కుటుంబాలే గల్లంతు..
ఆన్‌లైన్‌లో కనిపించని పేర్లు
* పట్టణంలో నమోదు కానివి..
* 263 కుటుంబాలు
* పట్టణం పేర్లు పల్లెల్లోకి..
హుస్నాబాద్ : సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు గల్లంతయ్యూయి. హుస్నాబాద్ పట్టణంలోని రెండువందల కుటుంబాలకు సంబంధించిన సమాచారం ఆన్‌లైన్‌లో కనిపించకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించగా.. పట్టణంలో 6,943 కుటుంబాలు ఉన్నట్లు తేలింది. ఈ వివరాలను అధికారులు తిమ్మాపూర్ మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఆన్‌లైన్‌లో న మోదు చేయించారు. అయితే సర్వేలో వివరాలను సమర్పించిన 263 కుటుంబాల సమాచారం ఆన్‌లైన్‌లో కనిపించడంలేదు. పట్టణంలోని పలువార్డులకు సంబంధించిన ఈ సమాచారం లేకపోవడంతో పింఛన్లు, ఆహారభద్రత కార్డులకోసం దరఖాస్తులు చేసుకున్న వారు వీటిని పొందలేని పరిస్థితి నెలకొంది.
ఎవరిది తప్పు..
సమగ్రసర్వేలో అధికారులు సైతం నిర్లక్ష్యంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది. అన్నింటికి సమగ్రసర్వే ఆధారమని ప్రభుత్వం ఓవైపు ప్రకటించినప్పటికీ స్థానిక అధికార యంత్రాంగం ఈ విషయంపై శ్రద ్ధ కనబర్చకపోవడంతో సమాచారం గల్లంతైనట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని 263 కుటుంబాల సమాచారాన్ని హుస్నాబాద్ మండలంలోని ఆయా గ్రామాల్లోని కుటుంబాలుగా నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పట్టణమని సర్వేపత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ గ్రామాల్లో ఎందుకు నమోదుచేశారనే దానిపై స్పష్టత కరువైంది. రూరల్‌లో 49 కుటుంబాల సమాచారం ఉన్నప్పటికీ మిగతా సమాచారం ఎక్కడికి వెళ్లందన్నది ఇప్పటికీ అంతుచిక్కడంలేదు. దీనిపై అర్హుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
తిరిగి నమోదుకోసం ప్రయత్నాలు..
సమగ్రసర్వేలో గల్లంతైన కుటుంబాలను తిరిగి నమోదుచేసే ప్రక్రియను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు డీఆర్డీఏ శాఖకు ఈ బాధ్యతలు అప్పగించనట్లు సమాచారం. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ వస్తేనే నమోదుచేసేందుకు వీలుకల్గుతుంది. త్వరలోనే దీన్ని అందించి కుటుంబాల వివరాలను నమోదుచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.