ఆత్మవిశ్వాసమే ఆయుధం | Confidence Arm | Sakshi
Sakshi News home page

ఆత్మవిశ్వాసమే ఆయుధం

Published Wed, Jun 18 2014 2:53 AM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM

Confidence Arm

ఆయనది నిరుపేద కుటుంబం. తండ్రి కొద్దిపాటి వ్యవసాయంతో ఆర్థిక ఇబ్బందులు పడేవారు. తల్లి సుశీలమ్మ వ్యవసాయ కూలీ పనులు చేసేది. ఈ పరిస్థితుల్లో ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివారు. పశువైద్యంలో పట్టభద్రుడై కొన్నాళ్లపాటు పశు వైద్యాధికారిగా పని చేశారు. ప్రతిభ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కష్టాలను అధిగమించి ఐపీఎస్ అధికారి అయ్యారు. ఆయనే గోదావరిఖని ఏఎస్పీగా నియమితులైన కాగినెల్లి ఫకీరప్ప.
 
 కోల్‌సిటీ/పాడేరు(విశాఖ) : రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం జరిగి న ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ఫకీరప్ప జిల్లాకు బదిలీ అయ్యారు. మొన్నటిదాకా ఆయన విశాఖ జిల్లా పాడేరు ఏఎస్పీగా పనిచేశారు. రాష్ట్ర విభజనలో భాగంగా ప్రభుత్వం ఆయ నను తెలంగాణకు కేటాయించడంతో జూన్ 2న పాడేరు ఏఎస్పీ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. బుధవారం ఆయన ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించే అవకాశముంది.
 
 కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా కేంద్రానికి చెందిన ఫకీరప్ప చిన్నతనం నుంచి పేదరికాన్ని అనుభవించారు. తల్లిదండ్రులది నిరుపేద వ్యవసాయ కుటుంబం. తండ్రి బస్వన్న తన కొద్దిపాటి వ్యవసాయం చేస్తూ ఇద్దరు పిల్లలను పెంచి పెద్దచేసేందుకు ఇబ్బందులు పడేవారు. తల్లి సుశీలమ్మ వ్యవసాయ కూలీ పనులు చేస్తూ పిల్లలను సాకేవారు. పిల్లలకు ప్రైవేట్ చదువు చెప్పించలేని దైన్యం వారిది. ఈ పరిస్థితుల్లో ఫకీరప్ప ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివారు. తర్వాత పశువైద్యంలో పట్టభద్రుడయ్యారు. కానీ ఆయన లక్ష్యం సివిల్స్ సాధించడం. కొన్నాళ్లపాటు పశు వైద్యాధికారిగా పని చేశారు. ఓ వైపు ఆ బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు తన లక్ష్యమైన సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ఆయన శ్రమఫలించి 2011లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో విశాఖ జిల్లా పాడేరు ఏఎస్పీగా తొలి పోస్టింగ్ పొందారు. 2013 డిసెంబరు 11న పాడేరు ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఏజెన్సీలోని శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతో ృషి చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలో గత మేలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గిరిజన యువతతో మమేకమై అనేక కార్యక్రమాలను పోలీసుశాఖ ద్వారా నిర్వహించి మంచి ఐపీఎస్ అధికారిగా విశాఖ ఏజెన్సీలో గుర్తింపు పొందారు.
 
 సబ్ డివిజన్‌కు 12వ ఐపీఎస్ అధికారి..
 గోదావరిఖని పోలీస్ సబ్ డివిజన్‌లో ఇప్పటివరకు 27 మంది వివిధ హోదా కలిగిన అధికారులు సేవలందించారు. వీరిలో పదహారు మంది డీఎస్పీ స్థాయి అధికారులు, పదకొండు మంది ఐపీఎస్‌లు కాగా.. పన్నెండవ అధికారిగా ఫకీరప్ప రానున్నారు. గతంలో ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన ఐపీఎస్ అధికారులు తమ పనితీరుతో ప్రత్యేక గుర్తింపును పొందారు. 2008 నుంచి ఐపీఎస్ స్థాయి అధికారులను నియమించకపోవడంతో అప్పటినుంచి డీఎస్పీ స్థాయి అధికారులే సేవలందించారు.
 
 నిన్నమొన్నటి దాకా ఇక్కడ సేవలందించిన డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డిని ప్రభుత్వం ఈ నెల 14న హైదరాబాద్‌లోని ఎస్‌బీఐకి బదిలీ చేసింది. ఆయనను హోం మినిస్ట్రీ కార్యాలయంలో ఓఎస్డీగా అటాచ్ చేసింది. తిరిగి ఆరేళ్ల తర్వాత ఐపీఎస్ అధికారి ఫకీరప్ప గోదావరిఖని ఏఎస్పీగా నియమితులవడం విశేషం. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిసింది. అయితే మంగళవారం రాత్రి వరకు తమకు అధికారిక ఉత్తర్వులు అందలేదని డీఎస్పీ కార్యాలయం అధికారులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement