చైర్మన్ చేవెళ్ల రూరల్: డీసీసీ అధ్యక్షుడి మార్పు జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ఎన్నికల సమయంలో అప్పటివరకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న క్యామ మల్లేశ్, చేవెళ్ల మండలానికి చెందిన పడాల వెంకటస్వామి ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే క్యామ టికెట్ దక్కించుకుని ఎన్నికల బరిలో నిలిచారు. అధినాయకత్వం పడాలను బుజ్జగించి డీసీసీ బాధ్యతలు అప్పగించింది. అయితే ఎన్నికల్లో ఓటమిపాలైన క్యామనురిగి డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ ఉత్వర్వులు ఇవ్వడంతో జిల్లా నేతలంతా షాక్‌కు గురయ్యారు.
ఈ ఆనూహ్య మార్పును మల్లేశ్ వైరివర్గం జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన వర్గీయుడైన పడాలను తప్పించి... క్యామకు సారథ్య బాధ్యతలను కట్టబెట్టడంపై తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సీఎల్‌పీ నేత జానారెడ్డితో శుక్రవారం భేటీ అయిన సబిత, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తాజా నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సీనియర్, దళితుడైన వెంకటస్వామిని అనూహ్యంగా పదవి నుంచి మార్చడం ఎంతవరకు సబబని నిలదీసినట్లు సమాచారం. ఈ విషయంపై అధిష్టానంతో చర్చించాలని కూడా స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఈ నెల 24,25వ తేదీల్లో ‘మేధో మథనం’ జరుగుతున్న తరుణంలో పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఒకింత ఆందోళన వ్యక్తం చేసిన జానా... ఈ వ్యవహారంపై హైకమాండ్ పెద్దలతో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు పార్టీవర్గాల భోగట్టా. మరోవైపు డీసీసీ అధ్యక్ష పదవి నుంచి పడాల వెంకటస్వామిని అవమానరీతిలో తప్పించడంపై ఆయన సొంత నియోజకవర్గంలో తీవ్ర అగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సౌమ్యుడిగా పేరున్న పడాలను ఆకస్మికంగా మార్చడాన్ని తప్పుబడుతున్న నేతలు.. పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
పదవులు అమ్ముకుంటున్నారు
పశ్చిమ రంగారెడ్డి ప్రాంతానికి చెందిన దళితుడికి డీసీసీ దక్కిందని సంతోషపడ్డామని, మూడు నెలలకే మార్చడం సమంజసం కాదని మండల పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కొందరు డబ్బులను పదవులు అమ్ముకున్నారని ఆరోపించారు. వెంటనే అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకోకుంటే పశ్చిమ రంగారెడ్డిలోని పార్టీ మండల అధ్యక్షులమంతా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. కొంతమంది పైరవీలు, స్వార్థం కోసమే రోజకీయాలు చేస్తున్నారన్నారు.
పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నిర్లక్ష్య ధోరణి వల్లే పార్టీ మొత్తం నాశనం అవుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సబితారెడ్డిని కలిసి పార్టీలో కొనసాగాలో లేదో తేల్చుకుంటామని అన్నారు. సమావేశంలో జిల్లా పార్టీ కార్యదర్శి శివానందం, ఆలూరు ఎంపీటీసీ సభ్యుడు శ్రీశైలం, నాయకులు అలీ, మాధవరెడ్డి, హన్మంత్‌రెడ్డి, నర్సింలు, శ్రీనివాస్, ఆలూరు నర్సింలు, తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్‌లో కలకలం
Published Fri, Aug 22 2014 11:28 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement