భద్రాచలం : భద్రాచలం ఏజెన్సీలో సమగ్ర కుటుంబ సర్వే గందరగోళంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు డివిజన్‌స్థాయి అధికారులు శ్రద్ధ చూపినప్పటికీ ప్రాథమిక సర్వేలో జరిగిన లోపాలు ప్రజల నుంచి వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేసేందుకు ముందుగా అంగన్‌వాడీ కార్యకర్తలతో సర్వే చేయించారు.
ఈ సర్వేను వీఆర్వోలు పర్యవేక్షించారు. గుర్తించిన ఇళ్లకు ప్రత్యేకంగా నంబర్‌లు కేటాయిస్తూ ప్రతీ ఇంటికి స్టిక్కర్ అంటించారు. కానీ కొంత మంది సిబ్బంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మంగళవారం నిర్వహించిన సమగ్ర సర్వేలో సమస్య తలెత్తింది. ప్రధానంగా భద్రాచలం పట్టణంలోనే వందల సంఖ్యలో ఇళ్లకు స్టిక్కర్లు అందించకపోవడమే ఇందుకు నిదర్శనం. స్టిక్కర్లు ఉంటేనే సర్వే చేస్తామని ఎన్యూమరేటర్లు చెప్పడంతో స్టిక్కర్లు లేని ఇళ్లవారు ఆందోళనకు గురయ్యారు. భవిష్యత్‌లో అన్ని ధ్రువీకరణ పత్రాలకు ఈ సర్వేనే ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడంతో వివరాలు నమోదు చేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.
అంతా గందరగోళమే...
స్టిక్కర్లు అంటించని ఇళ్ల వారు ఈ విషయాన్ని ఆర్డీఓ, తహశీల్దార్‌ల దృష్టికి తీసుకెళ్లడంతో వారు స్పందించారు. సర్వేలో ఏ ఒక్కరు కూడా వివరాలు నమోదు చేయించుకోకుండా ఉండకూడదనే ఉద్దేశంతో వారి సమాచారాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో కాలనీలో ముగ్గురు ఎన్యూమరేటర్లను ఏర్పాటు చేసి స్టిక్కర్లు లేని వారి సమాచారాన్ని కూడా సేకరించేలా ఏర్పాట్లు చేశారు.
అయితే భద్రాచలం పట్టణంలో సరైన రీతిలో సర్వే లేకపోవటంతో రాత్రి 9 గంటల వరకూ కూడా ఇది కొనసాగింది. మరోపక్క కొంత మంది ఇళ్లకు స్టిక్కర్లు ఉన్నప్పటికీ ఎన్యూమరేటర్లు వారి వివరాలు నమోదు చేయలేదు. దీంతో చాలా మంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా కాలనీల్లోని వారే కొందరు స్వయంగా మిగిలిపోయిన వారి వివరాలతో జాబితా తయారు చేసి అధికారులకు అందజేశారు.
ఎమ్మెల్యే రాజయ్య ఇంటినీ మరిచారు : భద్రాచలం ఎమ్మెల్యే సున్న రాజయ్య భగవాన్‌దాస్ కాలనీలో ఉంటున్నారు. కానీ ఎమ్మెల్యే ఇంటికి స్టిక్కరు అతికించలేదు. దీంతో ఆ కాలనీకి వెళ్లిన ఎన్యూమరేటర్ ఎమ్మెల్యే సమాచారం సేకరించేందుకు నిరాకరించారు. దీంతో ఆయన ఈ విషయాన్ని నేరుగా ఆర్డీఓ అంజయ్య దృష్టికి తీసుకెళ్లారు. వీఆర్‌పురం మండలం సున్నంవారిగూడెంలో అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు ఉన్నప్పటికీ కొన్నేళ్లుగా భద్రాచలంలోని సొంత ఇంట్లో తాను ఉంటూ ప్రజాప్రతినిధిగా పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నానని తెలిపారు.
దీంతో ఆర్డీఓ అంజయ్య అప్పటికప్పుడు ఓ ఎన్యూమరేటర్‌ను ఏర్పాటు చేశారు. ఆ కాలనీలో సర్వేను పరిశీలించేందుకు వెళ్లిన ఎంఈఓ మాధవరావు, ఎన్యూమరేటర్‌ను ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లి ఆయన సమాచారాన్ని సేకరించారు. స్టిక్కరు అతికించకపోవటంతోనే ఇటువంటి సమస్య ఏర్పడిందని ఎమ్మెల్యే రాజయ్య అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
సుందరయ్య కాలనీ వాసులు నిరశన : భద్రాచలం పట్టణంలోని సుందరయ్య కాలనీలో స్థిర నివాసులమైన తమ ఇళ్లకు స్టిక్కర్లు అంటించకపోవడమే కాకుండా సర్వే కూడా చేయలేదని కాలనీ వాసులు నిరసన తెలిపారు. ఆ కాలనీ వాసులు డిగ్రీ కళాశాలకు వచ్చి అధికారుల వద్ద నిరశన తెలిపారు. స్టిక్కర్లు అతికించపోవడంతో వివరాలు నమోదు చేయలేమని ఎన్యూమరేటర్లు చెప్పారని వార్డు సభ్యురాలు మంగ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారి వివరాలు కూడా సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
అ‘సమగ్ర’ సర్వే..!
Published Wed, Aug 20 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM
Advertisement
Advertisement