కట్టలు తెగిన కన్నీళ్లు | Concern in the student's parents | Sakshi
Sakshi News home page

కట్టలు తెగిన కన్నీళ్లు

Published Fri, Jun 20 2014 11:54 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

కట్టలు తెగిన కన్నీళ్లు - Sakshi

కట్టలు తెగిన కన్నీళ్లు

చైతన్యపురి,మియాపూర్, చిలకలగూడ: ‘చిన్నప్పట్నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాం..టూర్‌కెళ్లొస్తానని వెళ్లిన కొడుకు కనీసం ముఖం కూడా గుర్తుపట్టలేనంతగా నిర్జీవంగా వచ్చాడు. ఇలాంటి దుఖం పగవారికి కూడా రావొద్దు’ అని హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతై మృతిచెందిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

గురువారం లభించిన మాచర్ల అఖిల్, ఆశీష్‌మంథా, శివప్రకాశ్‌వర్మల మృతదేహాలు శుక్రవారం అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకరాగా.. అక్కడ్నుంచి వారి కుటుంబసభ్యులు ఇళ్లకు తరలించారు. వచ్చీరాగానే కుమారుల మృతదేహాలు చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు భోరు న విలపిం చారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.
 
పలువురు రాజకీయప్రముఖులు, కార్పొరేటర్లు, ప్రజాసంఘాల నాయకులు, తోటి స్నేహితులు తరలివచ్చి మృతదేహాల వద్ద నివాళులర్పించారు. శుక్రవారం సాయంత్రం బంధుమిత్రులు, స్నేహితులు, కాలనీవాసుల అశ్రునయనాల మధ్య ఈ ముగ్గురి అంత్యక్రియలు పూర్తయ్యాయి.
 
మాచర్ల అఖిల్
దిల్‌సుఖ్‌నగర్ పీఅండ్‌టీ కాలనీకి చెందిన మాచర్ల అఖిల్ మృతదేహాన్ని చూసి అఖిల్ తల్లిదండ్రులు సుదర్శన్, సబిత, సోదరుడు విశాల్, బంధువులు పెద్దపెట్టున రోదించారు. కనీసం ముఖం కూడా కనిపించని స్థితిలో ఉండడంతో తట్టుకోలేకపోయారు. ‘అక్కడికెందుకు పోయావురా’ అంటూ తల్లి ఏడవడం అందరిని కలిచివేసింది.
 
శివప్రకాశ్ వర్మ
మియాపూర్‌లోని బ్లోసమ్ అపార్ట్‌మెంట్ కు చెందిన శివప్రకాశ్‌వర్మ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు రవివర్మ, సుబ్బలక్ష్మి, సోదరుడు ధీరజ్‌వర్మ, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. స్టడీటూర్‌కు వెళ్లిన తమ కుమారుడు మరో రెండేళ్లలో చేతికందివస్తాడనుకున్నాం కానీ, ఇలా అర్థాంతరంగా తనువుచాలించి నిర్జీవంగా వస్తాడని అనుకోలేదని తల్లి సుబ్బలక్ష్మి రోదన అందరి హృదయాలను కదిలించింది. అనంతరం బంధువులు, స్నేహితులు అశ్రునయనాల మధ్య ఈఎస్‌ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
 
అశీష్ మంథా
బియాస్ నది దుర్ఘటనలో గల్లంతై మృతిచెందిన అశీష్ మం థా మృతదేహాన్ని చిలకలగూడ శ్రీనివాసనగర్‌లోని ఇంటికి తీసుకొచ్చారు.చలాకీగా టాటా చెబుతూ వెళ్లిన కన్నకొడుకు విగతజీవిగా రావడంతో తల్లి సత్యవాణి కన్నీటిపర్యంతమయ్యారు. ఉబ్బిపోయిన మృతదేహాన్ని చూసి మరింత కడుపుకోతకు గురవుతారని భావించిన బంధువులు బాక్స్‌ను విప్పలేదు. దీంతో ‘కడసారి చూపుకు కూడా నోచుకోలేదా నాయనా’ అంటూ రోదించిన తల్లి సత్యవాణిని ఆపడం ఎవరితరం కాలేదు. భర్త పోయిన విషాదం నుంచి తేరుకోకముందే తనయుడు అశీష్ ప్రమాదవశాత్తు మృతిచెందడంతో తల్లి సత్యవాణి..నేనెందుకు బతకాలి అంటూ బిగ్గరగా ఏడ్చింది. అనంతరం అశీష్ మృతదేహానికి బన్సీలాల్‌పేట శ్మశానవాటిలో అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement