సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా రాజకీయం భవిష్యత్తులో రసవత్తరంగా మారనుంది. జిల్లా కేంద్ర నియోజకవర్గంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగిత్యాల జిల్లాపై బీజేపీ రాష్ట్ర నేతలు గానీ, ఎంపీ అర్వింద్ గానీ దృష్టి సారించడంలేదనే ఆరోపణ వినిపిస్తోంది. కేవలం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంపీ గెలిచినా పార్టీ పటిష్టం కాలేదు.
జగిత్యాలకు ప్రత్యేక స్థానం
రాష్ట్ర రాజకీయాల్లో జగిత్యాల సీటు ప్రత్యేక స్థానం పొందింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ సంజయ్ విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్‌నేత జీవన్ రెడ్డి ఓటమి పాలవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ పట్టభద్రుల స్థానాన్ని భారీ మెజార్టీతో సాధించుకున్నారు జీవన్‌రెడ్డి. టీఆర్ఎస్‌లో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య పోరు ఎమ్మెల్యే సంజయ్‌కు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం నియోజకవర్గ పర్యటనలకు, నిరసనలకు మినహా పార్టీ బలోపేతంపై దృష్టిసారించకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారనుంది.
చదవండి: పాతబస్తీలో బీజేపీ పాగా వేస్తుందా?.. వ్యూహం ఇదేనా?
జగిత్యాల నుంచి పోటీకి ఆ ఇద్దరి ప్రయత్నాలు
అయితే సంజయ్ కుమార్ ఈసారి టీఆర్‌ఎస్ టికెట్ రాదనే ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలోని ఇద్దరు ముఖ్య నేతలు తామే ఎమ్మెల్యే అభ్యర్ధులమని ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత జగిత్యాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేత ఎల్. రమణ టీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన కూడా జగిత్యాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగవచ్చని అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నారని టాక్. బీజేపీ సైతం ఉనికి పోరాటాలకే పరిమితం అయ్యిందని రాజకీయ విశ్లేషకుల వాదన. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ గెలిచాక జగిత్యాల కూడా అందులో ఉండటంతో కొంత జోష్ పెరిగినా వర్గ విభేదాలు ఎక్కువయ్యాయి.
కొడుకును రంగంలోకి దింపనున్న విద్యాసాగర్
కోరుట్లకు విద్యాసాగర్ రావు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కోరుట్ల నుంచి విద్యాసాగర్ తన కుమారుడు సంజయ్‌ను పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే సంజయ్ హైదరాబాదులో వైద్యుడిగా పని చేస్తున్నారు. ఎన్నికల వాతావారణం రావడంతో సంజయ్ ఇప్పటినుంచే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కాంగ్రెస్ నేతలు మూడు వర్గాలుగా విడిపోయి ఎవరికివారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్ది రాములు, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కొడుకు నర్సింగరావు పోటీకి రెడీ అవుతున్నారు. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన జేయన్ వెంకట్ టికెట్టు ఆశిస్తున్నారు.
చదవండి: గుజరాత్‌లో బీజేపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత.. ఈసారి కాంగ్రెస్‌దే విజయం..
టీఆర్‌ఎస్‌లో కుమ్ములాటలు
ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గం ధర్మపురికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌లో స్థానికంగా కుమ్ములాటలు చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి మీద కొప్పుల ఈశ్వర్‌వి జయం సాధించారు. కొప్పుల ఈశ్వర్ చేతిలో ఓటమి పాలైన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ రీ కౌంటింగ్ కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఎలాగైనా ఈసారైనా ఈశ్వర్‌ను ఓడించాలని లక్ష్మణ్ కుమార్‌పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ టిక్కెట్ తనకే ఇవ్వాలని కోరుతున్నారు.
కొప్పుల ఈశ్వర్‌కు తలనొప్పి
టీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు కొప్పుల ఈశ్వర్‌కు తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం లింక్ 2 లో భాగంగా పైపులైన్ వేసిన భూములకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం తక్కువగా ఉందని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. రోడ్ల వెడల్పులో ఇళ్ళు కోల్పోయినవారికి పరిహారం అందక వారు అధికార పార్టీ మీద గుర్రుగా ఉన్నారు.
ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 15 వార్డుల్లో టీఆఆర్‌ఎస్ ఎనిమిది, కాంగ్రెస్ ఏడు వార్డులు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌కు తరువాత బీజేపీలో చేరిన గడ్డం వివేక్‌కు రెండు పార్టీల కార్యకర్తలతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో ధర్మపురిలో బీజేపీ తరపున నిలిచి గెలవాలని ఆయన ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment