రెండు రోజులైనా..
బోధన్ : అప్పుడే రెండు రోజులు గడిచిపోయాయి. విజ్ఞాన యాత్రకు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో గల బియాస్ నదిలో గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థి ఆచూకీ మాత్రం దొరకలేదు. విద్యార్థి తండ్రి, బంధువులు సంఘటన స్థలానికి వెళ్లారు. సమాచారం కోసం అతడి బంధువులు నిరీక్షిస్తున్నారు. బియాస్ నదిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న జల విషాదంలో బోధన్‌కు చెందిన బీటెక్ విద్యార్థి విష్ణువర్ధన్‌రెడ్డి కూడా చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనలో 24 మంది విద్యార్థులు, అధ్యాపకులు కొట్టుకుపోగా మంగళవారం సాయంత్రానికి ఆరుగురి మృతదేహాలు లభిం చాయి. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
విష్ణువర్ధన్‌రెడ్డి తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి, చిన్నాన్న శ్రీనివాస్‌రెడ్డి, వీరి స్నేహితుడు చాపరాల రాజశేఖర్ సోమవారం సాయంత్రం 5 గంటలకు హిమాచల్‌ప్రదేశ్‌లోని ఘటన స్థలానికి చేరుకున్నారు. లార్జి డ్యాం నుంచి బియాస్ నదిలోకి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సోమవారం రాత్రి 7 గంటలనుంచి మంగళవారం ఉదయం 5 గంటల వరకు గాలింపు చర్యలు నిలిపివేశారని వారు తెలిపారు.రోజంతా గాళింపు జరిపారని, మళ్లీ మంగళవారం రాత్రి 7 గంటలకు గాలింపు చర్యలు నిలిపి వేశారని, బుధవారం ఉదయం గాళింపు చర్యలు మొదలు పెడతారని పేర్కొన్నారు. వాతావరణ ప్రతికూలత, డ్యామ్‌లో నీటి ఉధృతి వల్ల రాత్రి వేళ గాలింపు చర్యలకు ఆటంకంగా ఉంటోందని తెలిపారు.
విషాదంలో..
విష్ణువర్ధన్‌రెడ్డి గల్లంతై రెండు రోజులు గడిచినా ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో విషాదం నెలకొంది. విష్ణువర్ధన్‌రెడ్డి కుటుంబం బోధన్‌లోని రాకాసిపేట్‌లో నివసిస్తోంది. ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. బంధువులు సమాచారం కోసం తెలిసినవారికి ఫోన్‌లు చేస్తున్నారు.