బెల్లంపల్లి : అధికారుల నిర్లక్ష్యం వల్ల బెల్లంపల్లిలో కొన్ని కుటుంబాలు మంగళవారం కుటుంబ, ఆర్థిక, సామాజిక సమగ్ర సర్వేకు నోచుకోలేదు. ఎన్యూమరేటర్లు సదరు ఇళ్లలో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకోలేదు. అధికారుల తప్పిదానికి తాము బలయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 34వ వార్డు కాల్‌టెక్స్ ఏరియాలో 30 ఏళ్ల పైబడి నుంచి కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
దాసరి ఓదమ్మ, దాసరి జ్యోతి, గరిగ నాగరాజు, గరిగ నాగమణి, గరిగ వెంటేశ్వర్‌రావు, గరిగ వెంకటేశ్వరమ్మ, గరిగ శివ, గరిగ శోభ, కుడుపూడి నాగరాజు, కుడుపూడి రమాదేవి, ఉమామహేశ్వరి, అనుషాదేవి వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నారు. వీరిలో కొందరికి సొంత గృహాలు ఉండగా.. మరికొందరు అద్దె ఇళ్లలో జీవిస్తున్నారు. కూలీ పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు.
వీరందరికి రేషన్, ఆధార్‌కార్డులు ఉన్నా సదరు వ్యక్తులు నివసిస్తున్న ఇళ్లకు నంబర్లు వేయలేదు. దీంతో సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లు వివరాల నమోదుకు నిరాకరించారు. తమ కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకోవాలని సభ్యులు కోరినా ఎన్యూమరేటర్లు అంగీకరించలేదు. తమకు కేటాయించిన పేర్లు, ఇళ్ల నంబర్ల ఆధారంగానే సర్వే చేస్తామని తేల్చి చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
25వ వార్డులో..
25వ వార్డులోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఒక ఇంట్లో రెండు కుటుంబాలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఆ ఇంటికి ఒక సంఖ్య మాత్రమే వేయడం వల్ల మరో కుటుంబం వివరాలు సేకరించడానికి ఎన్యూమరేటర్లు నిరాకరించారు. దీంతో వాగ్వాదం జరిగింది. వార్డు పరిధిలోని హన్మాన్‌బస్తీకి చెందిన పలువురు తాము నివసిస్తున్న ఇళ్లను పరిశీలించి బై నంబర్లు వేసి వివరాలు నమోదు చేసుకోవాలని ఎన్యూమరేటర్లను నిలదీశారు. దీంతో కొద్దిసేపు సర్వేకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న సూపర్‌వైజర్ లలిత అక్కడికి చేరుకోవడంతో ఆమెతో బస్తీ ప్రజలు వాగ్వివాదానికి దిగారు. సూపర్‌వైజర్ తన వద్ద ఉన్న కుటుంబ సర్వే కాపీలను ఎన్యూమరేటర్లకు ఇచ్చి సర్వే చేయాలని సూచించడంతో వివాదం సద్దుమణిగింది.
తాళ్లగురిజాలలో..
బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల గ్రామంలో కొందరు ఎస్టీల ఇళ్లకు సర్వేనంబర్లు వేయకపోవడంతో సదరు కుటుంబాల వివరాల నమోదు ప్రక్రియ జరగలేదు. గ్రామంలోని నాయిని పెద్దులు, గొలిశెట్టి మల్లు, గొలి శెట్టి ఎల్లరాజు, నాయిని బక్కు, గొలిశెట్టి వెంకటేశ్, పల్లె లింగమ్మ, మంతెన నర్సయ్య, పల్లెకుర్తి లింగమ్మ తదితరులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఎన్యూమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. అయినా ఎన్యూమరేటర్లు పేర్లు నమోదు చేసుకోలేదు. చివరికి మండల విద్యాధికారి డి.శ్రీధర్‌స్వామి అక్కడికి వచ్చి అదనపు సర్వే కాపీలను తెప్పించి వివరాలు నమోదు చేయిస్తామని నచ్చజెప్పడంతో గిరిజనులు శాంతించారు. సర్వేలో వివరాలు నమోదు చేసుకోని కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.
నంబర్లు లేవు.. నమోదు చేయలేదు..
Published Wed, Aug 20 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM
Advertisement