించలేదు. తమకు కేటాయించిన పేర్లు, ఇళ్ల నంబర్ల ఆధారంగానే సర్వే చేస్తామని తేల్చి చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. 25వ వార్డులో.. 25వ వార్డులోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఒక ఇంట్లో రెండు కుటుంబాలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఆ ఇంటికి ఒక సంఖ్య మాత్రమే వేయడం వల్ల మరో కుటుంబం వివరాలు సేకరించడానికి ఎన్యూమరేటర్లు నిరాకరించారు. దీంతో వాగ్వాదం జరిగింది. వార్డు పరిధిలోని హన్మాన్‌బస్తీకి చెందిన పలువురు తాము నివసిస్తున్న ఇళ్లను పరిశీలించి బై నంబర్లు వేసి వివరాలు నమోదు చేసుకోవాలని ఎన్యూమరేటర్లను నిలదీశారు. దీంతో కొద్దిసేపు సర్వేకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న సూపర్వైజర్ లలిత అక్కడికి చేరుకోవడంతో ఆమెతో బస్తీ ప్రజలు వాగ్వివాదానికి దిగారు. సూపర్వైజర్ తన వద్ద ఉన్న కుటుంబ సర్వే కాపీలను ఎన్యూమరేటర్లకు ఇచ్చి సర్వే చేయాలని సూచించడంతో వివాదం సద్దుమణిగింది. తాళ్లగురిజాలలో.. బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల గ్రామంలో కొందరు ఎస్టీల ఇళ్లకు సర్వేనంబర్లు వేయకపోవడంతో సదరు కుటుంబాల వివరాల నమోదు ప్రక్రియ జరగలేదు. గ్రామంలోని నాయిని పెద్దులు, గొలిశెట్టి మల్లు, గొలి శెట్టి ఎల్లరాజు, నాయిని బక్కు, గొలిశెట్టి వెంకటేశ్, పల్లె లింగమ్మ, మంతెన నర్సయ్య, పల్లెకుర్తి లింగమ్మ తదితరులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఎన్యూమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. అయినా ఎన్యూమరేటర్లు పేర్లు నమోదు చేసుకోలేదు. చివరికి మండల విద్యాధికారి డి.శ్రీధర్‌స్వామి అక్కడికి వచ్చి అదనపు సర్వే కాపీలను తెప్పించి వివరాలు నమోదు చేయిస్తామని నచ్చజెప్పడంతో గిరిజనులు శాంతించారు. సర్వేలో వివరాలు నమోదు చేసుకోని కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. -
సర్వే సక్సెస్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే చిన్నచిన్న ఒడిదుడుకులు మినహా సజావుగా సాగింది. సర్వేకు విశేష స్పందన లభించింది. ప్రజలు కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు ఉత్సాహం చూపారు. కుటుంబ యజమానితోపాటు, కుటుంబ సభ్యులు అంతా ఇంటి వద్దే ఉండి ఎన్యూమరేటర్‌కు ధ్రువీకరణ పత్రాలు చూపిస్తూ వివరాలు తెలిపారు. పట్టణవాసులు వివరాలు నమోదు చేసుకోవడానికి తమ స్వగ్రామాలకు వెళ్లగా పట్టణాలు బోసిపోయాయి. పల్లెలు ప్రజలతో కళకళలాడాయి. జిల్లాలోని విద్యా సంస్థలు, బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరుచుకోలేదు. సాయంత్రం వరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జనాలు లేక రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి తదితర పట్టణాల్లో నిత్యం రద్దీగా ఉండే వ్యాపార కూడళ్లు బోసిపోయాయి. రాత్రి వరకూ కొనసాగిన సర్వే ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సర్వే రాత్రి 11 గంటలు దాటే వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు 83.33 శాతం కుటుంబాల్లో సర్వే పూర్తి చేసినట్లు జిల్లా యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. రాత్రి 8 గంటల వరకు 92 శాతం సర్వే పూర్తికాగా, సర్వే ముగిసే సమయానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 99 శాతం కుటుంబాలను సర్వే చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 866 గ్రామపంచాయతీలు, ఏడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 7.89 లక్షల కుటుంబాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు ఈ మేరకు సర్వే ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న తన స్వగ్రామం జైనథ్ మండలం దీపాయిగూడలో తన కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయించుకున్నారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఉట్నూర్ , మంచిర్యాల డివిజన్లలో పర్యటించి సర్వే తీరును పర్యవేక్షించారు. సర్వేలో ముందున్న గిరిజనం మైదాన ప్రాంతం కంటే ఏజెన్సీ ఏరియాల్లోనే అత్యధికంగా ఎన్యూమరేషన్ నమోదు కావడం గమనార్హం. గోండు, కొలాం, మన్నేవార్ తదితర గిరిజన తెగల గిరిజనులు ఉత్సాహంగా తమ కుటుంబాల వివరాలను నమోదు చేసుకున్నారు. మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్లో సాయంత్రం ఆరు గంటల వరకే 90 శాతం కుటుంబాల సర్వే పూర్తయిందని కలెక్టర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. బోసిపోయిన బొగ్గుబావులు సింగరేణి కార్మికులతో సందడిగా ఉండే బొగ్గు బావులు బోసిపోయాయి. కేవలం కార్మికుల సమ్మె చేస్తున్నప్పుడు మాత్రమే నిలిచిపోయే బొగ్గు ఉత్పత్తి, ఇప్పుడు ప్రభుత్వమే సెలవు ప్రకటించడంతో గనులు ఒకరోజు మూతపడ్డాయి. ఆదిలాబాద్ జిల్లాలోని 15 భూగర్భ గనులు, నాలుగు ఓపెన్‌కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచింది. సింగరేణి వ్యాప్తంగా 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిందని, ఈ ఉత్పత్తి విలువ సుమారు రూ.4.50 కోట్లు ఉంటుందని సింగరేణి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించడంతో సుమారు రూ.3 కోట్ల భారం పడుతుందని అధికారులు తెలిపారు. బాసరలో ఘననీయంగా తగ్గిన భక్తుల రద్దీ నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం భక్తులు లేక నిర్మానుష్యంగా మారింది. వేకువజామున అమ్మవారికి అభిషేకం నిర్వహించిన పూజారులు సర్వేలో తమ పేర్లు నమోదు చేయించుకునేందుకు తమ నివాసాలకు వెళ్లిపోయారు. పలుచోట్ల ఆటంకాలు..ఆలస్యంగా ప్రారంభం... సర్వే ముందస్తు ఏర్పాట్లలో జరిగిన పొరపాట్ల కారణంగా జిల్లాలో పలుచోట్ల సర్వేకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. పలు గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో సర్వే ఆలస్యంగా ప్రారంభమైంది. ఎన్యూమరేటర్లకు ఇంటి నంబర్లు దొరకక ఇబ్బంది పడ్డారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు నివాసం ఉన్నట్లు సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లకు చెప్పడంతో ఒక్కో ఎన్యూమరేటర్ అదనంగా 5 నుంచి 15 కుటుంబాలను సర్వే నిర్వహించాల్సి వచ్చింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బేల మండలంలో పలువురు తమ పేర్లు ప్రాథమిక సర్వే లిస్టులో లేవని, దీంతో తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవడం లేదని తహశీల్దార్, ఎంపీడీవోల దృష్టికి తీసుకురావడంతో వారు సంబంధిత ఎన్యూమరేటర్లతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. సర్వే చేసిన కొందరు ఎన్యూమరేటర్‌కు అంశాలపై పూర్తి అవగాహన లేకపోవడంతో కొన్ని చోట్ల తూతూ మంత్రంగా వివరాలు నమోదు చేశారని పలు గ్రామాల వాసులు ఆరోపించారు. బోథ్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్యూమరేటర్లు సర్వే ఆలస్యంగా ప్రారంభించారు. బోథ్ మండల కేంద్రంలోని ఏడో వార్డులో కొన్ని ఇళ్లకు అధికారులు నంబర్లు వేయకపోవడంతో సర్వే సాయంత్రం వరకు నిర్వహించలేదు. అధికారులు కల్పించుకుని సమస్యను పరిష్కరించారు. తాంసి మండలం కప్పర్లలో ఒకే బ్లాక్‌ను ఇద్దరు ఎన్యూమరేటర్లకు కేటాయించారు. దీంతో గందరగోళానికి దారి తీసింది. బెల్లంపల్లిలోని కాల్టెక్స్, హన్మాన్బస్తీ 26వ వార్డులోనూ పలువురి ఇళ్లకు సీ నంబర్లు వేయకపోవడం వల్ల పలువురు ఆందోళన నిర్వహించారు. ఎన్యూమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. అధికారులు కల్పించుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. తాళ్లగురిజాల గ్రామంలో పలువురు ఎస్టీల ఇళ్లకు సీ నంబర్లు వేయలేదు. మరికొన్ని ఇళ్లకు బై నంబర్లు కూడా వేయకపోవడంతో ఎస్టీల పేర్లు, వివరాలు ఎన్యూమరేటర్లు నమోదు చేసుకోలేదు. తాండూర్ మండలం మాదారం టౌన్షిప్లో ఒకే బ్లాక్‌ను ముగ్గురు ఎన్యూమరేటర్లకు విధులు అప్పగించడంలో రెండు గంటలు ఆలస్యంగా సర్వే ప్రారంభమైంది. నిర్మల్ పట్టణంలో 97 మంది ఎన్యూమరేటర్లు సర్వే విధులకు గైర్హాజరు అయ్యారు. దీంతో అధికారులు స్పందించి ట్రిపుల్ ఐటీ విద్యార్థులను శిక్షణ ఇప్పించి సర్వేకు పంపించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో సర్వే ఆలస్యంగా ప్రారంభమైంది. ఆసిఫాబాద్‌లోని రావులవాడ, పెషాజీనగర్, రాజంపేట్, వాంకిడి మండలం కమ్మాల తదితర చోట్ల ఇంటి నంబర్లు దొరక్క సర్వేకు ఆటంకం ఏర్పడింది. దీంతో ఎన్యూమరేటర్లు ఇబ్బందులు పడగా, స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఖానాపూర్‌లో కొన్ని గృహాలకు ముందస్తు నంబర్లు వేయకపోవడంతో ఇంటి యజమానులు ఆందోళనకు దిగారు. అధికారులకు విషయం తెలుసుకుని ఈ గృహాల్లో సర్వే చేశారు. సర్వేను కరెంటు కోతలు వదలడం లేదు. ఎన్యూమరేటర్లు ఒక్కో గ్రామంలో రాత్రి 9 గంటల వరకు విధులు నిర్వహించారు. పూర్తి చేసిన ఫారాలను ఖానాపూర్ పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు. కరెంటు లేకపోవడంతో ఫారాలను సెల్, టార్చిలైట్ వెలుతురులో అధికారులకు అందజేశారు. కొందరు బుధవారం ఉదయం ఇస్తామని వెళ్లిపోయారు. భైంసా పట్టణంలోని సంతోష్‌నగర్, సిద్దార్థనగర్లలో ఆలస్యంగా సర్వే ప్రారంభమైంది. ముథోల్ మండలంలో సర్వే కోసం గ్రామాలకు ఎన్యూమరేటర్లు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో ముగ్గురు ఎన్యూమరేటర్లకు గాయాలయ్యాయి. కాగజ్‌నగర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం తలెత్తి పట్టణంతోపాటు, పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సర్వేకు ఆటంకం కలిగింది. -
అ‘సమగ్ర’ సర్వే..!
భద్రాచలం : భద్రాచలం ఏజెన్సీలో సమగ్ర కుటుంబ సర్వే గందరగోళంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు డివిజన్‌స్థాయి అధికారులు శ్రద్ధ చూపినప్పటికీ ప్రాథమిక సర్వేలో జరిగిన లోపాలు ప్రజల నుంచి వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేసేందుకు ముందుగా అంగన్వాడీ కార్యకర్తలతో సర్వే చేయించారు. ఈ సర్వేను వీఆర్వోలు పర్యవేక్షించారు. గుర్తించిన ఇళ్లకు ప్రత్యేకంగా నంబర్లు కేటాయిస్తూ ప్రతీ ఇంటికి స్టిక్కర్ అంటించారు. కానీ కొంత మంది సిబ్బంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మంగళవారం నిర్వహించిన సమగ్ర సర్వేలో సమస్య తలెత్తింది. ప్రధానంగా భద్రాచలం పట్టణంలోనే వందల సంఖ్యలో ఇళ్లకు స్టిక్కర్లు అందించకపోవడమే ఇందుకు నిదర్శనం. స్టిక్కర్లు ఉంటేనే సర్వే చేస్తామని ఎన్యూమరేటర్లు చెప్పడంతో స్టిక్కర్లు లేని ఇళ్లవారు ఆందోళనకు గురయ్యారు. భవిష్యత్‌లో అన్ని ధ్రువీకరణ పత్రాలకు ఈ సర్వేనే ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడంతో వివరాలు నమోదు చేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. అంతా గందరగోళమే... స్టిక్కర్లు అంటించని ఇళ్ల వారు ఈ విషయాన్ని ఆర్డీఓ, తహశీల్దార్ల దృష్టికి తీసుకెళ్లడంతో వారు స్పందించారు. సర్వేలో ఏ ఒక్కరు కూడా వివరాలు నమోదు చేయించుకోకుండా ఉండకూడదనే ఉద్దేశంతో వారి సమాచారాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో కాలనీలో ముగ్గురు ఎన్యూమరేటర్లను ఏర్పాటు చేసి స్టిక్కర్లు లేని వారి సమాచారాన్ని కూడా సేకరించేలా ఏర్పాట్లు చేశారు. అయితే భద్రాచలం పట్టణంలో సరైన రీతిలో సర్వే లేకపోవటంతో రాత్రి 9 గంటల వరకూ కూడా ఇది కొనసాగింది. మరోపక్క కొంత మంది ఇళ్లకు స్టిక్కర్లు ఉన్నప్పటికీ ఎన్యూమరేటర్లు వారి వివరాలు నమోదు చేయలేదు. దీంతో చాలా మంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా కాలనీల్లోని వారే కొందరు స్వయంగా మిగిలిపోయిన వారి వివరాలతో జాబితా తయారు చేసి అధికారులకు అందజేశారు. ఎమ్మెల్యే రాజయ్య ఇంటినీ మరిచారు : భద్రాచలం ఎమ్మెల్యే సున్న రాజయ్య భగవాన్‌దాస్ కాలనీలో ఉంటున్నారు. కానీ ఎమ్మెల్యే ఇంటికి స్టిక్కరు అతికించలేదు. దీంతో ఆ కాలనీకి వెళ్లిన ఎన్యూమరేటర్ ఎమ్మెల్యే సమాచారం సేకరించేందుకు నిరాకరించారు. దీంతో ఆయన ఈ విషయాన్ని నేరుగా ఆర్డీఓ అంజయ్య దృష్టికి తీసుకెళ్లారు. వీఆర్‌పురం మండలం సున్నంవారిగూడెంలో అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు ఉన్నప్పటికీ కొన్నేళ్లుగా భద్రాచలంలోని సొంత ఇంట్లో తాను ఉంటూ ప్రజాప్రతినిధిగా పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నానని తెలిపారు. దీంతో ఆర్డీఓ అంజయ్య అప్పటికప్పుడు ఓ ఎన్యూమరేటర్‌ను ఏర్పాటు చేశారు. ఆ కాలనీలో సర్వేను పరిశీలించేందుకు వెళ్లిన ఎంఈఓ మాధవరావు, ఎన్యూమరేటర్‌ను ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లి ఆయన సమాచారాన్ని సేకరించారు. స్టిక్కరు అతికించకపోవటంతోనే ఇటువంటి సమస్య ఏర్పడిందని ఎమ్మెల్యే రాజయ్య అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సుందరయ్య కాలనీ వాసులు నిరశన : భద్రాచలం పట్టణంలోని సుందరయ్య కాలనీలో స్థిర నివాసులమైన తమ ఇళ్లకు స్టిక్కర్లు అంటించకపోవడమే కాకుండా సర్వే కూడా చేయలేదని కాలనీ వాసులు నిరసన తెలిపారు. ఆ కాలనీ వాసులు డిగ్రీ కళాశాలకు వచ్చి అధికారుల వద్ద నిరశన తెలిపారు. స్టిక్కర్లు అతికించపోవడంతో వివరాలు నమోదు చేయలేమని ఎన్యూమరేటర్లు చెప్పారని వార్డు సభ్యురాలు మంగ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారి వివరాలు కూడా సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
సర్వే సమాప్తం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎన్నో అపోహలు, అనుమానాలు, పుకార్లతో పాటు ఎంతో ఉత్సుకత, ఆసక్తిని రేకెత్తించిన సమగ్ర కుటుంబ సర్వే - 2014 జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఉద యం 7 గంటలకు ప్రారంభమైన సర్వే తొలుత మందకొడిగా సాగి, మధ్యాహ్నం నుంచి ఊపందుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట కల్లా 40 శా తమే పూర్తయిన సర్వే సాయంత్రం ఆరు గంటల సమయానికి 80 శాతానికి చేరింది. మొత్తం మీద 90 శాతానికి పైగానే జరిగిందని అధికారులు చెపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 8 లక్షలకు పైగా కుటుంబాల వివరాలు నమోదు చేశారు. ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు ఇతర పట్టణ ప్రాంతాల్లో సర్వే అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈ సర్వేలో సామాన్య ప్రజానీకంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ పార్టీల నాయకులు, ఇతర ప్రముఖులు తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీ, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సర్వేలో పాల్గొన్నారు. ఎన్యూమరేటర్‌కు తమ వివరాలు ఇచ్చేంతవరకు ప్రజలు బయటకు రాకపోవడం, చాలా మంది ఆదివారమే తమ స్వగ్రామాలకు వెళ్లడంతో ఖమ్మంతో పాటు పలు పట్టణాల్లో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. సినిమా హాళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించడంతో సాయంత్రం నాలుగు గంటల తర్వాత కొంత జనసమ్మర్థం కనిపించింది. సర్వే సందర్భంగా ఎన్యూమరేట ర్లకు కేటాయించిన ఇంటి నంబర్లలో గందరగోళం ఏర్పడడంతో పాటు ఇళ్లు దొరక్కపోవడంతో నా నా అవస్తలు పడాల్సి వచ్చింది. ఎన్యూమరేటర్లకు చాలా చోట్ల భోజన వసతి కూడా లేక ఇబ్బందులు పడ్డారు. ఇక, సర్వే సందర్భంగా జిల్లా ప్రజానీకమంతా ఎదుర్కొన్న సమస్య ‘స్టిక్కరింగ్.’ స్టిక్కర్ ఉన్న కుటుంబానికి సంబంధించిన సమాచారమే తీసుకుంటామని ఎన్యూమరేటర్లు చెప్పడంతో జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. తల్లాడ, బూర్గం పాడు, ఖమ్మం నగరం, రఘునాథపాలెం.. ఇలా మెజార్టీ మండలాల్లో ప్రజలు తహశీల్దార్, మున్సిపల్ అధికారుల చుట్టూ పరుగులు తీయాల్సి వచ్చింది. కొన్నిచోట్ల ప్రజలు తాము సర్వేను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత అధికారుల హామీతో సర్వే కొనసాగింది. జిల్లాలో జరిగిన సర్వే కార్యక్రమాన్ని ప్రత్యేకాధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్ పర్యవేక్షించారు. మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన కలెక్టర్‌తో కలిసి సర్వే ను సమీక్షించారు. ఇక, ప్రజల ఫిర్యాదులతో అధికారుల ఫోన్లు హోరెత్తిపోయాయి. జిల్లా కేం ద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్లకే 300 కు పైగా ఫోన్లు వచ్చాయి. తహశీల్దార్లు, ఇతర అధికారుల ఫోన్లయితే లెక్కే లేదు. చిన్న చిన్న అవాం తరాల నడుమ సర్వే సమాప్తం కావడంతో జిల్లా ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సర్వే జరిగిన తీరిది.. ఇల్లెందులో ఇళ్లకు స్టిక్కర్లు వేయలేదంటూ సర్వే సిబ్బంది, అధికారులతో పలువురు వాగ్వాదానికి దిగారు. మండలంలోని రాఘబోయినగూడెం ముల్కనూర్ గ్రామంలో మున్నూరుకాపు వారికి కుల ధ్రువీకరణ పత్రం ఉంటేనే వివరాలు నమోదు చేస్తామని సిబ్బంది చెప్పడంతో వారు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న జోనల్ అధికారి విద్యార్థుల సర్టిఫికెట్లలో ఎలా ఉంటే అలాగే నమోదు చేయాలని సూచించడంతో సర్వే కొనసాగింది. టేకులపల్లిలో ఒక ఎన్యూమరేటర్ మద్యం సేవించి హంగామా సృష్టించాడు. సంపత్‌నగర్‌లో సర్వే సిబ్బందిని దింపి టేకులపల్లికి వస్తున్న వాహనం ఒక బాలుడిని ఢీకొంది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బయ్యారం మండలం ఇసుక మిది గ్రామానికి చెందిన ఆదివాసీలు తమకు జీవో నంబర్ 3 ప్రకారం ఉద్యోగాలు కల్పించాలని, పోడు భూముల సాగు విషయంలో అటవీ అధికారుల వేధింపులపై చర్యలు తీసుకోవాలని సర్వే సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీడీఓ చంద్రశేఖర్ జేసీతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. కామేపల్లిలోని 17 గ్రామపంచాయతీల్లో ఉదయం 8 గంటలకే సర్వే ప్రారంభమైంది. స్టిక్కర్లు అంటించని కుటుంబాలను మొబైల్ టీమ్‌ల ద్వారా సర్వే చేశారు. గార్లలో ఇళ్లకు స్టిక్కర్లు వేయకపోవడంతో సర్వే సిబ్బందితో పలువురు వాగ్వాదానికి దిగారు. వైరాలో కుటుంబాల విషయంలో అధికారులకు సరైన అవగాహన లేకపోవడంతో పూర్తి స్థాయిలో స్టిక్కర్లు వేయలేదు. దీంతో అధికారులు మొబైల్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఎన్యూమరేటర్లను పంపించి సర్వే నిర్వహించారు. కారేపల్లి మండలంలోని కారేపల్లి, గుంపెళ్ళగూడెం, భాగ్యనగర్‌తండా, బాజుమల్లాయిగూడెం, పాటిమీదిగుంపు, చీమలపాడు, పోలంపల్లి, పేరుపల్లి, గేటుకారేపల్లి, గిద్దెవారిగూడెం, విశ్వనాధపల్లి గ్రామాలతో పాటు మరి కొన్ని గ్రామాలతో కలిపి సుమారు 80 మంది కు టుంబాలకు స్టిక్కరింగ్ వేయలేదనే కారణంతో ఎన్యుమరేటర్లు సర్వే నిర్వహించలేదు. దీంతో తహశీల్దార్ మంగీలాల్ ముందు బాధిత కుటుంబాల వారు గోడు వెల్లబోసుకున్నారు. భాగ్యనగర్‌తండాలో సర్వేనిర్వహిస్తున్న ఎన్యూమరేటర్ నరసింహా చారి స్పృహ తప్పి కింద ప డిపోయారు. వాంతులు, విరేచనాలు కావడం తో గ్రామస్తులు కారేపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. రిజ ర్వులో ఉన్న మరో ఎన్యూమరేటర్‌ను తహశీల్దార్ నియమించి సర్వేను పునఃప్రారంభించారు. కొణిజర్ల మండలంలో సర్వే ఆలస్యంగా ప్రారంభమైంది. తనికెళ్ల, కొణిజర్ల, పల్లిపాడులో అంగన్వాడీ కార్యకర్తల నిర్లక్ష్యంతో ఒక ఇంట్లో రెండు కుటుంబాలు నివాసం ఉంటూ అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా ఒకే ఇంటి కింద నమోదు చేయడంతో తనికెళ్లలో ప్రజలు వీఆర్వో మహబూబ్ అలీ పై చేయి చేసుకోబోయారు. మండలంలో జరిగిన సర్వేను జిల్లా కలెక్టర్ ఇలంబరితి పరిశీలించారు. ఏన్కూరు మండలం రాజులపాలెంలో స్టిక్కర్లు పంపిణీ చేయలేదని గ్రామస్తులు సర్వేను అడ్డుకున్నారు. అశ్వారావుపేట మేజర్ పంచాయతీ సర్వే జాబితాలో సుమారు 1500 కుటుంబాల పేర్లు గల్లంతు కావడంతో వారంతా తిరిగి తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన అన్ని చోట్లా ఇదే సమస్య ఉత్పన్నం అయింది. సర్వేకు కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు సిబ్బందిని, స్థానిక వ్యవసాయ కళాశాల విద్యార్థులను కూడా వినియోగించారు. పాల్వంచలో స్టిక్కర్లు, జాబితాలో పేర్లు లేకపోవడంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రజలు ఆందోళన చేపట్టారు. మంచికంటినగర్, బోలోరిగూడెం, గట్టాయిగూడెం గ్రామాలలో ఐటీడీఏ పీవో దివ్య సర్వేను పరిశీలించారు. పాల్వంచలోని ప్రశాంత్‌నగర్‌లోని ఇళ్లకు స్టిక్కర్లు వేయకపోవడంతో సర్వేను బహిష్కరిస్తున్నామని స్థానికులు ప్రకటించారు. కొత్తగూడెంలోని గాజులరాజంబస్తీ, హనుమాన్‌బస్తీ తదితర ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలు స్టిక్కర్లు అంటించకపోవడంతో స్థానికులు ఆందోళన చెందారు. బర్మాక్యాంప్‌లో సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా 60 శాతం సర్వే కాకపోవడంతో అక్కడి ప్రజలు ఆర్డీవో అమయ్‌కుమార్‌కు ఫిర్యాదుచేశారు. బూర్గంపాడు మండలంలో చాలా ఇళ్లకు స్డిక్కర్లు అంటించకపోవడంతో తహశీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. దీంతో తహశీల్దారు సారపాక లోని ఓప్రైవేటు పాఠశాలలో స్టిక్కర్లు లేని వారినందరినీ ఒకే దగ్గర ఉంచి సర్వే నిర్వహించారు. మణుగూరు మండలంలోనూ సర్వేలో కొంత గందరగోళం నెలకొంది. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చాలా ఇండ్లకు స్టిక్కర్లు వేయకపోవడంతో వారంతా తహశీల్దారు కార్యాయలంలో ఆందోళన నిర్వహించారు. దీంతో తహశీల్దారు తక్షణమే మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేసి స్టిక్కర్లు లేని వారి సమాచారాన్ని సేకరించి తిరిగి వారి ఇండ్లలో సర్వే నిర్వహించారు. అశ్వాపురం, గుండాలలో సర్వే ప్రశాంతగా కొనసాగింది. పాలేరు నియోజకవర్గంలో ఉదయం 8గంటలకే సర్వే ప్రారంభించినా.. మందకొడిగా సాగింది. ఎన్యూమరేటర్లకు ఏంచెపితే ఏమవుతుందోనని కొందరు వెనుకాడారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 12 గంటలకు సర్వే ప్రక్రియ ఊపందుకుంది. కూసుమంచి మండలం పోచారంలో దాదాపు 150 కుటుంబాలకు స్టిక్కర్లు వేయకపోవడంతో వారి వివరాలు నమోదు చేసేందుకు ఎన్యూమరేటర్లు తిరస్కరించారు. దీంతో ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి కల్పించుకుని విషయాన్ని తహసీల్దార్ కిషోర్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో ఆకుటుంబాలను సర్వే చేయాలని తెలిపారు. దీంతో స్పందించిన తహసీల్దార్ వెంటనే 150 ఫారాలు పంపించి గ్రామంలో అన్ని కుటుంబాలను సర్వే చేశారు. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో గ్రామ సర్పంచ్ బండి జగదీష్ కల్పించుకుని అన్ని కుటుంబాలను సర్వేలో చేర్చారు. తల్లాడ మండలం పినపాకలో సుమారు 50 ఇళ్లకుపైగా స్టిక్కర్లు అంటించలేదని గ్రామస్తులు సర్వేను బహిష్కరించటంతో అధికారులు అక్కడికి చేరుకుని స్టిక్కర్లు అంటించని వారిని కూడా సర్వే చేస్తామని హామీ ఇవ్వటంతో ఆ తర్వాత సహకరించారు. సత్తుపల్లి మండలం సిద్ధారంలో స్టిక్కర్లు అంటించలేదని ఎన్యూమరేటర్‌ను కొద్ది సేపు అడ్డుకున్నారు. బేతుపల్లిలో సైతం పేర్లు నమోదు కాలేదంటూ పంచాయతీ కార్యాలయానికి చేరుకోవటంతో మధిర డిప్యూటీ డీఈఓ బి.రాములు వారికి సర్దిచెప్పి పేర్లు నమోదు నమోదు చేసుకోవటంతో సర్వే సజావుగా సాగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం 4.30 గంటల నుంచి సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాలలో స్టిక్కర్లు అంటించని, కొత్తగా నమోదు చేసుకున్నవారు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొస్తే అక్కడికక్కడే నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఎన్యూమరేటర్లకు సకాలంలో భోజనం అందించక పోవటంతో ఇబ్బంది పడ్డారు. డీసీసీబీ అధ్యక్షుడు మువ్వా విజయబాబు సత్తుపల్లిలోని సొంత అపార్ట్మెంట్లో కుటుంబ సర్వే సిబ్బంది వద్ద పేర్లు, వివరాలు నమోదు చేయించుకున్నారు. భద్రాచలం డివిజన్లో సర్వే ప్రశాంతంగా ముగిసింది. వాజేడు మండల కేంద్రంలో ఓ కుటుంబంలో పెండ్లి వేడుకలు ఉన్నాయనే కారణంతో వారి విజ్ఞప్తి మేరకు ఎన్యూమరేటర్ సోమవారం రాత్రే సర్వే చేశారు. భద్రాచలంలో వందల సంఖ్యలో ఇండ్లకు స్టిక్కర్లు అంటించ లేదు. సర్వే సమయంలో ఇది వెలుగులోకి రావటంతో ఎన్యూమరేటర్లను అదనంగా ఏర్పాటు చేసి సమాచారాన్ని సేకరించారు. పట్టణంలో సుందరయ్య నగర్ కాలనీలోని 30 ఇండ్లు వారు స్టిక్కర్లు అంటించకపోవటంతో డి గ్రీ కళాశాలలోని కేంద్రానికి వచ్చి నిరసన తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజ య్య పట్టణంలో భగవాన్‌దాస్ కాలనీలోని తన ఇంటి వద్ద సర్వేలో సమాచారం అందజేశారు. ముంపు మండలాల్లో సర్వే జరగలేదు. అయితే ముంపులోనే పేర్కొన్న భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న రాజుపేట కాలనీ( ఇది లక్ష్మీదేవి పేట రెవెన్యూ గ్రామం) శ్రీరామనగర్ కాలనీ( ఇది పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామం )లో సర్వే చేశారు. ఇక్కడ సర్వే ఉండ దని అధికారులు ముందుగా ప్రకటించినా.. మంగళవారం సర్వే చేశారు. మధిర మండలంలోని సిద్దినేనిగూడెం, మాటూ రు, సిరిపురం తదితర గ్రామాల్లో సర్వే పూర్తిస్థాయిలో జరగలేదు. ముఖ్యంగా కొన్ని ఇళ్లకు స్టిక్కర్లు అంటించకపోవడంతో సర్వే సిబ్బంది ఆయా కుటుంబాలకు వెళ్లి సర్వే నిర్వహించలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. మధిర నగరపంచాయతీ పరిధిలోని 8,9,10, 11 వార్డుల్లో పలు కుటుంబాలకు సర్వే నిర్వహించకపోవడంతో వారు నిరసన వ్యక్తంచేశారు. ఖమ్మం నగర శివారరులోని మమత ఆసుపత్రి ప్రాంతంలో కూల్చిన గుడిసెల ప్రాంతంలో వేసుకున్న గుడారాల్లో సర్వేలో అనేక ఇబ్బంది పడ్డారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్, ప్రకాష్‌నగర్, చెరువుబజార్, ముస్తఫానగర్, రమణగుట్ట, వికాలాంగుల కాలనీ, రాపర్తినగర్, బీసీ కాలనీ కాల్వోడ్డు తదితర ప్రాంతాల్లో స్టిక్కరింగ్ ప్రక్రియ జరగక పోవడంతో స్థానికులు కొంత అందోళన గురైయ్యారు. స్టిక్కర్ల కోసం ఉదయం 7 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలోని మీ సేవా కార్యాలయం ముందు బారులు తీరారు. దీంతో అధికారులు 10 గంటల సమయంలో ఇంటినెంబర్ల సీరిస్ ఆధారంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు.