‘జనావేదన కాదు..కాంగ్రెస్ ఆవేదన’
Published Tue, Feb 28 2017 7:08 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నవి జనావేదన సభలు కావు ... అవి కాంగ్రెస్ ఆవేదన సభలని తెలంగాణా రాష్ర్ట సమితి మండిపడింది. జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలి పెడుతున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడాతూ కేంద్ర మంత్రిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా తాను జాతీయ వాదినని ప్రకటించుకున్నది జైపాల్ కాదా అని ప్రశ్నించారు.
సోనియాతో ఎపుడైనా తెలంగాణపై జైపాల్ చర్చించారా అని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేయకుండా ప్రజాక్షేత్రం నుంచి పారిపోయిన విషయం ఆయనకు తెలియదా అని గుర్తుచేశారు. ఉద్యమంలో కాంగ్రెస్ నేతలను గ్రామాలకు రానివ్వని సంగతి తెలియదా అని అన్నారు.
తెలంగాణ ఏర్పడి రెండున్నరేళ్లు అయిన తర్వాత ఇపుడు వారు ఉద్యమం గురించి మాట్లాడటం ఏమిటన్నారు. జైపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమంపై, ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ప్రజల ప్రశంసలు అందుకోని ప్రభుత్వ కార్యక్రమమేలేదని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడటానికి ఏం లేదు కాబట్టే అనవసర విషయాలపై కాంగ్రెస్ నేతలు దృష్టిపెట్టారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 28 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని, భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతోందని చెప్పారు. జేఏసీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అసలు ఉద్యోగాలే భర్తీ కానట్టు కొందరు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాం కాంగ్రెస్, టీడీపీలతో కలిసి పోయి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.
Advertisement