Rythu Samanvaya Samithi
-
కేసీఆర్ సీఎం అయ్యాకే దానిపై ఆసక్తి : మంత్రి
సాక్షి, హైదారాబాద్ : రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల నిర్ణయాల కారణంగా వ్యవసాయ రంగం దెబ్బతిన్నదని, కేసీఆర్ సీఎం అయ్యాకే వ్యవసాయంపై అసక్తి చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, అందుకనుగుణంగా బడ్జెట్లో సగానికిపైగా నిధులను ఆ రంగానికే కేటాయించారని తెలిపారు. రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాల రైతులు అడిగే పరిస్థితి వచ్చిందని ప్రశంసించారు. కాళేశ్వరం ద్వారా నీళ్లు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తున్నా లాభాలు రావాలంటే గిట్టుబాటు ధరలతో పాటు రైతులకు బేరమాడే శక్తి రావాలని అభిప్రాయపడ్డారు. హుజూర్నగర్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా కూడా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయిని మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు అదృష్టవంతులని పేర్కొన్నారు. రైతుకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ రైతు లోకానికి ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ. ఇప్పటికే 45వేల చెరువులలో పూడిక తీశామని, కోటీ 25 లక్షల ఎకరాలకు నీరివ్వడం ఖాయమన్నారు. ప్రస్తుతం రైతులు మార్కెట్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. పంటకు గిట్టుబాటు ధర రావడం కోసం మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని, ఏ పంట పండించాలి? ఎక్కడ అమ్ముకోవాలి? అనే అంశాలను రైతే నిర్ధారించే విధంగా రైతు సమన్వయ సమితి కృసి చేస్తుందని వివరించారు. -
వారి వల్లే మంత్రి అయ్యాను : నిరంజన్‌రెడ్డి
సాక్షి, సిద్దిపేట : వరి, పత్తి పంటలే కాకుండా అన్ని పంటలు పండించే విధంగా రైతులు ఆలోచన చేయాలని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ కమిషనర్ రాహుల్ బొజ్జతో కలిసి రైతుమిత్రా మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, వారికోసం ఏ ప్రభుత్వం చేయని పనులను చేస్తున్నామన్నారు. రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 1200 కోట్ల రూపాయలను కేటాయించారని గుర్తించారు. రైతులే తెలంగాణకు ముఖచిత్రమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల యువత కూడా వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారని ప్రశంసించారు. గ్రామంలోనే మార్కెట్ కేంద్రాలు ఉన్నాయని, వాటి వల్ల ప్రతి గ్రామంలో 100 మంది అమాలీలకు ఉపాధి దొరికిందన్నారు. రైతు సమన్వయ సమితి ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఇక హరీశ్‌రావు గురించి మాట్లాడుతూ.. ఎదుటి వ్యక్తి అర్థం చేసుకొని మెదిలే గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. సీఎం కేసీఆర్, హరీశ్ రావు కృషి వల్లే తాను మంత్రి అయ్యానని పేర్కొన్నారు. -
రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను చేపట్టడంతో పాటు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలో నియమించనున్నట్లు సీఎం ప్రకటించారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం మండలిలో ప్రభుత్వ విప్‌గా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జిగా ఉన్న పల్లా.. హుజూర్నగర్ ఉప ఎన్నికలో పార్టీ ఇన్చార్జిగానూ వ్యవహరించారు. మంత్రివర్గ విస్తరణలో పల్లాకు చోటు దక్కుతుందని భావించినా, సామాజిక వర్గాల సమీకరణలో అవకాశం దక్కకపోవడంతో మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే గతంలో రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి మండలి చైర్మన్‌గా ఎన్నిక కావడంతో పల్లాకు అవకాశం కల్పించారు. నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి.. మున్సిపల్ ఎన్నికల తర్వాత పదవుల పందేరం ఉంటుందని భావించినా, ఎన్నికల నిర్వహణపై స్పష్టత రావడం లేదు. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను మొదలు పెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుండటంతో నామినేటెడ్ పదవి ఆశిస్తున్న నేతలు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు కూడా ఆ పదవులను ఆశిస్తుండటంతో తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు క్షేత్ర స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ క్రియాశీల కార్యకర్తలు, నేతలు నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు. మార్కెట్, దేవాలయ కమిటీలు, గ్రంథాలయ సంస్థ పాలక మండళ్లలో చోటు కోసం స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50కి పైగా కార్పొరేషన్లు ఉండగా, అందులో 30 కార్పొరేషన్లు కీలకమైనవి కావడంతో ఆశావహులు తెలంగాణ భవన్, ప్రగతి భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 189 మార్కెట్ కమిటీలకు గాను ప్రస్తుతం 96 మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లు లేవు. మరోవైపు సుమారు 4 వేలకు పైగా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. పల్లాకు కేసీఆర్ అభినందన.. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా తన నియామకంపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి ధన్యవాదాలు తెలిపారు. పల్లాను అభినందించిన ఆయన.. రైతులకు అండగా ఉండేలా రైతు సమన్వయ సమితిలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. వచ్చే జూన్‌లోపు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతు సమన్వయ సమితిలను బలోపేతం చేయాలన్నారు. సమితిల బలోపేతం, రైతులను సంఘటిత శక్తిగా మార్చడం, రైతు వేదికల నిర్మాణం వంటి అంశాలపై మూడు నాలుగు రోజుల్లో సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. -
రైతు సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నియామక ప్రక్రియ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సమన్వయ సమితిలో సభ్యులను త్వరలో నియమిస్తామని సీఎం తెలిపారు. క్యాబినెట్ హోదా కలిగిన ఈ పదవికి మొదటి అధ్యక్షుడిగా వ్యవహరించిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి చైర్మన్‌గా నియమితులవడంతో ఆయన స్థానంలో పల్లాను ముఖ్యమంత్రి నియమించారు. మరోవైపు రైతు సంబంధ అంశాలపై మూడు, నాలుగు రోజులలో వ్యవసాయ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. -
రైతు సమితి రేసులో మహేంద్రుడు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ పదవి రేసులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారా? ఆయన స్వయంగా ఈ కుర్చీని ఆశిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న ఆయన పేరు టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఈ పదవిలో కొనసాగిన నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి.. తాజాగా శాసనమండలి చైర్మన్‌గా నియమితులైన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఆ స్థానంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా మరొకరిని నియమించాల్సి ఉంది. సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేరు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు సైతం చెబుతుండడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. సీఎం కేసీఆర్ పట్నం వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. మొన్నటి వరకు ఆ స్థానంలో రెడ్డి సామాజిక వర్గ నేత ఉండటంతో.. త్వరలో జరిగే నియామకంలోనూ అదే వర్గానికి చెందిన నేతకు కట్టబెట్టే ఆలోచన ఉందనే చర్చ జరుగుతోంది. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేసి ఒక దఫా మంత్రిగా సేవలందించిన ఆయనకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. మహేందర్‌రెడ్డి ఎంతో బలమైన నేతగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందే కేసీఆర్ మీద ఉన్న నమ్మకంతో టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తుండడం ఆయనకు కలిసివచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. -
ఎత్తిపోతల పథకాలకు గ్రహణం
దిలావర్పూర్(నిర్మల్): బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు 13ఏళ్ల క్రితం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు అధికారుల పర్యవేక్షణ కరువై ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదని తెలుస్తోంది. కొన్నేళ్లుగా రైతులకు సాగు నీరందించని దుస్థితి నెలకొంది. ఇందుకు తార్కాణమే గోదావరి పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు. దిలావర్పూర్ మండలంలోని గోదావరి పరివాహక గ్రామాలైన దిలావర్పూర్, బన్సపల్లి, న్యూలలోంలోని బీడుభూములను సాగులోకి తెచ్చేందుకు 2003 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం బన్సపల్లి పరిసరాల్లో ఎత్తిపోతల పథకానికి సంబంధించి స్టేజ్–1 పనులు చేపట్టారు. దీని నిర్మాణంతో బన్సపల్లితో పాటు దిలావర్పూర్, న్యూలోలం గ్రామాలకు సాగు నీరందించేందుకు పంప్‌హౌస్‌లతోపాటు పైపులైన్ నిర్మాణాలు చేపట్టారు. న్యూలోలం గ్రామానికి 1250 ఎకరాల సాగు విస్తీర్ణానికి నీరందించేందుకు రూ.307.85 లక్షల వ్యయంతో పథకాన్ని నిర్మించారు. అలాగే బన్సపల్లి ఎత్తిపోతల పథకం స్టేజ్–1నిర్మాణానికి 800 ఎకరాల్లో సాగు నీరందించడానికి రూ.147.05 లక్షలు వెచ్చించారు. మొదట రెండేళ్లు నీరందించడంతో రైతులు సంతోషంగా పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో పంప్‌హౌస్‌లోని మోటార్లు తరచూ మొరాయించడం, అధికారుల తోడ్పాటు కరువవడంతో ఆయకట్టు రైతులు విసుగుచెంది సాగుకు దూరమయ్యారు. గతంలో న్యూలోలం ఆయకట్టుకు నీరు సరిపోగా పక్క గ్రామమైన సిర్గాపూర్ గ్రామచెరువుకు సైతం నీటిని అందించారు. తదనంతరం పథకం పునరుద్ధరించాలని రైతులు పలుమార్లు మొరపెట్టుకున్నా నేతల నుంచి గానీ, అధికారుల నుంచి స్పందన కరువవడంతో చేసేదిలేక రైతులు ఆశలు వదులుకున్నారు. దిలావర్‌పూర్‌ది ఇదీ పరిస్థితి.. మండలకేంద్రంలో మొదటి స్టేజీ ఎత్తిపోతల పథకం కింద 1500 ఎకరాలకు, రెండో స్టేజీకింద 650 ఎకరాలకు సాగు నీరందించేందుకు రూ.423.05లక్షలు, మూడో స్టేజీ కింద 225 ఎకరాలకు సాగునీరందించేందు రూ.63.46 లక్షలు వెచ్చించి నిర్మించిన పథకాలు నేడు అలంకారప్రాయంగా మారాయి. పథకాలు సమర్థవంతంగా పనిచేసేందుకు సరైన పైపులైన్ ఉండాలి. దిలావర్పూర్ మొదటిస్టేజీ నిర్మాణం నుంచి రెండోస్టేజీ వరకు పైపులైన్ పనులు సక్రమంగా జరిగాయి. అయితే రెండు, మూడో స్టేజీలకు సంబంధించి ప్రారంభం నుంచి తరచూ పైపులైన్ లీకేజీల కారణంగా ఏడాది కూడా రైతులకు నీరందని పరిస్థితి. పైపులైన్ మార్చి నిర్మించాలని పలుమార్లు రైతులు మొరపెట్టుకున్నా పథకంపై పాలకులు స్పందించడం లేదని తెలుస్తోంది. తుప్పు పడుతున్న మోటార్లు ఎళ్ల తరబడి ఎత్తిపోతల పథకాలు మూలనపడడంతో అందుకు సంబంధించిన కొన్ని పరికరాలు చోరీకి గురవుతుండగా మోటార్లన్నీ తుప్పుపట్టిపోతున్నాయి. ఈ పథకాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు, సామగ్రి సైతం అలంకారప్రాయంగా మారాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎత్తిపోతల పథకాల మరమ్మతు కోసం తోడ్పాటునందించి సాగునీరందించాలని రైతులు కోరుతున్నారు. ఎందుకు పనికి రాకుండాపోయింది దిలావర్పూర్లో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం ఆదినుంచి తమకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. పథకం నిర్మాణ సమయంలో రైతు ల అవసరాలు గమనించక కాంట్రాక్టర్లు ఇష్టారీతిన పైపులైన్ నిర్మాణాలు చేపట్టడంతో రైతులకు ఎంతమాత్రం సాగునీరు అందలేదు. తరచూ పైపులైన్లు పగలడంతో పథకం మూలన పడింది. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించి రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాలి. – ఆర్.నర్సయ్య, రైతు, దిలావర్పూర్ ప్రభుత్వం తోడ్పాటునందించాలి కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం దృష్టిసారించి వాటిని పునరుద్ధరించేందుకు కృషి చేయాలి. గ్రామాల్లో రైతులతో కమిటీలు ఏర్పాటు చేసి వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఈమేరకు చర్యలు చేపడితే పథకాలు సమర్థవంతంగా పనిచేసి రైతులకు సాగు నీరు అందే అవకాశం ఉంటుంది. – రవి, రైతు, బన్సపల్లి -
‘కృషి కల్యాణ్’తో రైతు ఆదాయం రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే కృషి కల్యాణ్ అభియాన్ పథకం ముఖ్య ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి నీరజాశాస్త్రి అన్నారు. బుధవారం వ్యవసాయ కమిషనరేట్‌లో ఈ పథకం అమలు తీరుతెన్నులను ఆమె సమీక్షించారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల సమన్వయంతో రైతుల సమగ్ర అభివృద్ధికి, ఉత్పత్తుల పెంపు, ఉత్పాదకత పెంచేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని నీరజాశాస్త్రి అన్నారు. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రైతులకు భూసార కార్డుల పంపిణీ, అపరాలు, నూనెగింజల మినీ కిట్ల పంపిణీ, ఉద్యాన, అటవీ, వెదురు మొక్కలను అందజేయడం, పాడి పశువులకు 100 శాతం వ్యాక్సినేషన్ జరిగేలా చూడటం, గొర్రెలు, మేకల్లో పీపీఆర్ రోగ నివారణ, పశువులకు కృత్రిమ గర్భధారణకు చర్యలు చేపడతామని చెప్పారు. సూక్ష్మ నీటిపారుదల విధానం, సమగ్ర పంటల విధానాన్ని ప్రోత్సహించడానికి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామంలో 10 నుంచి 20 వ్యవసాయ పరికరాలను అందజేస్తామని చెప్పారు. ఈ పథకాన్ని కేంద్రం జూన్ 1 నుంచి జూలై 18 వరకు అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దేశంలోని 115 జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో 25 గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. తెలంగాణ నుంచి ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ పథకాన్ని విజయవంతం చేయాల్సిందిగా వ్యవసాయ కమిషనర్ జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. రైతు సమన్వయ సమితుల సహకారాన్ని తీసుకోవచ్చన్నారు. రోజువారీ నివేదికలను కృషి విజ్ఞాన కేంద్రం పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. -
కాంగ్రెస్‌వి ఆపద మొక్కులు
సాక్షి, హైదరాబాద్ : రైతులు అప్పుల పాలు కాకూడదనే ప్రభుత్వం వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందిస్తోందని, ఇది ఎన్నికల్లో ఓట్ల కోసం కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం ఆపద మొక్కులు మొక్కుతున్నారని, రైతులకు రూ.2 లక్షల రుణాలు మాఫీ చేయడం సాధ్యం కాదని స్పష్టంచేశారు. ఇప్పటివరకు తాము చెప్పిన ప్రతీ పనీ చేశామని, రైతుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో చెప్పని పథకాలు కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుబంధు ద్వారా రెండో విడత పంట పెట్టుబడి సాయాన్ని నవంబర్‌లో అందజేస్తామని ప్రకటించారు. మంగళవారం ‘రైతుబంధు’ పథకంపై సీఎం ప్రగతిభవన్‌లో రైతు సమన్వయ సమితి జిల్లా కో–ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం పంపిణీ, రైతులకు జీవిత బీమా పథకం అమలులో రైతు సమస్వయ సమితి కీలకపాత్ర పోషించాలని సీఎం పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణలో రైతులు ఒకప్పుడు ఎంతో గౌరవంగా బతికేవారు. మంచి వ్యవసాయం సాగేది. రైతులే ఇతరులకు దానాలు చేసే స్థితిలో ఉండేవారు. కానీ రానురాను పరిస్థితి మారింది. సమైక్య రాష్ట్రంలో అవలంబించిన విధానాలతో వ్యవసాయ రంగం దెబ్బతింది. రైతులు అన్ని విధాలా నష్టపోయారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రుణమాఫీ చేసుకున్నాం. కరెంటు బాధ పోయింది. నీళ్ల బాధ పోతంది. పెట్టుబడి ఎట్ల అనే రంధి లేదు. ఇక కావాల్సింది గిట్టుబాటు ధర. అందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. దుక్కి దున్నిన దగ్గర్నుంచి పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ప్రతి దశలో రైతులకు ఏం కావాలో ప్రభుత్వం ఆ పని చేస్తుంది. దానికి అనుగుణంగా రైతులను సమన్వయ పరిచే బాధ్యత రైతు సమన్వయ సమితులు చేపట్టాలి. ఇజ్రాయెల్ దేశంలో లాభదాయక వ్యవసాయం సాగుతోంది. అక్కడ ఉత్పత్తి, ఉత్పాదకత ఎక్కువ. అత్యాధునిక పద్ధతులు పాటించి, అత్యధిక దిగుబడులు పొందుతున్నారు. రైతు సమన్వయ సమితుల జిల్లా కో–ఆర్డినేటర్లు ఇజ్రాయిల్ సందర్శించాలి. అక్కడి వ్యవసాయ పద్ధతులు చూసి నేర్చుకుని రావాలి. ప్రభుత్వమే ఖర్చు భరించి ఇజ్రాయిల్ పర్యటన ఏర్పాటు చేస్తుంది’’ అని సీఎం చెప్పారు. కాంగ్రెస్‌ది అమలు కాని హామీ ఓట్ల కోసం కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని హామీలిస్తోందని, ప్రజలు అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కానీ అది సాధ్యం కాదు. ఇప్పుడు అన్ని విధాలా రాష్ట్రానికి ప్రతి నెలా రూ.10,500 కోట్ల ఆదాయం వస్తుంది. అందులో 2,000 కోట్లు అప్పుల కిస్తీలు కట్టాలి. మరో 6,000 కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, సబ్సిడీలు లాంటి తప్పనిసరి ఖర్చులుంటాయి. మిగిలిన రూ.2,500 కోట్లతోనే ప్రభుత్వం చేసే పనులకు ఖర్చు పెట్టే అవకాశముంది. కాంగ్రెస్ చెప్పినట్లు రుణమాఫీ చేయాలంటే, ఉద్యోగులకు జీతాలివ్వకుండా ఆపేసినా 20 నెలల సమయం పడుతుంది. జీతాలు, అప్పు కిస్తీలు కట్టకుండా అంతకాలం ప్రభుత్వాన్ని నడపడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అందుకే కాంగ్రెస్ ఎలాంటి హామీలిస్తుందో ప్రజలే అర్థం చేసుకోవాలి’’ అని అన్నారు. జూన్ 20లోగా చెక్కులు, బుక్కుల పంపిణీ జూన్ 20 లోగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రికార్డులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి, మార్పు చేర్పులు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. విదేశాల్లో ఉన్న రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు త్వరలోనే ఒక విధానం రూపొందించనున్నట్లు చెప్పారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒకటి చొప్పున క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం ప్రారంభించాలని సీఎం కోరారు. దాతలు విరాళలమిచ్చిన స్థలాల్లో వేదికలు నిర్మించాలని, మిగతా చోట్ల ప్రభుత్వ స్థలాల్లో నిర్మించాలని చెప్పారు. రైతులకు పంట పెట్టుబడి మద్దతు పథకం కింద ఇచ్చిన చెక్కులను కొంతమంది రైతులు తిరిగి ప్రభుత్వానికి ఇస్తున్నారని, ఆ డబ్బులను రైతు సమన్వయ సమితి ఖాతాలో జమ చేయాలని చెప్పారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, వినోద్ కుమార్, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, సిఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, వివిధ జిల్లాల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కో–ఆర్డినేటర్లకు సీఎం చేసిన సూచనలివీ.. రైతులంతా ఒకే రకం పంట వేసి నష్టపోవద్దు. డిమాండ్‌కు తగినట్లు పంటలు పండించేలా రైతులకు అవగాహన కలిగించాలి. నేల స్వభావం, మార్కెట్లో డిమాండ్‌ను బట్టి పంటలు పండించాలి. తెలంగాణలో పండించే ప్రతి గింజకు మంచి ధర వచ్చినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఈ విషయాన్ని రైతులకు విడమరిచి చెప్పాలి. ప్రజల డిమాండ్‌ను తెలుసుకొని దాని ప్రకారం పంటలు పండించాలి. నగరాలు, పట్టణాలకు సమీపంలోని వ్యవసాయ భూముల్లో కూరగాయలు ఎక్కువగా పండించాలి. అన్ని ప్రాంతాల ప్రజలు మన రైతులు పండించిన కూరగాయలే తినాలి. అది అటు రైతులకు, ఇటు వినియోగదారులకు లాభదాయకం, ఆరోగ్యకరం. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. వాతావరణం, నేల స్వభావం, గాలి వేగం, వర్షపాతం, ఉష్ణోగ్రతల ఆధారంగా రాష్ట్రంలోని వ్యవసాయ భూములను క్రాప్ కాలనీలుగా విభజిస్తారు. ఏ కాలనీలో ఏ పంట వేయాలనే విషయంలో వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సూచనలు చేస్తారు. వాటికి అనుగుణంగా పంటలు వేసుకునేలా రైతులకు చైతన్యం కలిగించాలి. మార్కెట్‌కు క్రమ పద్ధతిలో పంటలు తేవాలి. అందరూ ఒకేసారి తమ ఉత్పత్తులు తేవొద్దు. ఏ గ్రామం రైతులు ఎప్పుడు మార్కెట్‌కు సరుకులు తేవాలో ముందుగానే నిర్ణయించాలి. ఉత్పాదకత పెంచే నైపుణ్యం రైతులకు కలిగించాలి. జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఇజ్రాయిల్ వెళ్లి వ్యవసాయ విధానాలు అధ్యయనం చేసి రావాలి. అక్కడ తెలుసుకున్న విషయాలు గ్రామాల్లో పర్యటించి రైతులకు చెప్పాలి. సాగునీరు, విద్యుత్, పెట్టుబడి, గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత మూడేళ్లలో తెలంగాణలో మార్పు కనిపిస్తుంది. రైతుల ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది. రైతులకు ఆధునిక సాగు పద్ధతులను వివరించడానికి, పరస్పరం చర్చించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2500 రైతు వేదికలు నిర్మిస్తున్నాం. ఈ వేదికలను రైతులు ఉపయోగించుకునేలా చూడాలి. రాష్ట్రంలో రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా చేస్తున్నాం. సహజ మరణమైనా సరే బీమా అందుతుంది. 15వ ఆగస్టు నుంచి ఎల్ఐసీ బీమా సర్టిఫికెట్లను రైతులకు అందించాలి. మరణించిన రైతు పేరిట ఉన్న భూమి ఎవరి పేరు మీదికి బదిలీ అవుతుందో.. బీమా పాలసీ కూడా ఆ రైతు పేరిట బదిలీ అవుతుంది. అలా బదిలీ చేసే బాధ్యతను రైతు సమన్వయ సమితులు స్వీకరించాలి. గ్రామాల్లో నకిలీ, కల్తీ ఎరువులు, విత్తనాలు విక్రయించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారిని అధికారులకు పట్టివ్వాలి. పోచారం లక్ష్మీపుత్రుడు: కేసీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి తెలంగాణలో వ్యవసాయానుకూల నిర్ణయాలు జరుగుతున్నాయని, రైతు సంక్షేమానికి అద్భుతమైన పథకాలు అమలవుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీనివాస్‌రెడ్డి లక్షీపుత్రుడని, అందుకే వ్యవసాయానికి అంతా మంచి జరుగుతోందని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రంలోని రైతులు దేశంలోనే ధనిక రైతులుగా మారుతారని తనకు నమ్మకం ఉందని చెప్పారు. -
గుత్తా బాధ్యతల స్వీకారానికి సీఎం!
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వచ్చే అవకాశముందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా గుత్తా పేరును ఇటీవల సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్పొరేషన్‌ను ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేయించే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. నేడో రేపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. అనంతరం జీవో జారీ చేసి అధికారికం గా గుత్తా పేరును ప్రభుత్వం ప్రకటించనుంది. అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. గుత్తా చాంబర్‌ను బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో సిద్ధం చేశారు. అక్కడే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సుఖేందర్‌రెడ్డి సోదరుడు, కుమారుడు వ్యవసాయ కమిషనరేట్‌కు వచ్చి కార్యాలయాన్ని, ఇతర వసతులను పరిశీలించారు. -
ఏప్రిల్ 20న తొలి సాయం
సాక్షి, హైదరాబాద్ : పెట్టుబడి పథకం ద్వారా రైతులకు అందించే ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వర్షాకాలం పంటలకు ఎకరానికి రూ.4 వేల చొప్పున అందించే ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 20న ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. యాసంగి పంటలకు నవంబర్ 18 నుంచి పంపిణీ చేస్తామన్నారు. ఈ పథకానికి అవసరమైన నిధులను బడ్జెట్లోనే కేటాయిస్తామని చెప్పారు. వ్యవసాయ రంగంలో దేశంలో మరే రాష్ట్రం అమలు చేయనన్ని కార్యక్రమాలను తెలంగాణలో అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అందుకే నిధుల సమస్య రాకుండా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అనుగుణంగా ముసాయిదా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. మండల రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సదస్సులను ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సదస్సులో వివరిస్తామని సీఎం వెల్లడించారు. 25న హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో, 26న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. త్వరలోనే రాష్ట్ర రైతు సమితి 42 మంది సభ్యులతో త్వరలోనే రాష్ట్ర రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. అన్ని జిల్లాలకు భాగస్వామ్యం ఉండేలా 30 జిల్లాలకు చెందిన ప్రతినిధులతోపాటు వ్యవసాయ శాఖాధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులను కమిటీలో సభ్యులుగా నియమిస్తామన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న వారిని సభ్యులుగా నియమించాలని, వారి పేర్లు సూచించాలని పేర్కొన్నారు. ఏయే జిల్లాలు ఎక్కడ? హైదరాబాద్‌లో జరిగే ప్రాంతీయ సదస్సుకు జనగామ, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మండల రైతు సమన్వయ సమితి సభ్యులను ఆహ్వానించాలని సీఎం సూచించారు. 26న కరీంనగర్లో జరిగే సదస్సుకు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాలకు చెందిన సభ్యులను ఆహ్వానించాలని చెప్పారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే సదస్సులో రైతులతో సీఎం నేరుగా మాట్లాడతారు. సదస్సులకు హాజరయ్యే మండల రైతు సమన్వయ సమితుల సభ్యుల ప్రయాణ, భోజన సదుపాయాలను వ్యవసాయ శాఖ సమకూర్చాలని సీఎం చెప్పారు. రైతులను సంఘటితం చేయడం, రైతు వేదికల నిర్మాణం–నిర్వహణ, రైతులకు నిరంతర శిక్షణ, పెట్టుబడి పథకం, కనీస మద్దతు ధర అందేలా చూడడం, మార్కెట్లకు ఉత్పత్తులు తీసుకొచ్చే సమయంలో నియంత్రణ పాటించడం, మేలైన సాగు పద్ధతులు, శాస్త్రీయ వ్యవసాయ విధానం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీ చైన్, క్రాప్ కాలనీలు తదితర అంశాలపై సదస్సుల్లో విస్తృతంగా చర్చించాలని సీఎం సూచించారు. సబ్సిడీపై వరి నాటు యంత్రాలు ప్రస్తుతం వ్యవసాయదారులు కూలీల కొరతను ఎదుర్కొంటున్నారని, భవిష్యత్‌లో ఈ సమస్య మరింత ఎక్కువవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. వరినాట్లు వేసే యంత్రాలను సబ్సిడీపై అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, బాల్క సుమన్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎవరిని వరించేనో!
సాక్షి, మెదక్: రాజకీయ భవిష్యత్తుకు బాట వేసే రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్ష పదవిపై పలువురు నేతలు కన్నేశారు. జిల్లా రైతు సమన్వయ సమితి ఏర్పాటుకు కసరత్తు ప్రారంభం కావడంతో ఆశావహులు ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో జిల్లా రైతు సమన్వయ సమితి ఏర్పాటు కానుంది. అధ్యక్షుడు, సభ్యుల నియామకంలో నీటిపారుదల శాఖా మంత్రి టి.హరీశ్‌రావు నిర్ణయమే ఫైనలంటున్నారు పలువురు నాయకులు. మంత్రి ప్రతిపాదించిన వారికే అధ్యక్ష పదవితోపాటు జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీల్లో స్థానం దక్కనుందన్న సమాచారం. దీంతో మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యేల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడి పదవి దక్కితే భవిష్యత్తులో రాజకీయంగా ఉపయోగపడుతుందని భావిస్తున్న వారు పదవి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వీటి ద్వారా ప్రభుత్వం రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు మార్కెటింగ్ వ్యవహారాల్లో రైతులకు వెన్నుదన్నుగా ఉండేందుకు ఈ సమితుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇది వరకే గ్రామ స్థాయిలో 15 మంది సభ్యులు, మండల స్థాయిలో 24 మంది సభ్యులతో రైతు సమితిలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 381 రెవెన్యూ గ్రామాలు, 20 మండలాలతో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 24 మంది సభ్యులతో జిల్లా సమితి ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఈ వారం చివరి వరకు జిల్లా సమితి ఏర్పాటు కొలిక్కిరానుంది. జిల్లా కమిటీలది కీలక పాత్ర రైతు సమన్వయ సమితుల్లో జిల్లా కమిటీలది కీలకపాత్ర కానుంది. ఈ కమిటీ పరిధిలోని మండల, గ్రామ కమిటీలు పనిచేయాల్సి ఉంటుంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి సమితులు పూర్తయిన తర్వాత వీటికి బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రతి జిల్లా సమితికి నిధులు కేటాయించి వాటి ద్వారా మండల, గ్రామ కమిటీలకు నిధులు ఖర్చు చేసే బాధ్యతను అప్పగించనున్నట్లు సమాచారం. గ్రామాల్లో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయటం, అమ్మడం బాధ్యతలు జిల్లా కమిటీ పర్యవేక్షించనుంది. పంటల సాగుపై రైతులకు శిక్షణ తరగతుల నిర్వహణ, వ్యవసాయ అధికారులతో సమావేశాలు, పంట కాలనీల ఏర్పాటు, ఎరువుల పంపిణీలో సైతం జిల్లా కమిటీ బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం వచ్చే సాగు పెట్టుబడి రూ.4వేలు కూడా వీరి ద్వారా అందజేయనుంది. ఈ చెక్కులు ఆర్హులైన రైతులకు సకాలంలో అందేలా జిల్లా కమిటీల పర్యవేక్షణ చేసే బాధ్యతను ప్రభుత్వం అప్పగించనున్నట్లు సమాచారం. రానున్న ఖరీఫ్ నుంచి జిల్లా, మండల, గ్రామ సమితులు రైతులతో కలిసి పనిచేయనున్నాయి. రైతు సమస్యలు తెలిసిన వారికే.. జిల్లా రైతు సమన్వయ సమితి కోసం పలువురు పోటీ పడుతున్నట్లు సమాచారం. పాపన్నపేట మండల సమితి అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కమిటీ సభ్యులు టి. సోములు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే శివ్వంపేట మండల సమితి అధ్యక్షుడు నర్సింహారెడ్డి, కౌడిపల్లి సమన్వయక కమిటీ అధ్యక్షుడు రామాగౌడ్లు జిల్లా సమితి అధ్యక్ష పదవికోసం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే వ్యవసాయంపై అవగాహన ఉండి, రైతు సమస్యలు తెలిసి ఉన్న వారికి జిల్లా సమితి అధ్యక్ష పదవి కట్టబెట్టాలని మంత్రి హరీశ్‌రావు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లా కమిటీ సభ్యులుగా జిల్లాలోని అన్ని మండలాల నుంచి భాగస్వామ్యం ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. -
రైతు సమన్వయ సమితుల జాడెక్కడ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ప్రక్రియ అసంపూర్తిగానే నిలిచిపోయింది. ఇప్పటివరకు కేవలం గ్రామ, మండల రైతు సమన్వయ సమితులనే ఏర్పాటు చేసింది. జిల్లా, రాష్ట్ర సమన్వయ సమితుల జాడే లేకుండా పోయింది. వాస్తవంగా గ్రామ, మండల, జిల్లా రైతు సమస్వయ సమితులను గతేడాది సెప్టెంబర్ 9 నాటికి ఏర్పాటు చేయాలని అప్పట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ కేవలం గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, వాటికి సభ్యుల నియామకమే పూర్తయింది. జిల్లా, రాష్ట్ర సమన్వయ సమితుల ఏర్పాటు ఇప్పటికీ పూర్తికాలేదు. వాటి ఏర్పాటు ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో కూడా వ్యవసాయశాఖ వర్గాలు చెప్పలేకపోతున్నాయి. రైతులకు అందుబాటులో ఉండాలని... రైతులకు అన్నివేళలా అందుబాటులో ఉండేలా సమన్వ య సమితులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు ఎకరానికి రూ. 4 వేలు ఇవ్వడంలో సహకరించాలని, విత్త నం వేసే దగ్గరి నుంచి గిట్టుబాటు ధర వరకు సమితులు కీ లక పాత్ర పోషించాలన్నది సర్కారు ఆలోచన. ఆ ప్రకారం గ్రామ రైతు సమితిలో 15 మంది, మండల, జిల్లా సమితుల్లో 24 మంది, రాష్ట్రస్థాయిలో 42 మందిని నియ మించాలని నిర్ణయించింది. రాష్ట్ర సమితి సభ్యులను సీ ఎం, మిగిలిన స్థాయి సమితి సభ్యులను మంత్రులు నియమించేలా ఉత్తర్వులిచ్చింది. కానీ ఇప్పటివరకు గ్రామ, మండల సమితుల ఏర్పాటే జరిగింది. జిల్లా సమితులకు సభ్యుల ఎంపికలో సర్కారు తాత్సారం చేస్తోంది. ఏంచేయాలో అర్థం కాని సభ్యులు... గ్రామ, మండల సమన్వయ సమితి సభ్యుల నియామకం పూర్తయి 3 నెలలు దాటినా బాధ్యతలపై ప్రభుత్వం స్పష్ట త ఇవ్వలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక సభ్యులు గందరగోళంలో ఉండిపోయారు. ఖరీఫ్‌లో పండిన పత్తి, కంది తదితర పంటలకు సరైన ధర వచ్చేలా కృషి చేయాలని, మార్కెట్‌కు వచ్చే రైతులకు సమితి సభ్యులు సూచనలిచ్చేలా కలెక్టర్లకు వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ ఆదేశాలు పెద్దగా అమల వలేదు. మరోవైపు సమన్వయ సమితులను కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. దాని ఏర్పాటు ఎప్పుడు జరుగుతుందో స్పష్టత కరువైంది. -
‘టీఆర్ఎస్ కార్యకర్తలకు సమితి ముసుగు’
హైదరాబాద్: కేసీఆర్.. టీఆర్ఎస్ కార్యకర్తలకు రైతు సమన్వయ సమితి ముసుగేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ చెబుతున్న రెవెన్యూ సదస్సులు కొత్త కాదు.. 1954 నుండి ఆనవాయితీగా జరుగుతూనే ఉన్నాయన్నారు. ఊదరగొట్టే ప్రచారం తప్ప.. జరిగేది ఏమి ఉండదని చెప్పారు. రైతులకు ఇస్తామన్న రూ. 4 వేల పెట్టుబడి రాయితీని వాయిదా వేసే కుట్ర కనిపిస్తుందని విమర్శించారు. మార్కట్ ఇంటర్వ్బెన్షన్కు రూ.400 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటి వరకు 4 రూపాయలు ఖర్చు చేయలేదని అన్నారు. పౌల్ట్రీ రైతులకు రాయితీ ఇస్తున్న సర్కార్ కు మొక్క జొన్నకు బోనస్ ఇవ్వడానికి డబ్బులు లేవా..? అని ప్రశ్నించారు. రైతులపై ప్రేమ ఉంటే ఖరీఫ్‌కు రైతులకు 4 వేల పెట్టుబడి రాయితీని అందించాలన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు.. ఆయన వ్యక్తిగతమని, నన్ను చేస్తేనే గెలుస్తది అనుకుంటే పొరబాటు అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సమిష్ఠిగా విజయం సాధిస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 80 స్థానాల్లో పార్టీ గెలుపు ఖాయమన్నారు.