అయోమయంలో కాంగ్రెస్‌ ఆశావహులు | Congress Candidate Waiting For List Nalgonda | Sakshi
Sakshi News home page

అయోమయంలో కాంగ్రెస్‌ ఆశావహులు

Published Wed, Oct 17 2018 9:27 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress Candidate Waiting For List Nalgonda - Sakshi

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్‌ రాజకీయం ఆసక్తి రేపుతోంది. ఒకవైపు మహాకూటమి పొత్తులు.. మరోవైపు టికెట్ల హామీతో ఇతర పార్టీలనుంచి హస్తం గూటికి చేరిన నాయకులు.. ఇంకోవైపు సిట్టింగ్‌ స్థానాలు.. సీనియర్ల నియోజకవర్గాలు.. ఇలా, కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాము కానుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఎన్నికల వేళ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో ఆశావహులు కొంత అయో మయంలో పడ్డారు. పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఒకే కుటుంబంనుంచి రెండు టికెట్ల పీటముడి మరింత గట్టిపడుతోంది. మహాకూటమి గట్టాక, మిత్రులు కోరుతున్న స్థానాల్లో ఏకపక్షంగా అప్పుడే పార్టీ నాయకులు తామే అభ్యర్థులమని ఎలా ప్రచారం చేస్తారన్న భాగస్వామ్య పక్షాల అసంతృప్తి.. వెరసి కాంగ్రెస్‌ ఎన్నికల రాజకీయం రసకందాయంలో పడినట్లే కనిపిస్తోంది. పార్టీ సీనియర్లు, సిట్టింగులు ఉన్న నాగార్జునసాగర్, నల్లగొండ, హుజూర్‌నగర్, కోదాడ మినహా మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో ఏదో ఒక సమస్య, లేదంటే మరేదో లింకు ఉన్నవే కావడం గమనార్హం.

టికెట్‌ హామీ అంతే సంగతులా !
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని పదే పదే చెప్పుకున్నా.. ఆ క్రెడిట్‌ను ఓట్లుగా మలుచుకోలేక గత ఎన్నికల్లో బొక్కా బోర్ల పడిన కాంగ్రెస్‌ జిల్లాలో మాత్రం ఐదు స్థానాల్లో విజయం సాధించింది. తమ మిత్రపక్షంగా ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఐని దేవరకొండలో గెలిపించుకుంది. అంటే 12 స్థానాల్లో ఆరు చోట్ల గెలిచి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఈసారి అధికారంలోకి రావాలంటే ఒక్కో సీటు ఎంతో విలువైనదిగా భావించడంతో ఇతర రాజకీయ పక్షాల నుంచి సీనియర్లను, గత ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు సాధించిన వారిని పార్టీలోకి ఆహ్వానించింది.

ఈ క్రమంలోనే టీడీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బిల్యానాయక్‌ దేవరకొండనుంచి, సూర్యాపేటనుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పటేల్‌ రమేష్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. వీరిద్దరూ రేవంత్‌రెడ్డి వెంట ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు. ఆ సమయంలోనే వీరికి టికెట్‌ హామీ ఇచ్చారన్న  ప్రచారం జరిగింది. మరోవైపు టీఆర్‌ఎస్‌లో అవకాశం రాకపోవడంతో జెడ్పీ చైర్మన్‌ బాలూనాయక్‌ తిరిగి కాంగ్రెస్‌కు వెళ్లిపోయారు.

ఆయన కూడా కాంగ్రెస్‌ పెద్దల దగ్గర టికెట్‌ హామీ తీసుకున్న తర్వాతే పార్టీ మారారని అంటున్నారు. వీరంతా బయటి పార్టీల్లో ఉన్నప్పుడు నియోజకవర్గంలో పార్టీ బరువు బాధ్యతలు చూసిన జగన్‌లాల్‌ నాయక్‌ టికెట్‌పై ఆశపెట్టుకున్నారు. మహా కూటమి పొత్తులో భాగంగా సీపీఐ మరోసారి దేవరకొండను కోరుకుంటోంది. ఈ పరిస్థితుల్లో దేవరకొండ టికెట్‌ ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక, సూర్యాపేటలోనూ ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు ఆర్‌.దామోదర్‌ రెడ్డి టికెట్‌ తనదే అన్న ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టికెట్‌ హామీతోనే పార్టీలో చేరిన పటేల్‌ రమేష్‌రెడ్డికి అవకాశం దక్కుతుందా..? లేదా..? లేకుంటే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది.
 
మెజారిటీ నియోజకవర్గాల్లో పీటముడులు !
సుదీర్ఘ కాలంగా తామే ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడును ఈసారి కూడా కోరుతున్నామని, పొత్తుల్లో భాగంగా స్థానాల కేటాయింపు ఓ కొలిక్కి రాకముందే కాంగ్రెస్‌ నాయకులు ఏకపక్షంగా ఎలా ప్రచారం చేస్తారని మహాకూటమి భాగస్వామ్య పక్షం సీపీఐ మండిపడుతోంది. ఈ నియోజకవర్గంలో ఇటీవల కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రచారం చేయడాన్ని సీపీఐ ఆక్షేపిస్తోంది. ఆలేరులో డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్‌ తనకు టికెట్‌ పక్కా అన్న ధీమాతో ఉన్నారు.

కానీ, సీపీఐ ఈ స్థానాన్ని కూడా ఆశిస్తోంది. ఈ లెక్క తేలకుండా టికెట్లు ఖరారు కాకుండా ప్రచారం ఎలా చేస్తారన్న ప్రశ్న సీపీఐ నుంచి వస్తోంది. పొత్తుల వల్ల ఇరకాటంలో పడిన మరో నియోజకవర్గం నకిరేకల్‌. ఈ స్థానాన్ని తెలంగాణ ఇంటి పార్టీ, టీడీపీ ఆశిస్తున్నాయి. కానీ, కాంగ్రెస్‌ తరపున మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. ఇక, మిర్యాలగూడెంలో కాంగ్రెస్‌ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన భాస్కర్‌ రావు టీఆర్‌ఎస్‌లో చేరడం, ఈ సారి గులాబీ పార్టీ తరఫునే అభ్యర్థిగా నిలబడడంతో ఇక్కడ కాంగ్రెస్‌ టికెట్‌ ఎవరికి ఇస్తారన్న ప్రశ్న ఆసక్తిరేపుతోంది.

జానారెడ్డి ఇక్కడికి మారుతారని జరిగిన ప్రచారానికి ఆయన తెరదించారు. జానారెడ్డి తనయుడు రఘువీర్‌ రెడ్డి పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై అవునని కానీ, కాదని కానీ స్పష్టత ఇచ్చిన వారు లేరు. దీంతో ఇక్కడ కాంగ్రెస్‌ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోతోంది. తుంగతుర్తి, భువనరిగిలో ముగ్గురు చొప్పున పోటీ దారులు ఉండడంతో.. అభ్యర్థులు ఖరారు కాక, ప్రచారం మొదలు పెట్టే అవకాశం లేకుండా పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement