
కాంగ్రెస్ చీఫ్ ‘నాయిని’
డీసీసీ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ
వరంగల్ : కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నాయిని రాజేందర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం డీసీసీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రాజేందర్‌రెడ్డికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ ఎన్నికలకు ముందు 2014 ఏప్రిల్ 17న టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షుడిగా ‘నాయిని’ని నియమించారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం తర్వాత.. నారుుని పింఛన్లు, విద్యుత్ కోతలకు నిరసనగా కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశారు. కీలక నేతలు పార్టీని వీడినా.. పార్టీపై ఆ ప్రభావం పడకుండా చర్యలు చేపట్టారు. అన్నింటి కంటే ముఖ్యంగా గ్రూపులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని సమన్వయంతో నడిపించగలుగుతున్నారు. ఇలా ఎనిమిది నెలలుగా పార్టీకి చేసిన కృషితో రాజేందర్‌రెడ్డికి పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగిస్తూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీసీసీ పూర్తిస్థాయి అధ్యక్ష పదవిని తనకు అప్పగించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీకి, తన నియామకానికి సహకరించిన టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యకు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అభినందనల వెల్లువ
డీసీసీ పూర్తి అధ్యక్షుడిగా నియమితుడైన నాయిని రాజేందర్‌రెడ్డికి జిల్లాలోని పలువురు కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, పీసీపీ మీడియా కన్వీనర్ ఇ.వి.శ్రీనివాసరావు, నాయకులు బిన్ని లక్ష్మణ్, కట్ల శ్రీనివాస్, ధనరాజ్, ప్రదీప్, సాదా శ్రీను, టి.మదు, హరి, నలుబోల రాజు, నెక్కొండ కిషన్, మెడకట్ల సారంగపాణి, బాబురావు, తోట వెంకన్న నాయినిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.