‘టీఆర్‌ఎస్ కార్యకర్తలకు సమితి ముసుగు’
హైదరాబాద్: కేసీఆర్.. టీఆర్‌ఎస్ కార్యకర్తలకు రైతు సమన్వయ సమితి ముసుగేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ చెబుతున్న రెవెన్యూ సదస్సులు కొత్త కాదు.. 1954 నుండి ఆనవాయితీగా జరుగుతూనే ఉన్నాయన్నారు. ఊదరగొట్టే ప్రచారం తప్ప.. జరిగేది ఏమి ఉండదని చెప్పారు. రైతులకు ఇస్తామన్న రూ. 4 వేల పెట్టుబడి రాయితీని వాయిదా వేసే కుట్ర కనిపిస్తుందని విమర్శించారు. మార్కట్ ఇంటర్వ్బెన్షన్కు రూ.400 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటి వరకు 4 రూపాయలు ఖర్చు చేయలేదని అన్నారు.
పౌల్ట్రీ రైతులకు రాయితీ ఇస్తున్న సర్కార్ కు మొక్క జొన్నకు బోనస్ ఇవ్వడానికి డబ్బులు లేవా..? అని ప్రశ్నించారు. రైతులపై ప్రేమ ఉంటే ఖరీఫ్‌కు రైతులకు 4 వేల పెట్టుబడి రాయితీని అందించాలన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు.. ఆయన వ్యక్తిగతమని, నన్ను చేస్తేనే గెలుస్తది అనుకుంటే పొరబాటు అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సమిష్ఠిగా విజయం సాధిస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 80 స్థానాల్లో పార్టీ గెలుపు ఖాయమన్నారు.