
అదే వేదన ఆతృత
మియాపూర్: హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది వరద ప్రమాదంలో గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రుల వేదన అంతాఇంతా కాదు. ఘటన జరిగి 12 రోజులు దాటినా ఇంకా కొన్ని మృతదేహాలు లభ్యంకాకపోవడంతో వారి సంబంధీకులు తల్లడిల్లిపోతున్నారు. రిస్క్యూటీమ్, భారత రక్షకదళం, ఐటీబీపీ సంయుక్తంగా చేస్తున్న యత్నాలు ఫలించి గురువారం ఒక మృతదేహం లభ్యమైంది.
అది నగరానికి చెందిన శివప్రకాశ్‌వర్మదిగా గుర్తించి వెంటనే విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేయడంతో మియాపూర్ హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. 12 రోజులుగా మృతదేహం లభించకపోవడంతో తమ కుమారుడు ఎక్కడోచోట క్షేమంగా ఉంటాడని భావించిన కుటుంబసభ్యులకు.. నిర్జీవంగా దొరకడంతో కన్నీరుమున్నీరయ్యారు. బాచుపల్లిలోని కాలేజీ నుంచి స్టడీటూర్‌కెళ్లిన తమ కుమారుడు అర్ధాంతరంగా ఇలా వస్తాడని అనుకోలేదని, చేతికంది వస్తాడని భావించిన తమకు గర్భశోకం మిగిల్చాడని తల్లిదండ్రులు గుండెల విసేలా రోదిస్తున్నారు.
నేడు మృతదేహం తరలింపు
హిమాచల్‌ప్రదేశ్ బియాస్‌నదిలో లభ్యమైన శివప్రకాశ్‌వర్మ మృతదేహాన్ని శుక్రవారం హెచ్‌ఎంటీ స్వర్ణపురికాలనీలోని బ్లోసమ్ అపార్ట్‌మెంట్‌కు తీసుకరానున్నారు. విషయం తెలుసుకున్న వీరి సంబంధీకులు అపార్ట్‌మెంట్‌కు తరలివస్తున్నారు.
మాచర్ల అఖిల్ మృతదేహం కూడా..
చైతన్యపురి: బియాస్ నదిలో గల్లంతైన దిల్‌సుఖ్‌నగర్ పీఅండ్‌టీ కాలనీకి చెందిన మాచర్ల అఖిల్ మృతదేహం గురువారం లభ్యమైంది. అఖిల్ మృతదేహం లభ్యమైందని అధికారుల నుంచి ఫోన్ రావటంతో తల్లిదండ్రులు సుదర్శన్, సవితలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి అఖిల్ పార్థీవ దేహం చేరుకుంటుందని కుటుంబసభ్యులు తెలిపారు.