మంచిర్యాల టౌన్ : మంచిర్యాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎంపిక విషయంలో తమను సంప్రదించకపోవడాన్ని నిరసిస్తూ తొమ్మిది మంది కౌన్సెలర్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం ఆవరణలో రాజీనామా లేఖలు ప్రదర్శించారు. కౌన్సిలర్లు మాట్లాడుతూ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పదవి ఎంపిక విషయంలో పార్టీ ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కౌన్సిల్ సభ్యుల తీర్మానం మేరకు ఫ్లోర్ లీడర్‌ను ఎంపిక చేయాలని, కానీ అందుకు విరుద్ధంగా నియామక లేఖను ఎలా తీసుకువస్తారని ప్రశ్నించారు.
తమకు గుర్తింపు లేదని పేర్కొన్నారు. రాజీనామా లేఖలను పార్టీ పట్టణ అధ్యక్షుడు బుద్ధార్థి రాంచందర్‌కు అందజేశామని, బ్లాక్ కాంగ్రెస్ మంచిర్యాల అధ్యక్షుడు వంగల దయానంద్, డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సారగ్‌రావుకు పంపినట్లు తెలిపారు. కౌన్సిలర్లు కల్వల జగన్‌మోహన్‌రావు, కారుకూరి చంద్రమౌళి, బొట్ల సత్యనారాయణ, పులి రాయమల్లు, పడాల రామన్న, బగ్గని రవికుమార్, దోమల పుష్పలత, అంకం సంజీత పాల్గొన్నారు. కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న సీనియర్ కౌన్సిలర్ గరిగంటి సరోజ కూడా తోటి కౌన్సిలర్ల నిర్ణయానికి మద్దతు తెలియజేస్తూ తానూ రాజీనామా చేస్తున్నట్లు విలేకరులకు ఫోన్ ద్వారా తెలిపారు.
మంచిర్యాల కాంగ్రెస్‌లో కల్లోలం
మంచిర్యాల టౌన్ : కాంగ్రెస్ పార్టీకి మంచిర్యాలలో గట్టి షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ప్రజల ఆదరణ పొందని ఆ పార్టీ అధికారం జారవిడుచుకొని ఇప్పటికే వెనుకబడిపోయింది. ఇటీవల అన్ని ఎన్నికల్లో పరాభవాలే ఇందుకు నిదర్శనం. తాజాగా మంచిర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకిచ్చారు ఆ పార్టీ కాంగ్రెస్ కౌన్సిలర్లు. ఏకంగా 9 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. ఈ రాజీనామాల విషయం మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు దృష్టికి తీసుకువెళ్లగా ఫ్లోర్ లీడర్‌గా నియామకం అయిన శ్రీపతి శ్రీనివాస్‌ను శుక్రవారం హైదరాబాద్‌కు రావాల్సిందిగా ఆ పార్టీ ఆదేశాలు జారీ చేసిందని తెలిసింది. ఇక ఏకంగా 9 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా ఇటు పార్టీలోనే సంచలనం కాగా పట్టణంలో పెద్ద చర్చకే దారితీసింది.
మెజారీటీ ఉన్నా..
మంచిర్యాల పురపాలక సంఘం చైర్‌పర్సన్ పీఠాన్ని అధిష్టించేందుకు అవకాశం ఉన్నా కాంగ్రెస్ నాయకుల వ్యూ హ ప్రతివ్యూహాలు బెడిసికొట్టాయి. 32 వార్డులకు గాను కాంగ్రెస్ 18 స్థానాలు, టీఆర్‌ఎస్ 14 కౌన్సిలర్ స్థానాల్లో విజయం సాధించాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ పీఠం దక్కించుకోవాల్సి ఉండగా టీఆర్‌ఎస్ వ్యూహా త్మకంగా కాంగ్రెస్ పార్టీలోని ఆరుగురు కౌన్సిలర్లను తమవైపు తిప్పుకుని వారి మద్దతుతో చైర్‌పర్సన్ పీఠాన్ని కైవ సం చేసుకుంది.
ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరికి వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. దీంతో ఆ ఆరుగురు కౌన్సిలర్లను అధిష్టానం పార్టీ నుంచి బహిష్కరించింది. 18 మందిలో 12 మంది కౌన్సిలర్లే మిగిలి ఉండగా.. ఫ్లోర్‌లీడర్ ఎంపిక వివాదంతో తొమ్మది మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. మిగిలిన ముగ్గురిలో ఇద్దరు తటస్థులుగా ఉండగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పదవి పొందిన కౌన్సిలర్ పార్టీలో ఒకే ఒక్కడుగా మిగిలిపోయారు.
పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు
Published Fri, Aug 22 2014 12:37 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement