వారంతా విద్యార్థులు.. సమగ్ర సర్వేలో స్వచ్ఛందగా పాల్గొన్నారు.
కీసర:వారంతా విద్యార్థులు.. సమగ్ర సర్వేలో స్వచ్ఛందగా పాల్గొన్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వే చేశారు. వారికి మధ్యాహ్నం భోజన వసతి కల్పించిన అధికారులు సర్వే ముగిశాక వారిని విస్మరించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు.. రాత్రివేళ తాము ఇంటికి ఎలా చేరుకోవాలి.. భోజనం ఎక్కడ చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల తీరుపై మండిపడుతూ.. మండలంలోని అహ్మద్‌గూడ గ్రామంలో ఆందోళనకు దిగారు. సమగ్ర సర్వే కోసం తామంతా స్వచ్ఛందంగా తరలి వచ్చామని.. తమ కోసం ఆలోచించేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయ బృందాన్ని ప్రభుత్వ అధికారులను వినియోగించుకునే ప్రభుత్వం వారికి సకల ఏర్పాట్లు చేస్తుందని వారికంటే తక్కువ తామేం చేశామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వెంటనే రవాణా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. సర్వేలో విద్యార్థినులు చాలా మంది ఉన్నారని ... వారి పరిస్థితి ఏంటని అన్నారు. తమ నిరసనపై స్థానిక అధికారులు స్పందించకపోవడం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఎన్యూమరేటర్లను సురక్షితంగా వారి ఇళ్లకు చేరుస్తామన్నారు.