కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పొన్నాల, పార్టీ సీనియర్ నేతలు.
పార్టీ 130వ వ్యవస్థాపక దినోత్సవంలో టీపీసీసీ చీఫ్ పొన్నాల
సాక్షి, హైదరాబాద్: దేశంలో లౌకికవాదాన్ని భుజాన మోయగలిగే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ 130 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను ఎవరూ, ఏమీ చేయలేరన్నారు. ప్రజాక్షేత్రంలో గెలుపోటములు అత్యంత సహజమని, కాంగ్రెస్‌చరిత్ర, దేశంకోసం చేసిన త్యాగం ప్రజలకు తెలుసునన్నారు. ‘‘సాధ్యంకాని హామీలు ఇచ్చి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాయి. ఆ రెండు పార్టీలపై భ్రమలు తొలిగిపోతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజాక్షేత్రంలో పోరాడతాం’’ అని పొన్నాల హెచ్చరించారు.
నల్లధనాన్ని వంద రోజుల్లోనే వెనక్కి తెస్తామని గొప్పలు చెప్పుకున్న బీజేపీ.. ఇప్పుడు ఆ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని వి.హనుమంతరావు ప్రశ్నించారు. కార్యక్రమంలో సీఎల్‌పీ నాయకులు కె.జానారెడ్డి, పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, డి.కె.అరుణ, మల్లు రవి, కొనగాల మహేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పీజేఆర్‌కు నివాళి
కాంగ్రెస్ సీనియర్ నేత పి.జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఖైరతాబాద్ జంక్షన్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పీజేఆర్ చేసిన కృషి మరిచిపోలేనిదని పేర్కొన్నారు.