సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ విద్యార్థికి హైదరాబాద్‌లో చదువుకోవాలని కోరిక. రాజధానిలోని ఓ కాలేజీకి మొదటి ప్రాధాన్యత ఆప్షన్ ఇవ్వడంతో ఆ కాలేజీలో సీటు వచ్చింది. ఆ కాలేజీ బాగా లేదని, మరో కాలేజీకి వెళ్లేందుకు రెండో దశలో ఆప్షన్ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. ‘‘మీకు మొదటి ప్రాధాన్యతలో సీటు లభించింది కాబట్టి రెండో దశలో ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశాన్ని తొలగించాం..’’అని దోస్త్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవ్వడంతో ఆ విద్యార్థి ఆందోళనలో పడ్డారు.
పెద్దపల్లి జిల్లాలోని ఓ గ్రామంలో వరంగల్‌కు చెందిన ఓ కాలేజీ యాజమాన్యం తమ లెక్చరర్లతో ఇంటర్ పూర్తయిన విద్యార్థుల ఇంటింటికీ వెళ్లి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులతోనే తమ కాలేజీలో చదువుకోవచ్చని నమ్మబలికింది. ఐదారుసార్లు ఓ లెక్చరర్ వెళ్లడంతో తల్లిదండ్రులు ఆ విద్యార్థి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చేశారు. అంతే తమ కాలేజీలో సీటు వచ్చేలా ఆ లెక్చరర్ ఆప్షన్ ఇవ్వడంతో అందులో సీటు వచ్చింది. విద్యార్థికి కాలేజీ నచ్చలేదు. పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అదనంగా ఫీజు చెల్లించాలని, లేకపోతే మీకు బయట కూడా సీటు రాదని యాజమాన్యం పేర్కొంటోంది. దీంతో విద్యార్థి గందరగోళంలో పడ్డారు. రెండో దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం లేకుండా పోయింది.
..వీరిద్దరే కాదు.. వేలాది మంది విద్యార్థులదీ ఇదే దుస్థితి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల అవగాహనాలోపం, కొన్ని డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ప్రచారం, మోసం కారణంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండో దశ కౌన్సెలింగ్‌లో అవకాశం లేకపోవడంతో గత్యంతరం లేక మొదటి దశలో సీటు వచ్చిన కాలేజీల్లోనే చేరాల్సిన అగత్యం దాపురించింది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో 1.21 లక్షల మంది విద్యార్థులకు సీట్లు లభించగా, మొదటి ఆప్షన్ మేరకు సీటు లభించిన 85 వేల మంది ఉన్నారు. వీరిలో చాలా మందిది ఇదే పరిస్థితి కావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం మొదటి దశలో, మొదటి ఆప్షన్ మేరకు సీట్లు వచ్చిన వారంతా ఆయా కాలేజీల్లో చేరాల్సిందే. లేదంటే ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ సీటును వదిలేసుకోవాల్సిన పరిస్థితిని అధికారులు కల్పించడం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎంసెట్‌లోనే లేని విధానం ఇక్కడెందుకు?
ఇంజనీరింగ్ వంటి చదువులకు వెళ్లలేని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు, పెద్దగా అవగాహన లేని విద్యార్థులే డిగ్రీలో చేరేందుకు ముందుకు వస్తున్న తరుణంలో ఇలాంటి నిబంధన సరికాదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అవగాహన లేక ముందుగా ఆప్షన్ ఇచ్చినా, యాజమాన్యాల మోసం కారణంగా నష్టపోతే దానిని సరిదిద్దుకునే అవకాశం ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఇలాంటి నిబంధన లేదని, ఏ దశలో సీటు వచ్చినా విద్యార్థులు చివరి దశ వరకు కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని, డిగ్రీలోనూ అలాంటి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే రెండో దశ కౌన్సెలింగ్‌లో అవకాశం ఇస్తే కొన్ని యాజమాన్యాలు తమ కాలేజీల్లో సీట్లు వచ్చేలా విద్యార్థులు అప్షన్లు ఇచ్చుకునేలా ప్రలోభ పెట్టి మోసం చేస్తాయని అధికారులు చెబుతున్నారు. కానీ మొదటి దశలోనే అలాంటి మోసాలు జరిగాయని, వాటిని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment