సర్వే సమాప్తం | end of the Comprehensive Family Survey - 2014 ' in district | Sakshi
Sakshi News home page

సర్వే సమాప్తం

Published Wed, Aug 20 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

end of the Comprehensive Family Survey - 2014 ' in district

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎన్నో అపోహలు, అనుమానాలు, పుకార్లతో పాటు ఎంతో ఉత్సుకత, ఆసక్తిని రేకెత్తించిన సమగ్ర కుటుంబ సర్వే - 2014 జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఉద యం 7 గంటలకు ప్రారంభమైన సర్వే తొలుత మందకొడిగా సాగి, మధ్యాహ్నం నుంచి ఊపందుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట కల్లా 40 శా తమే పూర్తయిన సర్వే సాయంత్రం ఆరు గంటల సమయానికి 80 శాతానికి చేరింది. మొత్తం మీద  90 శాతానికి పైగానే జరిగిందని అధికారులు చెపుతున్నారు.

 జిల్లా వ్యాప్తంగా 8 లక్షలకు పైగా కుటుంబాల వివరాలు నమోదు చేశారు. ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు ఇతర పట్టణ ప్రాంతాల్లో సర్వే అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈ సర్వేలో సామాన్య ప్రజానీకంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌పర్సన్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ పార్టీల నాయకులు, ఇతర ప్రముఖులు తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీ, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సర్వేలో పాల్గొన్నారు. ఎన్యూమరేటర్‌కు తమ వివరాలు ఇచ్చేంతవరకు ప్రజలు బయటకు రాకపోవడం, చాలా మంది ఆదివారమే తమ స్వగ్రామాలకు వెళ్లడంతో ఖమ్మంతో పాటు పలు పట్టణాల్లో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది.

సినిమా హాళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించడంతో సాయంత్రం నాలుగు గంటల తర్వాత కొంత జనసమ్మర్థం కనిపించింది. సర్వే సందర్భంగా ఎన్యూమరేట ర్లకు కేటాయించిన ఇంటి నంబర్లలో గందరగోళం ఏర్పడడంతో పాటు ఇళ్లు దొరక్కపోవడంతో నా నా అవస్తలు పడాల్సి వచ్చింది. ఎన్యూమరేటర్లకు చాలా చోట్ల భోజన వసతి కూడా లేక ఇబ్బందులు పడ్డారు. ఇక, సర్వే సందర్భంగా జిల్లా ప్రజానీకమంతా ఎదుర్కొన్న సమస్య ‘స్టిక్కరింగ్.’ స్టిక్కర్ ఉన్న కుటుంబానికి సంబంధించిన సమాచారమే తీసుకుంటామని ఎన్యూమరేటర్లు చెప్పడంతో జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రజలు గందరగోళానికి గురయ్యారు.

తల్లాడ, బూర్గం పాడు, ఖమ్మం నగరం, రఘునాథపాలెం.. ఇలా మెజార్టీ మండలాల్లో ప్రజలు తహశీల్దార్, మున్సిపల్ అధికారుల చుట్టూ పరుగులు తీయాల్సి వచ్చింది. కొన్నిచోట్ల ప్రజలు తాము సర్వేను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత అధికారుల హామీతో సర్వే కొనసాగింది. జిల్లాలో జరిగిన సర్వే కార్యక్రమాన్ని ప్రత్యేకాధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్ పర్యవేక్షించారు. మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన కలెక్టర్‌తో కలిసి సర్వే ను సమీక్షించారు. ఇక, ప్రజల ఫిర్యాదులతో అధికారుల ఫోన్లు హోరెత్తిపోయాయి.  జిల్లా కేం ద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్లకే 300 కు పైగా ఫోన్లు వచ్చాయి. తహశీల్దార్లు, ఇతర అధికారుల ఫోన్లయితే లెక్కే లేదు. చిన్న చిన్న అవాం తరాల నడుమ సర్వే సమాప్తం కావడంతో జిల్లా ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

  సర్వే జరిగిన తీరిది..
ఇల్లెందులో ఇళ్లకు స్టిక్కర్‌లు వేయలేదంటూ సర్వే సిబ్బంది, అధికారులతో పలువురు వాగ్వాదానికి దిగారు. మండలంలోని రాఘబోయినగూడెం ముల్కనూర్ గ్రామంలో మున్నూరుకాపు వారికి కుల ధ్రువీకరణ పత్రం ఉంటేనే వివరాలు నమోదు చేస్తామని సిబ్బంది చెప్పడంతో వారు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న జోనల్ అధికారి విద్యార్థుల సర్టిఫికెట్లలో ఎలా ఉంటే అలాగే నమోదు చేయాలని సూచించడంతో సర్వే కొనసాగింది.
     
టేకులపల్లిలో ఒక ఎన్యూమరేటర్ మద్యం సేవించి హంగామా సృష్టించాడు. సంపత్‌నగర్‌లో సర్వే సిబ్బందిని దింపి టేకులపల్లికి వస్తున్న వాహనం ఒక బాలుడిని ఢీకొంది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
     
బయ్యారం మండలం ఇసుక మిది గ్రామానికి చెందిన ఆదివాసీలు తమకు జీవో నంబర్ 3 ప్రకారం ఉద్యోగాలు కల్పించాలని, పోడు భూముల సాగు విషయంలో అటవీ అధికారుల వేధింపులపై చర్యలు తీసుకోవాలని సర్వే సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీడీఓ చంద్రశేఖర్ జేసీతో మాట్లాడి సమస్య పరిష్కరించారు.
     
కామేపల్లిలోని 17 గ్రామపంచాయతీల్లో ఉదయం 8 గంటలకే సర్వే ప్రారంభమైంది. స్టిక్కర్లు అంటించని కుటుంబాలను మొబైల్ టీమ్‌ల ద్వారా సర్వే చేశారు.
     
గార్లలో ఇళ్లకు స్టిక్కర్‌లు వేయకపోవడంతో సర్వే సిబ్బందితో పలువురు వాగ్వాదానికి దిగారు.
     
వైరాలో కుటుంబాల విషయంలో అధికారులకు సరైన అవగాహన లేకపోవడంతో పూర్తి స్థాయిలో స్టిక్కర్లు వేయలేదు. దీంతో అధికారులు మొబైల్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఎన్యూమరేటర్లను పంపించి సర్వే నిర్వహించారు.  
     
కారేపల్లి మండలంలోని కారేపల్లి, గుంపెళ్ళగూడెం, భాగ్యనగర్‌తండా, బాజుమల్లాయిగూడెం, పాటిమీదిగుంపు, చీమలపాడు, పోలంపల్లి, పేరుపల్లి, గేటుకారేపల్లి, గిద్దెవారిగూడెం, విశ్వనాధపల్లి గ్రామాలతో పాటు మరి కొన్ని గ్రామాలతో కలిపి సుమారు 80 మంది కు టుంబాలకు స్టిక్కరింగ్ వేయలేదనే కారణంతో ఎన్యుమరేటర్లు సర్వే నిర్వహించలేదు. దీంతో తహశీల్దార్ మంగీలాల్ ముందు బాధిత కుటుంబాల వారు గోడు వెల్లబోసుకున్నారు.
     
భాగ్యనగర్‌తండాలో సర్వేనిర్వహిస్తున్న ఎన్యూమరేటర్ నరసింహా చారి స్పృహ తప్పి కింద ప డిపోయారు. వాంతులు, విరేచనాలు కావడం తో గ్రామస్తులు కారేపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. రిజ ర్వులో ఉన్న మరో ఎన్యూమరేటర్‌ను తహశీల్దార్ నియమించి సర్వేను పునఃప్రారంభించారు.
     
కొణిజర్ల మండలంలో సర్వే ఆలస్యంగా ప్రారంభమైంది. తనికెళ్ల, కొణిజర్ల, పల్లిపాడులో అంగన్‌వాడీ కార్యకర్తల నిర్లక్ష్యంతో ఒక ఇంట్లో రెండు కుటుంబాలు నివాసం ఉంటూ అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా ఒకే ఇంటి కింద నమోదు చేయడంతో తనికెళ్లలో ప్రజలు వీఆర్వో మహబూబ్ అలీ పై చేయి చేసుకోబోయారు. మండలంలో జరిగిన సర్వేను జిల్లా కలెక్టర్ ఇలంబరితి పరిశీలించారు.
     
ఏన్కూరు మండలం రాజులపాలెంలో స్టిక్కర్లు పంపిణీ చేయలేదని గ్రామస్తులు సర్వేను అడ్డుకున్నారు.
     
అశ్వారావుపేట మేజర్ పంచాయతీ సర్వే జాబితాలో సుమారు 1500 కుటుంబాల పేర్లు గల్లంతు కావడంతో వారంతా తిరిగి తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన అన్ని చోట్లా ఇదే సమస్య ఉత్పన్నం అయింది. సర్వేకు కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు సిబ్బందిని, స్థానిక వ్యవసాయ కళాశాల విద్యార్థులను కూడా వినియోగించారు.
     
పాల్వంచలో స్టిక్కర్లు, జాబితాలో పేర్లు లేకపోవడంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రజలు ఆందోళన చేపట్టారు. మంచికంటినగర్, బోలోరిగూడెం, గట్టాయిగూడెం గ్రామాలలో ఐటీడీఏ పీవో దివ్య సర్వేను పరిశీలించారు. పాల్వంచలోని ప్రశాంత్‌నగర్‌లోని ఇళ్లకు స్టిక్కర్లు వేయకపోవడంతో సర్వేను బహిష్కరిస్తున్నామని స్థానికులు ప్రకటించారు.
     
కొత్తగూడెంలోని గాజులరాజంబస్తీ, హనుమాన్‌బస్తీ తదితర ప్రాంతాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు స్టిక్కర్లు అంటించకపోవడంతో స్థానికులు ఆందోళన చెందారు. బర్మాక్యాంప్‌లో సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా 60 శాతం సర్వే కాకపోవడంతో అక్కడి ప్రజలు ఆర్డీవో అమయ్‌కుమార్‌కు ఫిర్యాదుచేశారు.
     
బూర్గంపాడు మండలంలో చాలా ఇళ్లకు స్డిక్కర్లు అంటించకపోవడంతో తహశీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. దీంతో తహశీల్దారు సారపాక లోని ఓప్రైవేటు పాఠశాలలో స్టిక్కర్లు లేని వారినందరినీ ఒకే దగ్గర ఉంచి సర్వే నిర్వహించారు. మణుగూరు మండలంలోనూ సర్వేలో కొంత గందరగోళం నెలకొంది. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చాలా ఇండ్లకు స్టిక్కర్లు వేయకపోవడంతో వారంతా తహశీల్దారు కార్యాయలంలో ఆందోళన నిర్వహించారు. దీంతో తహశీల్దారు తక్షణమే మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేసి స్టిక్కర్లు లేని వారి సమాచారాన్ని సేకరించి తిరిగి వారి ఇండ్లలో సర్వే నిర్వహించారు. అశ్వాపురం, గుండాలలో సర్వే ప్రశాంతగా కొనసాగింది.
     
పాలేరు నియోజకవర్గంలో ఉదయం 8గంటలకే సర్వే ప్రారంభించినా..  మందకొడిగా సాగింది. ఎన్యూమరేటర్లకు ఏంచెపితే ఏమవుతుందోనని కొందరు వెనుకాడారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 12 గంటలకు సర్వే ప్రక్రియ ఊపందుకుంది.
     
కూసుమంచి మండలం పోచారంలో దాదాపు 150 కుటుంబాలకు  స్టిక్కర్లు వేయకపోవడంతో వారి వివరాలు నమోదు చేసేందుకు ఎన్యూమరేటర్లు తిరస్కరించారు. దీంతో ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి కల్పించుకుని విషయాన్ని తహసీల్దార్ కిషోర్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో ఆకుటుంబాలను సర్వే చేయాలని తెలిపారు. దీంతో స్పందించిన తహసీల్దార్ వెంటనే 150 ఫారాలు పంపించి గ్రామంలో అన్ని కుటుంబాలను సర్వే చేశారు.
     
ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో గ్రామ సర్పంచ్ బండి జగదీష్ కల్పించుకుని అన్ని కుటుంబాలను సర్వేలో చేర్చారు.
     
తల్లాడ మండలం పినపాకలో సుమారు 50 ఇళ్లకుపైగా స్టిక్కర్లు అంటించలేదని గ్రామస్తులు సర్వేను బహిష్కరించటంతో అధికారులు అక్కడికి చేరుకుని స్టిక్కర్లు అంటించని వారిని కూడా సర్వే చేస్తామని హామీ ఇవ్వటంతో ఆ తర్వాత సహకరించారు.
     
సత్తుపల్లి మండలం సిద్ధారంలో స్టిక్కర్లు అంటించలేదని ఎన్యూమరేటర్‌ను కొద్ది సేపు అడ్డుకున్నారు. బేతుపల్లిలో సైతం పేర్లు నమోదు కాలేదంటూ పంచాయతీ కార్యాలయానికి చేరుకోవటంతో మధిర డిప్యూటీ డీఈఓ బి.రాములు వారికి సర్దిచెప్పి పేర్లు నమోదు నమోదు చేసుకోవటంతో సర్వే సజావుగా సాగింది.
     
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం 4.30 గంటల నుంచి సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాలలో స్టిక్కర్లు అంటించని, కొత్తగా నమోదు చేసుకున్నవారు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొస్తే అక్కడికక్కడే నమోదు కార్యక్రమం నిర్వహించారు.
     
ఎన్యూమరేటర్లకు సకాలంలో భోజనం అందించక పోవటంతో ఇబ్బంది పడ్డారు. డీసీసీబీ అధ్యక్షుడు మువ్వా విజయబాబు సత్తుపల్లిలోని సొంత అపార్ట్‌మెంట్‌లో కుటుంబ సర్వే సిబ్బంది వద్ద పేర్లు, వివరాలు నమోదు చేయించుకున్నారు.
     
భద్రాచలం డివిజన్‌లో సర్వే ప్రశాంతంగా ముగిసింది. వాజేడు మండల కేంద్రంలో ఓ కుటుంబంలో పెండ్లి వేడుకలు ఉన్నాయనే కారణంతో వారి విజ్ఞప్తి మేరకు ఎన్యూమరేటర్ సోమవారం రాత్రే సర్వే చేశారు. భద్రాచలంలో వందల సంఖ్యలో ఇండ్లకు స్టిక్కర్లు అంటించ లేదు. సర్వే సమయంలో ఇది వెలుగులోకి రావటంతో ఎన్యూమరేటర్‌లను అదనంగా ఏర్పాటు చేసి సమాచారాన్ని సేకరించారు.
     
పట్టణంలో సుందరయ్య నగర్ కాలనీలోని 30 ఇండ్లు వారు స్టిక్కర్లు అంటించకపోవటంతో డి గ్రీ కళాశాలలోని కేంద్రానికి వచ్చి నిరసన తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజ య్య పట్టణంలో భగవాన్‌దాస్ కాలనీలోని తన ఇంటి వద్ద సర్వేలో సమాచారం అందజేశారు.
     
ముంపు మండలాల్లో సర్వే జరగలేదు. అయితే ముంపులోనే పేర్కొన్న భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న రాజుపేట కాలనీ( ఇది లక్ష్మీదేవి పేట రెవెన్యూ గ్రామం) శ్రీరామనగర్ కాలనీ( ఇది పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామం )లో సర్వే చేశారు. ఇక్కడ సర్వే ఉండ దని అధికారులు ముందుగా ప్రకటించినా.. మంగళవారం సర్వే చేశారు.
     
మధిర మండలంలోని సిద్దినేనిగూడెం, మాటూ రు, సిరిపురం తదితర గ్రామాల్లో సర్వే పూర్తిస్థాయిలో జరగలేదు. ముఖ్యంగా కొన్ని ఇళ్లకు స్టిక్కర్లు అంటించకపోవడంతో సర్వే సిబ్బంది ఆయా కుటుంబాలకు వెళ్లి సర్వే నిర్వహించలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. మధిర నగరపంచాయతీ పరిధిలోని 8,9,10, 11 వార్డుల్లో పలు కుటుంబాలకు సర్వే నిర్వహించకపోవడంతో వారు నిరసన వ్యక్తంచేశారు.
     
ఖమ్మం నగర శివారరులోని మమత ఆసుపత్రి ప్రాంతంలో కూల్చిన గుడిసెల ప్రాంతంలో వేసుకున్న గుడారాల్లో సర్వేలో అనేక ఇబ్బంది పడ్డారు.
     
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్, ప్రకాష్‌నగర్, చెరువుబజార్, ముస్తఫానగర్, రమణగుట్ట, వికాలాంగుల కాలనీ, రాపర్తినగర్, బీసీ కాలనీ కాల్వోడ్డు  తదితర ప్రాంతాల్లో స్టిక్కరింగ్ ప్రక్రియ జరగక పోవడంతో స్థానికులు కొంత అందోళన గురైయ్యారు.
     
స్టిక్కర్ల కోసం ఉదయం 7 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలోని మీ సేవా కార్యాలయం ముందు బారులు తీరారు. దీంతో అధికారులు 10 గంటల సమయంలో ఇంటినెంబర్ల సీరిస్ ఆధారంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement